జగన్ 'ముందస్తుకు' వెళుతున్నారా..?
ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు రానున్నాయా ? ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందుగానే శాసన సభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలని ఆయనకు ఐ ప్యాక్ సంస్థ సలహా ఇచ్చిందా ?
ఆంధ్రప్రదేశ్ లోరాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముందస్తు ఎన్నికలపై ఎటువంటి నిశ్చితమైన నిర్ణయాలు వెలువడనప్పటికీ రాజకీయ నాయకులు మాత్రం వాతావరణాన్ని ఆ దిశగా తీసుకెళుతున్నారు. షెడ్యూలు కంటే ముందుగానే ఎన్నికలు జరుగుతాయని ఒక సమయంలో జోరుగా ప్రచారం జరిగినా ముఖ్యమంత్రి జగన్ దీనిపై ఎటువంటి స్పందనా కనబరచలేదు. కానీ ఆయన తీసుకుంటున్న నిర్ణయలు చేస్తున్న కసరత్తు మాత్రం ఎన్నికల సన్నాహాలనే తలపిస్తున్నాయంటున్నారు పరిశీలకులు. ఆయనకు అందిన ఒక ముఖ్యమైన సమాచారం మేరకు ముందస్తు ఎన్నికలకు వెళ్ళడమే మంచిదనే అభిప్రాయానికి వచ్చారంటున్నారు. ప్రధాని మోడీ భీమవరం సభకు వచ్చివెళ్ళాక దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చినా, ఆ తర్వాత అందిన మరో ముఖ్యమైన సమాచారంతో ఎన్నికలకు వెళ్ళాలనే నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే ఐ ప్యాక్ సంస్థకు చెందిన గిరిరాజ్ సింగ్ నేతృత్వంలో రాష్ట్రంలో విస్తృతంగా సర్వేలు చేయించారు.ఆయన బృందంతో జిల్లా, నియోకవర్గాల ఇన్ చార్జిలు సమన్వయం చేసుకుంటూ పరిస్థితులకు అనుగుణంగా స్పందిస్తూ తగిన విధంగా ప్రజల్లోకి వెళ్ళాలని సీఎం సూచించారట. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను బలంగా ప్రజలకు వివరించాలని సూచించారు. ఇచ్చిన లక్ష్యాలను సాధించకపోతే కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంలో వెనకాడబోనని కూడా హెచ్చరించారు.
టార్గెట్ చేరాలంటే..
అయితే మూడేళ్ల పాటు ప్రభుత్వ పాలన, సంక్షేమ కార్యక్రమాలపైనే ఎక్కువగా దృష్టి సారించిన ముఖ్యమంత్రి ఇకపై క్షేత్ర స్థాయి పరిస్థితులను తెలుసుకోనున్నారు. అక్టోబర్ నుంచి నేరుగా ప్రజల్లోకి వెళ్ళి కలవాలని అనుకున్నా ఆ ప్లాన్ మార్చుకుని ప్రజా దర్బార్ లు నిర్వహించాలని భావిస్తున్నారని సమాచారం. ఒకరకంగా ఈ దర్బార్ లను మినీ సెక్రటేరియట్ తరహాలో అన్ని విభాగాల అధికారులతో కలిసి స్రజల నుంచి వచ్చిన సమస్యలపై తక్షణ పరిష్కారం జరిగేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించినట్టు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఎటువంటి గందరగోళానికి తావు లేకుండా ముందుగా ప్రాంతాలను విభజించి ఆయా రోజుల్లో ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించాలనే ఆలోచన కూడా ఉందంటున్నారు. అదీగాక ప్రజలను దర్బారుకు రప్పించడమా లేక నేరుగా ముఖ్యమంత్రి ప్రజల వద్దకు వెళ్ళడమా అనేది ఇదమిద్ధంగా ఖరారు కాలేదని కూడా వినిపిస్తోంది. ఒకవేళ జగన్ ప్రజల్లో పర్యటించినా లేక దర్బారు నిర్వహించినా నవంబర్ 6 వతేదీ నుంచి ప్రారంభమవుతాయని పార్టీ వర్గాల్లో వినబడుతోంది. 2017లో అదే తేదీ నుంచి జగన్ తన సుదీర్ఘ పాదయాత్రను ఇడుపలపాయ నుంచి ప్రారంభించారని, ప్రజా ఆశీస్సులతో ఆయన ముఖ్యమంత్రి అయ్యారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఎందుకు తొందరపడుతున్నారు..
