పారిస్ ఒలింపిక్స్ కు 'విశాఖ బుల్లెట్ '!

తెలుగుతేజం, విశాఖ బుల్లెట్ జ్యోతి యర్రాజీ చరిత్ర సృష్టించింది. పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించింది.

Advertisement
Update: 2024-07-03 06:59 GMT

తెలుగుతేజం, విశాఖ బుల్లెట్ జ్యోతి యర్రాజీ చరిత్ర సృష్టించింది. పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించింది.

ఆంధ్రా రన్నర్, స్టీల్ సిటీ బుల్లెట్ జ్యోతి యర్రాజీ చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్ లో భారత్ వందేళ్ల చరిత్రలో మరే మహిళ సాధించని ఘనత సొంతం చేసుకొంది.

2024 పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనే భారత అథ్లెట్ల బృందంలో చోటు దక్కించుకొంది.

భారత తొలి మహిళా అథ్లెట్ జ్యోతి...

ఒలింపిక్స్ మహిళల 100 మీటర్ల హర్డల్స్ రేస్ లో భారత్ తరపున బరిలోకి దిగనున్నతొలి మహిళగా రికార్డుల్లో చేరనుంది. పారిస్ ఒలింపిక్స్ కు ట్రాక్ అండ్ ఫీల్డ్ అంశాలలో అర్హత సాధించిన భారత అథ్లెట్ల జాబితాను అంతర్జాతీయ ఒలింపిక్స్ సమాఖ్య ఖరారు చేసింది.

మహిళల 100 మీటర్ల హర్డల్స్ లో జ్యోతి యర్రాజీ, షాట్ పుట్ అభా ఖటువాల పేర్లు ఈ జాబితాలో చోటు చేసుకొన్నాయి. ఒలింపిక్స్ అర్హత పోటీల ద్వారా నిర్ధేశించిన లక్ష్యాలను చేరుకోలేని పలువురు అథ్లెట్లకు ప్రపంచ ర్యాంకింగ్స్ ప్రాతిపదికన పారిస్ బెర్త్ లు ఖాయమయ్యాయి.

ట్రాక్ అండ్ ఫీల్డ్ లో 32 మంది అథ్లెట్ల అర్హత..

ఇటీవలే ముగిసిన అంతర్ రాష్ట్ర్ర అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొన్న అథ్లెట్లు సత్తా చాటుకోగలిగారు. మొత్తం 32 మంది భారత అథ్లెట్లు పారిస్ ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అంశాలలో పాల్గొనబోతున్నారు.

పురుషుల హైజంప్ లో జాతీయ చాంపియన్ సర్వేశ్ అనీల్ కుషారే, జావలిన్ త్రోయర్ డీపీ మను సైతం ఒలింపిక్స్ కు అర్హత సంపాదించగలిగారు. ఒలింపిక్స్ పురుషుల జావలిన్ త్రోలో భారత్ కు ప్రపంచ విజేత నీరజ్ చోప్రా, కిశోర్ కుమార్ జెనా ప్రాతినిథ్యం వహించనున్నారు. డోపింగ్ నిబంధనల కారణంగా మను ఒలింపిక్స్ లో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది.

34వ ర్యాంకర్ గా ఆంధ్రా రన్నర్ కు చాన్స్...

పారిస్ ఒలింపిక్స్ అర్హత కోసం 100 మీటర్ల హర్డిల్స్ రేస్ లో 12.77 సెకన్ల సమయాన్నినిర్ణయించారు. అయితే..ఫిన్లాండ్ వేదికగా జరిగిన ఓ అంతర్జాతీయ మీట్ లో జ్యోతి 12.78 సెకన్ల టైమింగ్ తో ఒలింపిక్స్ అర్హతను సెకనులో వందవ వంతులో చేజార్చుకొంది. ప్రపంచ ర్యాంకింగ్స్ ప్రకారం మొదటి 40 స్థానాలలో ఉన్నవారికి ఒలింపిక్స్ లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఈ ప్రాతిపదికన 34వ ర్యాంకర్ గా ఉన్న జ్యోతికి పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనే అవకాశం దక్కినట్లయ్యింది.

