ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఓటమి, భారత్ రికార్డు విజయం!

టెస్టు క్రికెట్ టాప్ ర్యాంకర్ భారత్ చరిత్ర సృష్టించింది. ఇంగ్లండ్ తో ఐదుమ్యాచ్ ల టెస్ట్ లీగ్ సిరీస్ ను 4-1తో నెగ్గిన రెండోజట్టుగా రికార్డుల్లో చేరింది.

Advertisement
Update:2024-03-09 17:24 IST

టెస్టు క్రికెట్ టాప్ ర్యాంకర్ భారత్ చరిత్ర సృష్టించింది. ఇంగ్లండ్ తో ఐదుమ్యాచ్ ల టెస్ట్ లీగ్ సిరీస్ ను 4-1తో నెగ్గిన రెండోజట్టుగా రికార్డుల్లో చేరింది.

ఐసీసీ టెస్టులీగ్ చరిత్రలో భారత్ అతిపెద్ద సిరీస్ విజయం నమోదు చేసింది. 2023-25 టోర్నీలో భాగంగా జరిగిన ఐదుమ్యాచ్ ల సిరీస్ లో ఇంగ్లండ్ ను 4-1తో చిత్తు చేయడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పింది.

ధర్మశాల వేదికగా మూడురోజుల ముచ్చటగా ముగిసిన ఆఖరి, 5వ టెస్టులో సైతం భారత హవానే కొనసాగింది. ఇంగ్లండ్ ను రెండో ఇన్నింగ్స్ లో 195 పరుగులకే కుప్పకూల్చడం ద్వారా ఆతిథ్య భారత్ ఇన్నింగ్స్ 64 పరుగుల విజయంతో సిరీస్ విజయం పూర్తి చేసింది.

గత వందేళ్లలో తొలిజట్టుగా...

147 సంవత్సరాల సాంప్రదాయ టెస్టు చరిత్రలో ఐదుమ్యాచ్ ల సిరీస్ ను 4-1తో నెగ్గిన రెండోజట్టుగా, గత వందేళ్లలో తొలిజట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. ఐదుమ్యాచ్ ల ఈ సిరీస్ ను ఓటమితో మొదలు పెట్టిన రోహిత్ సేన ఆ తర్వాతి నాలుగు (విశాఖ, రాజకోట, రాంచీ, ధర్మశాల ) టస్టుల్లో తిరుగులేని విజయాలతో విజేతగా నిలిచింది.

రాంచీ టెస్టు విజయంతోనే 3-1తో సిరీస్ ఖాయం చోసుకొన్న భారత్ కు ధర్మశాల వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో గట్టిపోటీ తప్పదని అందరూ భావించారు. అయితే..రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత యువజట్టు మాత్రం కేవలం మూడురోజుల ఆటలోనే ఇంగ్లండ్ ను ఇన్నింగ్స్ ఓటమితో మట్టి కరిపించింది.

రెండో ఇన్నింగ్స్ లో అశ్విన్ మ్యాజిక్...

ఇంగ్లండ్ ను తొలి ఇన్నింగ్స్ లో 218 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్ రెండో ఇన్నింగ్స్ లో 195 పరుగులకే పరిమితం చేసింది. 265 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ను వందోటెస్టు హీరో అశ్విన్ తన స్పిన్ జాదూతో కకావికలు చేశాడు.

తొలిఇన్నింగ్స్ లో 4 వికెట్లు పడగొట్టిన అశ్విన్ రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లు సాధించడం ద్వారా ఇంగ్లండ్ పై ఇన్నింగ్స్ విజయాన్ని ఖాయం చేశాడు. తన వందో టెస్టుమ్యా్ చ్ లో 9 వికెట్లు పడగొట్టిన భారత బౌలర్ గా అశ్విన్ రికార్డుల్లో చేరాడు.

టెస్టు చరిత్రలో మూడో బౌలర్....

తమ కెరియర్ లో వందో టెస్టుమ్యాచ్ ఆడుతూ ఐదు వికెట్లు పడగొట్టిన మూడో స్పిన్నర్ గా అశ్విన్ చరిత్ర సృష్టించాడు, గతంలో ముత్తయ్య మురళీధరన్, షేన్ వార్న్ సైతం తమ నూరోటెస్టు ఆడుతూ 5 వికెట్ల ఫీట్ సాధించారు.

ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలే, బెన్ డకెట్, వన్ డౌన్ ఓలీ పోపే, కెప్టెన్ బెన్ స్టోక్స్, వికెట్ కీపర్ బ్యాటర్ బెన్ ఫోక్స్ లను పెవీలియన్ దారి పట్టించాడు. తన టెస్టు కెరియర్ లో ఓ ఇన్నింగ్స్ లో 5 వికెట్లు పడగొట్టడం అశ్విన్ కు ఇది 36వసారి.

బ్యాటింగ్ లో ఓ ఆటగాడు సెంచరీ సాధించడం ఎంత గొప్పో...బౌలింగ్ లో ఓ బౌలర్ 5 వికెట్లు పడగొట్టడం కూడా అంతే గొప్పగా పరిగణిస్తారు. భారత దిగ్గజ బౌలర్లు కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే తమ వందో టెస్టు మ్యాచ్ లో 7 వికెట్లు చొప్పున పడగొడితే..అశ్విన్ 9 వికెట్లతో సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

నాడు కుంబ్లే- నేడు అశ్విన్...

2005లో శ్రీలంకపై తన నూరో టెస్టు ఆడుతూ అనీల్ కుంబ్లే తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు సాధిస్తే..2024లో అశ్విన్ తన వందో టెస్టు ఆడుతూ రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లు, రెండు ఇన్నింగ్స్ లో కలసి 9 వికెట్లు పడగొట్టడం ద్వారా సంచలనం సృష్టించాడు. కుంబ్లే పేరుతో ఉన్న 35 సార్లు 5 వికెట్ల రికార్డును అశ్విన్ 36వసారి పడగొట్టడం ద్వారా అధిగమించాడు.

ఇంగ్లండ్ ఆఖరి వికెట్ గా జో రూట్ అవుట్ కావడంతో భారత్ ఇన్నింగ్స్ 64 పరుగుల విజయంతో సిరీస్ ను 4-1తో కైవసం చేసుకోగలిగింది. భారత బౌలర్లలో అశ్విన్ 5 వికెట్లు, బుమ్రా, కుల్దీప్ చెరో 2 వికెట్లు, జడేజా ఓ వికెట్ పడగొట్టారు.

లెఫ్టామ్ స్పిన్నర్ కుల్దీ్ప్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ఓపెనర్ యశస్వి జైశ్వాల్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి.

Tags:    
Advertisement

Similar News