మీ ఇంటి సంగతి మీరు చూసుకోండి..
టీఆర్‌ఎస్‌తో తమకు ఇలాంటి గొడవలు లేవని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు. తన ఇంట్లో ఏం జరుగుతోందో చూసుకోకుండా పక్కింటిలోకి తొంగిచూడడం వల్ల ఉపయోగం ఉండదని పేర్కొన్నారు.
ఏపీ ప్రభుత్వ విధానాలపై తెలంగాణ మంత్రి హరీష్‌రావు విమర్శలు చేయడాన్ని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి తప్పుపట్టారు. అసలు హరీష్‌రావుకు హఠాత్తుగా ఇంత ఆవేశం ఎందుకొచ్చిందో అర్థం కావడం లేదన్నారు. ఏపీలో జగన్‌కు వ్యతిరేకంగా తయారైన ఒక గ్యాంగ్ ఎజెండాకు తగ్గట్టుగానే హరీష్‌రావు వ్యాఖ్యలున్నాయన్నారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదం కూడా కానీ అంశాలపై హరీష్‌రావు వ్యాఖ్యలు చేయడం బట్టి ఏపీలో పనిచేస్తున్న జగన్ వ్యతిరేక క్యాంపులో ఈయన చేరినట్టుగా అనిపిస్తోందన్నారు. లేదంటే ఆయన జగన్‌ను విమర్శిస్తే తిరిగి తాము కేసీఆర్‌ను ఏదైనా అంటే అప్పుడు హరీష్‌రావుకు ఆనందం కలుగుతుందేమోనన్నారు. టీఆర్‌ఎస్‌లో అంతర్గతంగా ఏం జరుగుతోందో తమకు తెలియదన్నారు.
విద్యుత్ మీటర్లపై ఎవరి అభిప్రాయం వారిదని.. తామేమీ మీరూ పెట్టండి అని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం లేదు కదా అని ప్రశ్నించారు. హరీష్‌రావు వ్యాఖ్యలను ఆయన వ్యక్తిగత సమస్యలతో చేసినవిగానే తాము చూస్తామన్నారు. టీఆర్‌ఎస్‌తో తమకు ఇలాంటి గొడవలు లేవన్నారు. తన ఇంట్లో ఏం జరుగుతోందో చూసుకోకుండా పక్కింటిలోకి తొంగిచూడడం వల్ల ఉపయోగం లేదన్నారు. అసలు పక్క రాష్ట్రం వ్యక్తి ఏపీని కించపరిచేలా మాట్లాడుతుంటే ఇక్కడి మీడియాకు ఆనందం ఏంటో అర్థం కావడం లేదన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.