గ్రాఫ్ గ్రాఫ్ గ్రాఫ్.. పక్కాగా క్లారిటీ ఇచ్చిన జగన్
మంత్రి వర్గ విస్తరణ గురించి నామమాత్రంగా కూడా ప్రస్తావించలేదు జగన్. ఇక ముందస్తు ఊహాగానమేనని కొట్టిపారేశారు. 2019 ఏప్రిల్ 11న ఎన్నికలు జరిగాయని, 2024 ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే గడువు ఉందని చెప్పారు.
ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం జగన్, పదే పదే గ్రాఫ్ అనే పదం వాడారు. ప్రజల్లో తిరగండి గ్రాఫ్ పెంచుకోండి, మీ గ్రాఫ్ పెంచుకోవడం కోసం మోటివేషన్ ఇచ్చేందుకే ఈ కార్యక్రమం, మీ గ్రాఫ్ పెంచుకుంటేనే మీరు తిరిగి ఎమ్మెల్యేలుగా గెలుస్తారు, తిరిగి నాదగ్గరకు వస్తారు అని చెప్పుకొచ్చారు జగన్. ఎమ్మెల్యేలు నిత్యం ప్రజల్లోనే ఉండాలని, ప్రతి గడపకూ వెళ్లాలని ఉద్భోదించారు.
కాంబినేషన్ ఎఫెక్ట్..
"నేను ఇక్కడ కూర్చుని బటన్ నొక్కుతూనే ఉంటా, ఇది నా పని.. మీరు గ్రామాల్లో తిరుగుతూనే ఉండాలి, అది మీ పని." అని క్లియర్ పిక్చర్ చూపించారు జగన్. ఇది కాంబినేషన్ ఎఫెక్ట్ అని, తాను చేయాల్సిన పని తాను చేస్తానని, ఎమ్మెల్యేలు చేయాల్సిన పని వారు చేయాల్సిందేనన్నారు. గ్రామాల్లో తిరగాలని, ప్రజలతో ఉండాలని సూచించారు. అలా అయితేనే ఈసారి కచ్చితంగా 175 కొడతామన్నారు జగన్. ఈనెల 13న జగనన్నకు చెబుతాం అనే కార్యక్రమం మొదలు పెడతామని, వ్యక్తిగత సమస్యలన్నీ పరిష్కారమవుతాయని అన్నారు. నేరుగా సీఎంఓ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తుందన్నారు.
ఏ ఒక్కరినీ పోగొట్టుకోను..
ఏ ఒక్కరినీ పోగొట్టుకోవాలనే ఉద్దేశం తనకు లేదని, ఎమ్మెల్యేలతో సహా ఏ ఒక్క కార్యకర్తని కూడా తాను పోగొట్టుకోనని అన్నారు. రాజకీయం అంటే మానవ సంబంధాలని చెప్పారు. ప్రతి ఒక్కరితో కలసి ఉండాలన్నారు. తాను కష్టపడుతున్నానని, అదే సమయంలో ఎమ్మెల్యేలు కూడా కష్టపడి పనిచేయాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికలను లైట్ తీసుకోవాలని చెప్పిన జగన్, ప్రతిపక్షాల దుష్ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు.
అన్నిటికీ క్లారిటీ..
మంత్రి వర్గ విస్తరణ గురించి నామమాత్రంగా కూడా ప్రస్తావించలేదు జగన్. ఇక ముందస్తు ఊహాగానమేనని కొట్టిపారేశారు. 2019 ఏప్రిల్ 11న ఎన్నికలు జరిగాయని, 2024 ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే గడువు ఉందని చెప్పారు. పరోక్షంగా ముందస్తు లేనట్టేనని సంకేతాలిచ్చారు. టికెట్ కోల్పోయేవారి జాబితా కూడా తన వద్ద లేదని తేల్చి చెప్పారు జగన్. ఫలానా వారికి టికెట్లు ఇవ్వట్లేదు, 60మంది లిస్ట్ జగన్ దగ్గర రెడీగా ఉంది.. అంటూ టీడీపీ అనుకూల మీడియా తప్పుడు ప్రచారం చేస్తుందని, వారి బుట్టలో పడొద్దని చెప్పారు.