జగనన్న 'ఆరోగ్య' సురక్ష.. ఏపీలో మరో వినూత్న పథకం

ఇటీవల 'జగనన్న సురక్ష' ద్వారా నేరుగా అధికారులే ఇంటికి వచ్చి వివరాలు సేకరించి అవసరమైన సర్టిఫికెట్లు గ్రామ సభల్లో అందించారు. ఇప్పుడు 'జగనన్న ఆరోగ్య సురక్ష' కూడా అలాంటి వినూత్న పథకంగా మిగిలిపోతుంది. ఎన్నికల ఏడాదిలో ఇది వైసీపీ మైలేజీ మరింత పెంచే అవకాశముంది.

Advertisement
Update:2023-09-14 07:08 IST

ఏపీలో ఇటీవల 'జగనన్న సురక్ష' అనే కార్యక్రమం అమలైంది. ఇంటింటికీ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు వెళ్లి ఏమేం పథకాలు అమలవుతున్నాయి, అర్హులైనవారికి ఏమేం పథకాలు అందుబాటులోకి రాలేదు అనే లెక్క తీశారు. వారికి అవసరమైన సర్టిఫికెట్లను రుసుము లేకుండానే ఉచితంగా అందించారు. ఎక్కడికక్కడ గ్రామ సభలు పెట్టి సర్టిఫికెట్లు అందించారు. అర్హులైనవారు మిగిలిపోతే వారినుంచి దరఖాస్తులు తీసుకున్నారు. టార్గెట్ పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన స్పందన చూసి ఇదే విధానాన్ని ఆరోగ్య శాఖలో కూడా అమలు చేయబోతున్నారు. దీనికి 'జగనన్న ఆరోగ్య సురక్ష' అనే పేరు పెట్టారు. అంటే, ఇంటింటికీ ఆరోగ్య సిబ్బంది వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటారు, అక్కడే కావాల్సిన పరీక్షలు చేస్తారు. ఆ తర్వాత ప్రత్యేకంగా హెల్త్ క్యాంపులు పెట్టి.. కళ్లజోళ్లు, ఫుడ్ సప్లిమెంట్లు, ఇతర మందులు అందిస్తారు.


Full View

ఇంటింటికీ వైద్య సిబ్బంది..

గతంలో హెల్త్ సర్వే పేరిట ప్రతి ఇంటి ఆరోగ్య వివరాలు ఏపీ ప్రభుత్వం సేకరించింది. అయితే ఫోన్ ద్వారా లేదా నేరుగా వాలంటీర్ వెళ్లి వారి ఆరోగ్య సమస్యలు ఆరా తీసేవారు. ఇప్పుడు నేరుగా ఏఎన్ఎం, ఆశా వర్కర్, వాలంటీర్.. ఈ ముగ్గురూ ఇంటికి వస్తారు. ఇంట్లోనే వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అప్పటి వరకు గుర్తించని సమస్యలు ఉంటే, వారికి చెప్పి ఆస్పత్రులకు రిఫర్ చేస్తారు, వెంటనే కొన్ని మందులు ఇస్తారు. ఆ తర్వాత నిర్వహించే హెల్త్ క్యాంప్ లో స్పెషలిస్ట్ డాక్టర్లు వారిని పరీక్షిస్తారు. అవసరమైన మందుల్ని అందిస్తారు. ఇదే 'జగనన్న ఆరోగ్య సురక్ష'.

ఎన్నికల ముందు వినూత్న కార్యక్రమం..

ప్రజలెప్పుడూ ప్రభుత్వాలు, నాయకులు తమను పట్టించుకోవాలని కోరుకుంటారు. గతంలో ప్రజలు అధికారులు, ఆఫీసుల చుట్టూ తిరిగినా పనులయ్యే పరిస్థితి లేదు. కానీ సచివాలయాలు వచ్చిన తర్వాత ప్రజలు ఆఫీస్ ల చుట్టూ తిరగాల్సిన పని తప్పింది. సచివాలయం వెళ్తే కచ్చితంగా పనులవుతున్న సందర్భాలున్నాయి. ఇటీవల 'జగనన్న సురక్ష' ద్వారా నేరుగా అధికారులే ఇంటికి వచ్చి వివరాలు సేకరించి అవసరమైన సర్టిఫికెట్లు గ్రామ సభల్లో అందించారు. ఇప్పుడు 'జగనన్న ఆరోగ్య సురక్ష' కూడా అలాంటి వినూత్న పథకంగా మిగిలిపోతుంది. ఎన్నికల ఏడాదిలో ఇది వైసీపీ మైలేజీ మరింత పెంచే అవకాశముంది.

ఈనెల 15 నుంచి 'జగనన్న ఆరోగ్య సురక్ష' క్యాంపెయిన్ మొదలవుతుంది. ఐదు దశల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఉచితంగా 7 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈనెల 30నుంచి నలుగురు డాక్టర్లతో గ్రామాల్లో హెల్త్ క్యాంప్ లు పెడారు. వీరిలో ఇద్దరు స్పెషలిస్ట్ డాక్టర్లు ఉంటారు. 45రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా క్యాంపులు నిర్వహిస్తారు. రాష్ట్రంలో ప్రతి గ్రామం, ప్రతి ఇల్లు, ప్రతి వ్యక్తిని కవర్ చేస్తారు. 

Tags:    
Advertisement

Similar News