బీజేపీ స్కెచ్ అర్థం కావటంలేదా?

జ‌గ‌న్ విష‌యంలో నరేంద్ర మోడీ వైఖరి చంద్రబాబు, పవన్‌కు అర్థంకావటంలేదు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగట్టమని రాష్ట్ర పార్టీ నేతలకు, పవన్‌కు చెబుతునే మరోవైపు జగన్ అడిగిన సాయమంతా అందిస్తున్నారు.

Advertisement
Update:2023-07-19 10:57 IST

బీజేపీ స్కెచ్ అర్థం కావటంలేదు. బీజేపీ అగ్రనేతల అంతరంగం అర్థంకాక 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ ఇద్దరూ జుట్టు పీక్కుంటున్నారు. చంద్రబాబుతో అమిత్ షా ఈమధ్యనే సమావేశమైన విషయం తెలిసిందే. ఎన్డీయే సమావేశానికి మిత్రపక్షం హోదాలో పవన్ కల్యాణ్‌ను ఆహ్వానించారు. బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కూడా ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలతో రెచ్చిపోతున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు మాత్రం జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లే నడుచుకుంటున్నారు.

ఈ విషయం చంద్రబాబు, పవన్‌కే కాదు చివరకు ఎల్లో మీడియాకు కూడా అర్థంకావటంలేదు. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలా వద్దా అని అర్థంకాక చంద్రబాబు ఏమీ తేల్చుకోలేకపోతున్నారు. పవనేమో టీడీపీని కూడా కలుపుకుని ఎన్నికలకు వెళ్తామ‌ని పదేపదే చెబుతున్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్‌ను గద్దె దింపటమే టార్గెట్‌గా పనిచేస్తున్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన నేతలంతా జగన్ ప్రభుత్వంపై రెగ్యులర్‌గా రెచ్చిపోతున్నారు.

ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తునే ఉంది. చాలా సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ లోటు రూ.10,411 కోట్లు విడుదల చేసింది. పోలవరం ప్రాజెక్టు పెండింగ్ నిధులు రూ. 12,911 కోట్లు విడుదల చేసింది. ఇంకా చిన్నా చితకా మొత్తాలను కూడా ఇస్తునే ఉంది. ఇక్కడే నరేంద్ర మోడీ వైఖరి చంద్రబాబు, పవన్‌కు అర్థంకావటంలేదు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగట్టమని రాష్ట్ర పార్టీ నేతలకు, పవన్‌కు చెబుతునే మరోవైపు జగన్ అడిగిన సాయమంతా అందిస్తున్నారు.

దీంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీ-జనసేనతో చేతులు కలిపితే చివరకు ఏమవుతుందో అనే భయం చంద్రబాబులో పెరిగిపోతోంది. శ‌త్రువుని దూరంగా ఉంచకుండా మిత్రత్వం పేరుతో దగ్గరకు తీసుకుని బీజేపీ తనను లేవకుండా దెబ్బకొడుతుందేమో అన్న భయం చంద్రబాబులో పెరిగిపోతోంది. దీంతో పొత్తుపై ఏమి నిర్ణయం తీసుకోవాలో దిక్కుతోచటంలేదు. కేంద్ర ప్రభుత్వానికి వెలుపల నుండి మద్దతు అన్న పేరుతో రాష్ట్రంలోని ప్రతిపక్షాలను కేంద్రంలోని పెద్దల ద్వారా జగన్ తాను అనుకున్నట్లుగా నియంత్రించగలుగుతున్నారన్న విషయం అర్థ‌మైపోతోంది. ఇందుకేనేమో పవన్ మిత్రపక్షం బీజేపీ పెద్దల మీద కోపాన్ని కూడా కలిపి జగన్ మీద తీర్చుకుంటున్నది.

Advertisement

Similar News