బాబుకు తొత్తులు కావద్దు: అధికారులకు బొత్స హెచ్చరిక
అధికారులు నీతి మాలిన పనులు చేయవద్దని, అధికారం ఉంది కదా అని రాజకీయ నాయకులు చెప్పినట్టు చేస్తే దాని ఫలితం అనుభవించేది మీరేనని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ హితవు పలికారు. హైదరాబాద్‌లోని వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఐదేళ్ళకోసారి ఎన్నికలు జరుగుతాయని, ఇపుడు చేసిన పనులకు అప్పుడు తలదించుకునే పరిస్థితులు ఏర్పడతాయని అధికారులు గుర్తుంచుకోవాలని ఆయన హితవు చెప్పారు. అధికారులు వ్యవస్థలో భాగమని, వారు ఇష్టానుసారంగా పనిచేస్తే వ్యవస్థ గాడి తప్పుతుందని, దీన్ని […]
Advertisement
అధికారులు నీతి మాలిన పనులు చేయవద్దని, అధికారం ఉంది కదా అని రాజకీయ నాయకులు చెప్పినట్టు చేస్తే దాని ఫలితం అనుభవించేది మీరేనని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ హితవు పలికారు. హైదరాబాద్‌లోని వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఐదేళ్ళకోసారి ఎన్నికలు జరుగుతాయని, ఇపుడు చేసిన పనులకు అప్పుడు తలదించుకునే పరిస్థితులు ఏర్పడతాయని అధికారులు గుర్తుంచుకోవాలని ఆయన హితవు చెప్పారు. అధికారులు వ్యవస్థలో భాగమని, వారు ఇష్టానుసారంగా పనిచేస్తే వ్యవస్థ గాడి తప్పుతుందని, దీన్ని మళ్ళీ సరిదిద్దడానికి ఎంతో సమయం పడుతుందని బొత్స చెప్పారు. చట్ట ప్రకారం అధికారులు విధులు నిర్వహిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదని, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని వ్యవహరిస్తే తాత్కాలికంగా ఎవరు నష్టపోయినా తుదకు సంబంధిత అధికారులే నష్టపోతారని బొత్స అన్నారు.
నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధికారులను లోబరుచుకుని చేసే వికృత చేష్టలు ప్రజలు గమనిస్తున్నారని, బలం లేని చోట్ల ఇలాంటి పనులు చేసి పదవులు సంపాదించుకుంటే ప్రజలు దాన్ని సిగ్గుమాలిన పనిగా గుర్తిస్తారని, ఇప్పటికే ఎన్నికల్లో చంద్రబాబు చేసిన వాగ్దానాలు నమ్మి మోస పోయిన జనం బాబును గద్దె దించడానికి అవకాశం కోసం చూస్తారని బొత్స హెచ్చరించారు. ఒక్క ఎమ్మెల్సీ పదవి కోసం సిగ్గుమాలిన అవినీతి పనులు చేయడానికి పూనుకోవడం నీచమైన ఆలోచన అని, దీని ఫలితం అన్ని వ్యవస్థలపై ఉంటుందని, చంద్రబాబు ఇప్పటికైనా ఇలాంటి పనులు మానుకోవాలని హితవు పలికారు.
సెక్షన్ 8 అమలుపై స్పందిస్తూ రాష్ట్ర విభజన చట్టం అమలులోకి వచ్చినప్పటి నుంచే ఇవన్నీ అమలు చేయాల్సి ఉందని, అది సెక్షన్ 8 అయినా 9 అయినా ఒకటే. విభజన చట్టం ప్రకారం అన్నీ అమలు కావాల్సిందే. హైదరాబాద్ ఇరు తెలుగు రాష్ట్రాలకు మరో తొమ్మిదేళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. అలాంటప్పుడు విభజన చట్టం ఉన్నవన్నీ వర్తిస్తాయి. వర్తింపజేయాలి అని బొత్స ఉద్ఘాటించారు. అయితే ఓటుకు నోటు కేసులో చంద్రబాబు తప్పించుకునేందుకు దీన్ని లేవనెత్తడం తప్పు అని ఆయన అన్నారు. ఓటుకు నోటు కేసు నుంచి తనను బయట పడేయమని, టీఆర్ఎస్ నాయకులతో సయోధ్య కుదర్చమని బాబు ఢిల్లీ పెద్దలను బతిమాలుకున్నారని బొత్స ఆరోపించారు. ఆడియో టేపుల్లో స్వరం తనది కాదని బాబు ఎందుకు చెప్పడం లేదని ఆయన నిలదీశారు. టీడీపీ ఆరోపిస్తున్నట్టు జగన్ ఎవరినీ కలవలేదని, దురుద్దేశ్యంతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని బొత్స ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా, ఉన్నత విద్యా సంస్థలు వంటి అంశాలపై ఢిల్లీ పెద్దలను ఎందుకు నిలదీయడం లేదని ఆయన అన్నారు. తనను అవినీతిపరుడంటున్న టీడీపీకి తగిన ఆధారాలున్నాయా అని ఆయన ప్రశ్నించారు.
Advertisement