ఇక డిజిటల్‌ రేషన్‌ కార్డులు

రేష‌న్ కార్డుల‌కు ఆధార్‌ను అనుసంధానం చేయనున్నారు. ఈ డిజిట‌ల్ కార్డుల‌తో న‌కిలీ రేష‌న్ కార్డుల‌కు బ్రేక్ ప‌డ‌నుంది. ఆధార్ నంబ‌ర్ యాడ్ చేయ‌డం ద్వారా కార్డులో ఉన్న ల‌బ్దిదారులు అక్రమంగా రెండో రేష‌న్ కార్డును క‌లిగి ఉండ‌టం సాధ్యం కాదు.

Advertisement
Update:2023-06-30 11:46 IST

తెలంగాణ‌లో కొత్త  రేష‌న్ కార్డుల‌కు మోక్షం రానుంది. న‌కిలీ రేషన్ కార్డుల‌కు చెక్‌ పెడుతూ దేశంలోనే తొలిసారిగా డిజిట‌ల్ రేష‌న్ కార్డుల‌కు శ్రీకారం చుడుతోంది కేసీఆర్ ప్రభుత్వం. దిగువ మ‌ధ్య‌ త‌ర‌గ‌తి పేద‌ల‌కు కొత్తగా రేష‌న్ కార్డులిచ్చేందుకు తెలంగాణ స‌ర్కార్ సిద్దం అవుతోంది. కొత్త కార్డులు ఇవ్వాలని కొన్నేళ్లుగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నా.. న‌కిలీ కార్డుల ఏరివేత సవాల్‌గా మారింది. దీంతో నకిలీ కార్డులకు చెక్‌ పెట్టేందుకు డిజిటల్ రేష‌న్ కార్డుల‌కు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ఈ రేష‌న్ కార్డుల‌ పంపిణీకి ద‌స‌రాను ముహూర్తంగా పెట్టుకుంది స‌ర్కార్.

మూడేళ్ల‌ క్రితం ప్రభుత్వం కొత్త రేష‌న్ కార్డులివ్వాల‌ని చూసినా అడుగు ముందుకు ప‌డ‌లేదు. ప్రస్తుతం తెలంగాణలోని 33 జిల్లాల్లో 90 ల‌క్షల 14 వేల 263 రేషన్‌ కార్డులున్నాయి. అంటే రేషన్‌ పొందుతున్న వారు దాదాపు 2 కోట్ల 83 ల‌క్షల మంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర జ‌నాభాలో మూడింట రెండు వంతుల జ‌నాభాకు రేష‌న్ కార్డులు ఉన్నట్లు. దీనిపై చాలా కాలంగా నేష‌న‌ల్ ఫుడ్ సెక్యూరిటీ మంత్రిత్వ శాఖ‌ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. కానీ, రేషన్‌ కార్డులను ఎత్తివేస్తే రాజకీయ విమర్శలు ఎదురవుతాయనే సంశయంతో ప్రభుత్వం జాప్యం చేస్తూ వచ్చింది. ఇప్పుడు నేష‌న్ ఇన్ఫర్మేటిక్ సెంట‌ర్ స‌హకారంతో కొత్త రేష‌న్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టనుంది కేసీఆర్ స‌ర్కార్.

పేద‌ల ఆహార భ‌ద్రత‌లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా దారిద్ర రేఖకు దిగువ గల కుటుంబాలకు రేష‌న్ కార్డులు మంజూరు చేస్తాయి. వీటి ద్వారా పేద‌ల‌కు సబ్సిడీతో ఆహార ధాన్యాల పంపిణీ జరుగుతుంది. వంట గ్యాస్ కూడా స‌బ్సిడీతో లభిస్తుంది. రేషన్‌ కార్డులో నమోదై ఉన్న ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఇలా ప్రతి నెల రాష్ట్రంలో 1.80 ల‌క్షల ట‌న్నుల బియ్యాన్ని పేద‌ల‌కు పంపిణీ చేస్తోంది.

ఇక రేష‌న్ కార్డు, పాస్ పోర్ట్, పాన్ కార్డు లాంటివి రెసిడెన్సీ ఫ్రూఫ్ కింద ఉపయోగపడుతుంటాయి కూడా. దీంతో కొంద‌రు నకిలీ రేష‌న్ కార్డుల‌ను సృష్టించుకుంటున్నారు. ఫలితంగా పేద‌లకు అందాల్సిన నిత్యావసర స‌రుకులు ప‌క్కదారి ప‌డుతున్నాయి. ఈ అక్రమాలకు చెక్‌పెట్టేందుకు ఇప్పుడు నేష‌న్ ఇన్ఫర్మేటిక్‌ సెంట‌ర్ స‌హ‌కారంతో అత్యాధునిక సాంకేతిక‌త‌తో కొత్త రేష‌న్ కార్డుల‌ను ప్రవేశ పెట్టేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమైంది. రేష‌న్ కార్డుల‌కు ఆధార్‌ను అనుసంధానం చేయనున్నారు. ఈ డిజిట‌ల్ కార్డుల‌తో న‌కిలీ రేష‌న్ కార్డుల‌కు బ్రేక్ ప‌డ‌నుంది. ఆధార్ నంబ‌ర్ యాడ్ చేయ‌డం ద్వారా కార్డులో ఉన్న ల‌బ్దిదారులు అక్రమంగా రెండో రేష‌న్ కార్డును క‌లిగి ఉండ‌టం సాధ్యం కాదు. ఒకసారి రేష‌న్ కార్డుల డిజిట‌లైజేష‌న్ పూర్త‌యితే, ఇక న‌కీలీ కార్డులు వచ్చే అవకాశం ఉండదు.

రాష్ట్రంలో పేద‌వాడికి రేష‌న్ స‌రుకులు అందించేందుకు పూర్తి పార‌ద‌ర్శక‌త‌తో డిజిటల్‌ కార్డులకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఈ కొత్త కార్డుల‌ను ద‌స‌రా నాటికి పంప‌ణీ చేయాల‌ని నిర్ణయించింది. దీనికోసం ఇప్పటి నుంచే అధికారులు క్షేత్రస్థాయిలో క‌స‌ర‌త్తు మొద‌లు పెట్టారు.

Tags:    
Advertisement

Similar News