ఆదిపురుష్ థియేటర్ల వద్ద యుద్ధకాండ
హైదరాబాద్ లోని థియేటర్లో హనుమంతుడికి కేటాయించిన సీట్లో కూర్చున్నందుకు ఓ వ్యక్తిపై ప్రభాస్ అభిమానులు దాడికి పాల్పడ్డారంటూ మరో వీడియో చక్కర్లు కొడుతోంది.
ఆదిపురుష్ సినిమా విడుదలైంది. ఆదిపురుష్ రివ్యూ అని సోషల్ మీడియాలో టైప్ చేస్తే లెక్కలేనన్ని మీమ్స్ హల్ చల్ చేస్తున్నాయి. దర్శకుడు ఓం రౌత్ 2 నెలలపాటు మారువేషంలో తిరగాలని, లేకపోతే ఫ్యాన్స్ చేతిలో బలైపోవడం ఖాయమని వార్నింగ్ లు వినపడుతున్నాయి. ఆ సంగతి పక్కనపెడితే ఆదిపురుష్ థియేటర్ల వద్ద యుద్ధకాండ జరగడం మాత్రం విశేషం.
గతంలో ఇతర హీరోల అభిమానులు థియేటర్ల వద్ద హంగామా చేసినా ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం కాస్త డీసెంట్ గానే ఉండేవారు. ఇప్పుడు ప్రభాస్ అభిమానులు కూడా థియేటర్ల వద్ద రచ్చ రచ్చ చేస్తున్నారు. సినిమా నచ్చకపోయినా, సౌండ్ సిస్టమ్ బాగోలేకపోయినా గొడవ గొడవ చేస్తున్నారు. నిజంగా అభిమానులే ఇలా చేస్తున్నారా, ఆ ముసుగులో వేరెవరైనా కావాలనే ఇలాంటి సీన్లు క్రియేట్ చేస్తున్నారా అనేది తేలాల్సి ఉంది. సినిమా లేట్ గా ప్రదర్శించారనే కారణంతో సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని జ్యోతి థియేటర్ వద్ద గొడవ చేశారు అభిమానులు. యాజమాన్యం సర్దిచెప్పడంతో సైలెంట్ అయ్యారు, ఆ తర్వాత సౌండ్ సిస్టం సరిగా లేదని, డైలాగులు అర్థం కావడం లేదంటూ మళ్లీ గొడవకు దిగారు. థియేటర్ అద్దాలు పగలగొట్టారు. దీంతో యాజమాన్యం సినిమా ప్రదర్శన ఆపివేసింది.
హైదరాబాద్ లోని భ్రమరాంబ థియేటర్లో హనుమంతుడికి కేటాయించిన సీట్లో కూర్చున్నందుకు ఓ వ్యక్తిపై ప్రభాస్ అభిమానులు దాడికి పాల్పడ్డారంటూ మరో వీడియో చక్కర్లు కొడుతోంది.
ఇక హైదరాబాద్ లో సినిమా రివ్యూ చెబుతున్న ఓ వ్యక్తిపై ప్రభాస్ ఫ్యాన్స్ దాడి చేసిన వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. సినిమా బాలేదని చెబుతున్న వ్యక్తిని ప్రభాస్ అభిమానులు చితగ్గొట్టారు. దాడి వీడియో వైరల్ కావడంతో సినిమా గురించి మరింత చర్చ జరుగుతోంది.
సినిమా నచ్చలేదని థియేటర్లో అభిమానులు రచ్చ చేశారంటూ మరో వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మొత్తమ్మీద ఆదిపురుష్ సినిమా థియేటర్ల వద్ద ఫ్యాన్స్ యుద్ధకాండ సృష్టించారని అర్థమవుతోంది.