దాదాపు యేడాది క్రితం నుంచే గిరిరాజ్ సింగ్ బృందం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రజల పల్స్ తెలుసుకుంటున్నారు. ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత కనబడుతోందని, దీనిని పొడిగిస్తే ముప్పుతప్పదని గిరిరాజ్ బృందం హెచ్చరించినట్టు తెలుస్తోంది. అదే సమయంలో విపక్షాలు అవకాశాన్ని వినియోగించుకునే స్థితిలోలేవని కూడా చెప్పినట్టు తెలిసింది. ఆ గ్యాప్ ను వినియోగించుకునేందుకు ఇదే తగిన సమయమని సూచించారని సమాచారం. ఓ పక్క ప్రభుత్వం కసరత్తు చూసి ముందస్తు ఎన్నికలు తధ్యమనే అభిప్రాయంతో విపక్షపార్టీలు ముమ్మరంగా ప్రచారంలోకి దిగక ముందే రంగంలోకి దిగి వారికి అవకాశం లేకుండా చేయడం ముఖ్యమని సూచించారంటున్నారు. జగన్ తన కార్యక్రమాలు అన్నీ సిద్ధం చేసుకుని ముందస్తు ఎన్నికలపై ప్రకటన చేస్తారంటున్నారు.
కొన్ని నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి
టార్గెట్ 175 తో ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి జగన్ అందుకు తగ్గట్టుగా ఆయా ప్రాంతాల్లోని నాయకులకు కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారట.ఎన్నికలకు వెళ్ళే ముందుగానే కొన్ని కీలకమైన నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయా ప్రాంతాల నాయకులకు గట్టిగా చెప్పారని సమాచారం. వీటిలో గత ఎన్నికల్లోఓడిపోయిన నియోజకవర్గాలను ఈ సారి ఎలాగైనా చేజిక్కించుకోవాలని చెప్పారట. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పాలకొల్లు ఆ జాబితాలో ముఖ్యమైనది. గత ఎన్నికల్లో వైసిపి అభ్యర్ధిపై భారీ మెజారిటీతో గెలిచిన నిమ్మల రామా నాయుడిని ఈ సారి ఎలాగైన ఓడించాలని కంకణం కట్టుకున్నట్టు తెలుస్తోంది. అక్కడ బలమైన సామాజిక వర్గంతో పాటు ఆయన చేస్తున్న కార్యక్రమాలు, నిత్యం ప్రజల్లో ఉండడం వంటి అంశాలు నిమ్మలకు బాగా కలిసివస్తాయని ఇప్పటికే వినబడుతోంది. అధికార పార్టీ ఎంత ప్రయత్నించినా ఇక్కడ నిమ్మలకు ఎదురు ఉండదనే అభిప్రాయంవ్యక్తమవుతోంది. దీనిని ఛాలెంజ్ గా తీసుకుని ప్రత్యర్ధి పార్టీలపై గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.
అధికార పార్టీ సింగిల్ గానే ఎన్నికల్లో దిగనుండగా, విపక్షపార్టీల్లో మాత్రం పొత్తులపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ముక్కోణపు పోటీయా లేక అదికార పక్షం తో కూటిమి పోటీపడుతుందా అనేది ఎన్నికల ప్రకటన వచ్చాక కానీ తేలేలా లేదు. దాదాపు ఆరునెలల ముందే తెలుగుదేశం, జనసేన మద్య పొత్తులు ఉంటాయని బలంగా వినిపించినా తర్వాత ఆ ప్రసక్తి ఎక్కడా తీసుకు రావడం లేదు. ముఖ్యంగా మహానాడు విజయవంతమైందని భావిస్తున్న టిడిపి ఆతర్వాత ఈ అంశాన్నిలేవనెత్తడంలేదు. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా అటు బిజెపి వైఖరితోనూ, టిడిపి తీరుతో అసంతృప్తిగా ఉన్నారు. ఇక తానే సొంతంగా ఎన్నికల బరిలో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నట్టు ఇటీవల ఆయన ప్రసంగాల తీరు గానీ వ్యవహార శైలి కనబడుతున్నాయి. ఇందుకు కారణం కూడా లేకపోలేదు ఆయన సామాజిక వర్గంనుంచి ఇప్పటికే మద్దతు లభిస్తుందనే సంకేతాలు అందాయని చెబుతున్నారు. ఇదే నిజమైతే ఈ సారి ఏపీలో ముక్కోణ పోటీ తప్పేలా లేదు.