Telugu Global
WOMEN

రేవంత్‌ ఒక్కో ఆడబిడ్డకు రూ.30 వేలు బాకీ ఉన్నడు

ఆయన సీఎం అయినంక ఆరు నెలలు ఒక్క ప్రాజెక్టులోనూ స్పూన్‌ మట్టి తీయలే : ఎమ్మెల్సీ కవిత

రేవంత్‌ ఒక్కో ఆడబిడ్డకు రూ.30 వేలు బాకీ ఉన్నడు
X

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రాష్ట్రంలోని ఆడబిడ్డకు రూ.30 వేల చొప్పున బాకీ ఉన్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో తెలంగాణ జాగృతి వరంగల్‌, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాల సమావేశంలో ఆమె మాట్లాడారు. మహాలక్ష్మీ పథకంలో భాగంగా 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ నెలకు రూ.2,500 ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేశారు. రేవంత్ సీఎం అయిన తర్వాత ఆరు నెలల పాటు రాష్ట్రంలోని ఏ ఒక్క ప్రాజెక్టులోనూ స్పూన్ మట్టి కూడా తియ్యలేదన్నారు. నరసింహావతారంలా పేగులు మెడల వేసుకుంటా అని సీఎం అంటున్నారని, ఆయనకు ధైర్యం ఉంటే నాగార్జున సాగర్ వద్ద నరసింహావతారం ఎత్తి కేంద్ర బలగాలను వెనక్కి పంపించాలని డిమాండ్‌ చేశారు. సాగర్‌ లో మన నీళ్లు మనకు దక్కేలా చూడాలని సవాల్‌ విసిరారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా జలాలను ఏపీ తరలించుకుపోయే పనులు వేగంగా చేస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని అన్నారు. తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చడం కాదు.. మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలన్నీ అమలు చేసేంత వరకు వెంటపడుతూనే ఉంటామని హెచ్చరించారు. ప్రభుత్వంలో జరిగే తప్పులను తెలంగాణ జాగృతి ఎప్పటికప్పుడు ఎత్తిచూపిస్తుందన్నారు. ఈ ముఖ్యమంత్రి తమకు ఏదో చేస్తారన్న విశ్వసం ప్రజల్లో లేదన్నారు. “మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఆ హామీ నిలబెట్టుకోలేదని అన్నారు. మహిళలకు నెలకు రూ.2,500 సాయంతో పాటు వృద్ధులు, వికలాంగులు, ఇతర పెన్షనర్లకు పింఛన్లు పెంచి ఇవ్వాలన్నారు. ఈ హామీలపై జాగృతి పోరాటం చేస్తుందని తెలిపారు. తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చుతామంటూ ఈ ప్రభుత్వం డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తుందన్నారు. ప్రజల పట్ల ప్రేమపూర్వకంగా వ్యవహరించడం, ప్రజా సమస్యలపై ప్రశ్నించడమే తెలంగాణ సంస్కృతి అన్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్నన్ని రోజులు నాగార్జున సాగర్ ప్రాజెక్టు తెలంగాణ చేతిలో ఉండేదని, ఇప్పుడు అక్కడ కేంద్ర బలగాలు మోహరించాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఒక్క ప్రాజెక్టు కూడా చేపట్టలేదని, పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని అన్నారు.

ఏ హస్టల్ లో ఏ ఆడపిల్లకు అన్యాయం జరిగి చనిపోయినా అక్కడికి వెళ్లి ఆ అన్యాయాన్ని ప్రశ్నించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. దేశ వ్యాప్తంగా వస్తున్న సామాజిక మార్పులను పరిగణలోకి తీసుకొని బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం అంశాన్ని ప్రాధాన్యతగా తీసుకున్నామని తెలిపారు. కేసీఆర్ స్పూర్తితో, ప్రొఫెసర్ జయశంకర్ మార్గదర్శకత్వంలో తెలంగాణ జాగృతి సంస్థ ఏర్పడిందని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా అనేక సామాజిక అంశాలపై తెలంగాణ జాగృతి ఉద్యమించిందని గుర్తు చేశారు. అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కోసం పోరాడి సాధించామని తెలిరు. దేశంలోని అనేక రాజకీయ పార్టీలను ఒప్పించి చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ చట్టం సాకారం కావడానికి కృషి చేశామన్నారు.

First Published:  4 Dec 2024 7:45 AM IST
Next Story