ఆశా కార్యకర్తలపై దాడి చేసిన పోలీసులను శిక్షించాలి
మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌కు బీఆర్‌ఎస్ మహిళా నాయకుల ఫిర్యాదు
ఆశా కార్యకర్తలను పోలీసులు దారుణంగా కొట్టారని.. వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారదను బీఆర్‌ఎస్ మహిళా నాయకులు కోరారు. జెడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ నాయకులు మంగళవారం నేరెళ్ల శారదను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డికి మహిళలంటే గౌరవం లేదని వరుస ఘటనలు రుజువు చేస్తున్నాయని తుల ఉమ అన్నారు. లగచర్లలో గిరిజన మహిళలపై పోలీసులు అఘాయిత్యాలకు ఒడిగట్టారని, ఇప్పుడు ఆశా వర్కర్లపై దమనకాండ కొనసాగించారని అన్నారు. వాడలేని భాషలో తిడుతూ ఇష్టం వచ్చినట్టు కొట్టారని వివరించారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించే రోజే ఆశా వర్కర్లపై పోలీసుల దాడి జరిగిందన్నారు. పోలీసులపై చర్యలు తీసుకుంటామని మహిళ కమిషన్ చైర్ పర్సన్ హామీ ఇచ్చారని తెలిపారు. నియంతలా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డికి మహిళలు బుద్ధి చెప్తారని.. తెలంగాణ తల్లిని మార్చిన రేవంత్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఆశావర్కర్ల విషయంలో రేవంత్ ప్రభుత్వం మానవత్వం లేకుండా ప్రవర్తించిందని సుమిత్ర అన్నారు. కార్యక్రమంలో నాయకులు సుశీలారెడ్డి, అర్పిత ప్రకాశ్, కీర్తిలత గౌడ్ తదితరులు పాల్గొన్నారు.