మంత్రి జూపల్లికి నిరసన సెగ.. సొంత పార్టీ కార్యకర్తల రాళ్ల దాడి
మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కృష్ణమోహన్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. బండ్ల చేరికను మొదటి నుంచి సరితా తిరుపతయ్య తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో మళ్లీ కొద్దిరోజుల్లోపే కృష్ణ మోహన్ రెడ్డి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు.
మంత్రి జూపల్లి కృష్ణారావుకు సొంత పార్టీ కార్యకర్తల నుంచి నిరసన సెగ ఎదురైంది. గద్వాల జిల్లాలో రిజర్వాయర్ల పరిశీలనకు వెళ్లిన జూపల్లి కృష్ణారావు కాన్వాయ్‌ను అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. జూపల్లి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
మంత్రి కాన్వాయ్‌పై రాళ్ల దాడితో గద్వాల జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాడి చేసిన వాళ్లు గద్వాల కాంగ్రెస్ అభ్యర్థి సరితా తిరుపతయ్య అనుచరులని తెలుస్తోంది. దాడి తర్వాత జూపల్లి కృష్ణారావు సరితా తిరుపతయ్య ఇంటికి వెళ్లగా.. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మధ్యలోనే కారు దిగి తన ఇంటికి వెళ్లిపోయారు.
అసలు వివాదం ఏంటి -
2023 అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థి సరితా తిరుపతయ్యపై గెలుపొందారు. అయితే మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కృష్ణమోహన్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. బండ్ల చేరికను మొదటి నుంచి సరితా తిరుపతయ్య తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో మళ్లీ కొద్దిరోజుల్లోపే కృష్ణ మోహన్ రెడ్డి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. తర్వాత జూపల్లి కృష్ణారావు స్వయంగా జోక్యం చేసుకుని బండ్లను మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువచ్చారు. దీంతో సరితా తిరుపతయ్య వర్గీయులు జూపల్లిపై ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కాన్వాయ్‌పై రాళ్ల దాడి చేసినట్లు తెలుస్తోంది.