షాట్ పుట్ ప్లేయర్ అభా ఖటువా 18.41 మీటర్ల రికార్డు సాధించినా అనూహ్యంగా ఒలింపిక్స్ బెర్త్ సంపాదించగలిగింది.

స్టీల్ సిటీ నుంచి పారిస్ ఒలింపిక్స్ వరకూ...

స్టీల్ సిటీ విశాఖపట్నంలోని ఓ దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి దూసుకొచ్చిన జ్యోతి యర్రాజీ 24 ఏళ్ల వయసుకే పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనే స్థాయికి ఎదిగిపోయింది.

క్రీడలంటే కనీస అవగాహన లేని వయసులో..12 సంవత్సరాల చిరుప్రాయంలో ట్రాక్ అండ్ ఫీల్డ్ లో అడుగుపెట్టిన జ్యోతి ఎర్రాజీకి ఆదినుంచి అంతా గందరగోళమే.

కుటుంబ పోషణ కోసం తండ్రి వాచ్ మెన్ గా, తల్లి ఓ ప్రయివేటు ఆస్పత్రిలో శుభ్రం చేసే పనిలో ఉంటూ నానాకష్టాలు పడుతున్నా చదువుకోసం జ్యోతిని స్కూలుకు పంపుతూ ఉండేవారు.

ఉదయం నుంచి సాయంత్రం వరకూ తరగతి గదిలో కూర్చొని పాఠాలు వినడం అంటే చిన్నారి జ్యోతికి పరమచిరాకు. కనీసం ఆఖరి పీరియడ్ లోనైనా అధికారికంగా క్లాసు ఎగ్గొట్టడం కోసం ఆటల బాటపట్టింది.

ఏ ఆటను ఎలా ఆడతారన్న కనీస అవగాహన సైతం లేకుండానే మైదానంలోకి అడుగుపెట్టింది. బాల్యం నుంచి తనకు తెలియకుండానే మెరువేగంతో పరుగెత్తడం జ్యోతికి అలవాటు. జ్యోతిలోని ఈ ప్రతిభను గుర్తించి అథ్లెటిక్స్ ( ట్రాక్ అండ్ ఫీల్డ్ ) అర్హత పోటీలకు పంపడంతో దశ తిరిగిపోయింది. భారత క్రీడాప్రాధికార సంస్థ నిర్వహించిన 2016 ఎంపిక పోటీలలో సత్తా చాటుకోడం ద్వారా జ్యోతికి స్పోర్ట్స్ హాస్టల్ ప్రవేశం దక్కింది. అథ్లెటిక్స్ లో విఖ్యాత శిక్షకుడు, ద్రోణాచార్య అవార్డు గ్రహీత ధర్మపురి రమేశ్ శిష్యురాలిగా హైదరాబాద్ సాయి హాస్టల్ లో శిక్షణ మొదలు పెట్టింది.

17 ఏళ్ల వయసు నుంచే టాప్ గేర్....

చిరుప్రాయంలో స్పోర్ట్స్ హాస్టల్ ప్రవేశం పొందిన జ్యోతికి ఏ అంశం ఎంచుకోవాలో తెలియని అయోమయం. దీనికితోడు..ఓ అథ్లెట్ కు కావాల్సిన శక్తిసామర్థ్యాలు తక్కువగా ఉండడంతో కోచ్ రమేశ్ సైతం అయోమయ పరిస్థితినే ఎదుర్కొనాల్సి వచ్చింది.

హైజంప్, జావలిన్ త్రో, లాంగ్ జంప్, పరుగు అంశాలలో తన అదృష్టం పరీక్షించుకొని విఫలమయ్యింది. చివరకు.. అథ్లెట్ల ఫిట్ నెస్ కోసం నిర్వహించే ఫిజియో టెస్టుల్లో సైతం విఫలమవుతూ తన కోచ్ సహనానికే పరీక్షగా నిలిచింది.

