సీఎం కేసీఆర్ రాక కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నారు : ఏపీ స్టూడెంట్ జేఏసీ నాయకులు

బీఆర్ఎస్‌ను ఏపీలో గెలిపించుకుంటే.. తప్పకుండా ప్రత్యేక హోదా సాధించుకోవచ్చని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Advertisement
Update:2023-08-19 07:35 IST

ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ నాయకుల స్వార్థ, అసమర్థ రాజకీయాల వల్ల అక్కడి ప్రజల బతుకులు దుర్భరంగా మారాయి. తెలంగాణ తరహాలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఏపీలో కూడా కావాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. సీఎం కేసీఆర్ రాక కోసం ఏపీ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని ఏపీ స్టూడెంట్, యువజన జేఏసీ నాయకులు అన్నారు. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ రాకతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని వారు అభిప్రాయపడ్డారు.

ఏపీ విద్యార్థి, యువజన జేఏసీ నాయకులు శుక్రవారం హైదరాబాద్‌లో పర్యటించారు. హుస్సేన్‌సాగర్ సమీపంలో కొత్తగా ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహంతో పాటు నూతన సచివాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షుడు రాయపాటి జగదీశ్ మాట్లాడుతూ.. తొమ్మిదేళ్లలోనే తెలంగాణను సీఎం కేసీఆర్ దేశానికే రోల్ మోడల్‌గా తీర్చి దిద్దారని ప్రశంసించారు.

ఏపీకి జరుగుతున్న అన్యాయాలపై కేంద్రాన్ని నిలదీసే ధైర్యం సీఎం వైఎస్ జగన్, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు లేవని మండిపడ్డారు. అక్కడి ప్రజల స్వార్థ రాజకీయాల కారణంగానే రాష్ట్రం అభివృద్ధి చెందడం లేదని ఆరోపించారు. తెలంగాణ తరహా సంక్షేమ, అభివృద్ధి పథకాలు తమకు కూడా కావాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు.

కేసీఆర్ త్వరగా ఏపీకి రావాలని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అక్కడ త్వరలోనే భారీ బహిరంగ సభ నిర్వహించాలని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఏపీలో బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని జగదీశ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్‌ను ఏపీలో గెలిపించుకుంటే.. తప్పకుండా ప్రత్యేక హోదా సాధించుకోవచ్చని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 

Tags:    
Advertisement

Similar News