తొలిరౌండ్ ఓటమితో నిఖత్ జరీన్ కన్నీరుమున్నీరు!

పారిస్ ఒలింపిక్స్ మహిళల బాక్సింగ్ లో తొలిరౌండ్లోనే భారత బాక్సర్, తెలంగాణా స్టార్ నిఖత్ జరీన్ కు చుక్కెదురయ్యింది.

Advertisement
Update:2024-08-01 19:54 IST

పారిస్ ఒలింపిక్స్ మహిళల బాక్సింగ్ లో తొలిరౌండ్లోనే భారత బాక్సర్, తెలంగాణా స్టార్ నిఖత్ జరీన్ కు చుక్కెదురయ్యింది.

పారిస్ ఒలింపిక్స్ ఆరవ రోజు పోటీలలో భారత్ ను మింగుడు పడని ఫలితాలు ఉక్క్రిరిబిక్కిరి చేశాయి. ఖచ్చితంగా పతకాలు సాధించగలరనుకొన్న బాక్సింగ్, బ్యాడ్మింటన్ స్టార్లు విఫలమయ్యారు.

మహిళల బాక్సింగ్ 50 కిలోల విభాగంలో ఏదో ఒక పతకం సాధించగలనన్న ధీమాతో ఒలింపిక్స్ లో అడుగుపెట్టిన తెలుగు బాక్సర్ నిఖత్ జరీన్ తొలిరౌండ్ ఓటమితోనే కన్నీరుమున్నీరయ్యింది.

ప్రపంచ నంబర్ వన్ బాక్సర్ చేతిలో పరాజయం...

ప్రపంచ బాక్సింగ్ విజేత నిఖత్ జరీన్ ..పారిస్ ఒలింపిక్స్ కోసం గత ఏడాది కాలంగా కఠోరశిక్షణ పొందటంతో పాటు శారీరకంగా, మానసికంగా సిద్ధమైవచ్చింది. అయితే..నిఖత్ కు క్లిష్టమైన డ్రా రావటంతో నిరాశ తప్పలేదు.

50 కిలోల విభాగం తొలిరౌండ్లోనే చైనాకు చెందిన ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ బాక్సర్ ఉయుతో తలపడాల్సి వచ్చింది. ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ లో చైనా బాక్సర్ 5-0తో నిఖత్ ను చిత్తు చేసింది.

మొత్తం 5 రౌండ్ల ఈ పోరు రెండోరౌండ్లో మాత్రమే నిఖత్ కాస్త ప్రతిఘటన ఇచ్చింది. మిగిలిన నాలుగురౌండ్లు ఏకపక్షంగానే సాగటంతో చైనా బాక్సర్ నే జడ్జీలు విజేతగా ప్రకటించారు.

తొలిరౌండ్లో జర్మన్ బాక్సర్ మాక్సి కరీనాను అలవోకగా ఓడించిన 28 ఏళ్ల నిఖత్..తనకంటే బలమైన బాక్సర్ కు సరిజోడి కాలేకపోయింది. అన్ సీడెడ్ గా పోటీకి దిగటం నిఖత్ అవకాశాలను బాగా దెబ్బతీసింది.

ప్రీ-క్వార్టర్స్ లోనే అనుకోని ఓటమితో గేమ్స్ నుంచి నిష్క్ర్రమించిన నిఖత్ కన్నీరుమున్నీరయ్యింది. అభిమానులను క్షమాపణలు కోరింది. ఈ ఓటమి తనకు ఓ గుణపాఠమని, గత ఏడాదిగా చేసిన సాధన ప్రీ-క్వార్టర్స్ ఓటమితో ఫలితం లేకుండా పోయిందని వాపోయింది. మరింత సాధనతో వచ్చే ఒలింపిక్స్ కు సిద్ధమవుతానని ప్రకటించింది.

ఆరుగురు బాక్సర్లలో నలుగురు ఇంటికి...

ఒలింపిక్స్ బాక్సింగ్ బరిలోకి భారత్ ఆరు వేర్వేరు విభాగాలలో ఆరుగురు బాక్సర్లతో పోటీకి దిగితే నలుగురు బాక్సర్లు తొలిరౌండ్లోనే నిష్క్ర్రమించారు. నిఖత్ తొలి రౌండ్ విజయం సాధించిన అనంతరం ఓటమిని ఎదుర్కొనాల్సి వచ్చింది.51 కిలోల విభాగంలో అమిత్ పంగల్, 57 కిలోల విభాగంలో జాస్మిన్ లాంబోరియా, 54 కిలోల విభాగంలో ప్రీతి పవార్ ప్రారంభరౌండ్లలోనే పరాజయాలు చవిచూశారు.

భారత బాక్సర్లలో లవ్లీనా బోర్గెయిన్ మాత్రమే క్వార్టర్ ఫైనల్స్ చేరడం ద్వారా పతకానికి గెలుపు దూరంలో నిలువగలిగింది. 71 కిలోల విభాగంలో నిశాంత్ దేవ్ సైతం పతకానికి గెలుపు దూరంలో ఉన్నాడు.

హాకీలో భారత్ తొలి ఓటమి...

పురుషుల హాకీ గ్రూపు-బి లీగ్ లో భారత్ తొలి ఓటమి చవిచూసింది. ఒలింపిక్స్ చాంపియన్, ప్రపంచ మేటి బెల్జియం జట్టుతో జరిగిన గ్రూపు నాలుగోరౌండ్ పోటీలో భారత్ 1-2 గోల్స్ తో పరాజయం ఎదుర్కొంది.

ఆట మొదటి భాగంలోనే గోల్ సాధించిన భారత్ ఆ తరువాత బెల్జియం దూకుడుకు తలవంచాల్సి వచ్చింది. రెండో భాగంలో బెల్జియం 2 గోల్స్ సాధించడం ద్వారా పూల్ టాపర్ గా నిలిచింది.

గ్రూపు ప్రారంభమ్యాచ్ లో న్యూజిలాండ్ ను 3-2తోనూ, అర్జెంటీనాతో పోటీని 1-1తోను, ఐర్లండ్ పై 2-0 గోల్స్ విజయాలు సాధించడం ద్వారా భారత్ క్వార్టర్ ఫైనల్స్ చోటు సంపాదించగలిగింది.

పూల్ ఆఖరి రౌండ్ పోరులో మరో గట్టిజట్టు ఆస్ట్ర్రేలియాతో భారత్ తలపడనుంది.

బ్యాడ్మింటన్ డబుల్స్ లో అనుకోని దెబ్బ...

బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ లో ఏదో ఒక పతకం సాధించగల సత్తాకలిగిన ప్రపంచ మూడో ర్యాంక్ జోడీ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ షెట్టిల పోటీ క్వార్టర్ ఫైనల్స్ లోనే ముగిసింది.

చైనాకు చెందిన అగ్రశ్రేణి జట్టు చేతిలో భారతజోడీ మూడుగేమ్ ల పరాజయం చవిచూడాల్సి వచ్చింది.

Tags:    
Advertisement

Similar News