జ్యోతికి శిక్షణే దండుగ అనుకొంటున్న తరుణంలో హర్డల్స్ అంశంలో రాణించడం మొదలు పెట్టింది. 2017 జాతీయ యువజన అథ్లెటిక్స్ మీట్ లో ఎలాంటి అంచనాలు లేకుండా హర్డిల్స్ ట్రాక్ లోకి దిగిన జ్యోతి ఏకంగా బంగారు పతకమే సాధించింది.

రిలయన్స్ ఫౌండేషన్ శిక్షణలో....

ఆ తర్వాత..భువనేశ్వర్ కేంద్రంగా రిలయన్స్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న అథ్లెటిక్స్ అకాడమీలో ప్రవేశం సంపాదించిన జ్యోతి రన్నర్ గా రాటుదేలింది. బ్రిటీష్ శిక్షకుడు జేమ్స్ హిల్లియర్ పర్యవేక్షణలో మేటి రన్నర్ గా రూపుదిద్దుకొంది.

100 మీటర్ల హర్డిల్స్ లో తన తొలిరేస్ ను పూర్తి చేయటానికి 22 సెకన్ల సమయం తీసుకొన్న జ్యోతి ప్రస్తుతం 12.84 సెకన్ల అత్యుత్తమ టైమింగ్ నమోదు చేసింది. ప్రస్తుత సీజన్ లో ఇప్పటికే ఐదుసార్లు 13 సెకెన్ల లోపే టైమింగ్ సాధించి వారేవ్వా అనిపించుకొంది.

భువనేశ్వర్ వేదికగా జరిగిన ఇంటర్ స్టేట్ మీట్ లో సీనియర్ రన్నర్ శ్రావణి నందాను ఓడించడం ద్వారా బంగారు పతకం అందుకొంది. ఆసియా అత్యుత్తమ హర్డిల్స్ నలుగురు మేటి రన్నర్లలో ఒకరిగా జ్యోతి నిలిచింది.

బ్యాంకాక్ లో బంగారు మోత.....

ఆసియా అమెచ్యూర్ అథ్లెటిక్స్ సమాఖ్య 50 సంవత్సరాల వేడుకలలో భాగంగా ..బ్యాంకాక్ వేదికగా జరిగిన 25వ ఆసియా ట్రాక్ అండ్ ఫీల్డ్ మీట్ లో జ్యోతి రెండు వేర్వేరు విభాగాలలో స్వర్ణ, రజత పతకాలు సాధించడం ద్వారా సంచలనం సృష్టించింది.

మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌ రేస్ లో ఈ తెలుగు మెరుపుతీగ 13.09 సెకన్లలో లక్ష్యాన్ని చేరి స్వర్ణపతకం కైవసం చేసుకొంది. 23 ఏళ్ల జ్యోతికి ఇదే తొలి అంతర్జాతీయ స్వర్ణం కావడం విశేషం.

పోటీల చివరి రోజున నిర్వహించిన మహిళల 200 మీటర్ల పరుగులో మాత్రం జ్యోతి రజత పతకంతో సరిపెట్టుకొంది. 200 మీటర్ల దూరాన్ని 23.13 సెకన్లలో చేరి రెండో స్థానంలో నిలిచింది. సింగపూర్‌ రన్నర్‌ వెరోనికా (22.70) పసిడి విజేతగా నిలిచింది.

విశాఖలోని ఓ నిరుపేద కుటుంబానికి చెందిన జ్యోతి ఆసియా స్థాయిలో దేశానికి రెండు పతకాలు అందించడం ద్వారా గర్వకారణంగా నిలిచింది.ఈనెల ఆఖరివారంలో పారిస్ వేదికగా జరుగునున్న 2024 ఒలింపిక్స్ లో సైతం దేశానికి ఏదో ఒక పతకం సాధించాలన్న లక్ష్యంతో సాధన చేస్తోంది. దిగ్గజ రన్నర్ పీటీ ఉష కు తగిన వారసురాలిని తానేనని నిరూపించుకోవాల్సిన బాధ్యత తెలుగుతేజం జ్యోతి ఎర్రాజీపైన ఎంతైనా ఉంది.

పారిస్ ఒలింపిక్స్ జులై 26 నుంచి ఆగస్టు 11 వరకూ జరుగనున్నాయి.

Tags:    
Advertisement

Similar News