Telugu Global
WOMEN

ఆమె గుండె చెరువయ్యింది...చెరువును నీటితో నింపింది

బెంగళూరుకు చెందిన రేవతి అక్కడి ఓ చెరువును బతికించింది. నిజమే... ఆమె ఓ డెడ్‌ లేక్‌ను నీటితో నింపింది. ‘ఇప్పటి వరకు నా కుటుంబం కోసం పని చేశాను. ఇప్పుడు సమాజం కోసం, పర్యావరణం కోసం పని చేస్తున్నాను’ అంటోందామె.

ఆమె గుండె చెరువయ్యింది...చెరువును నీటితో నింపింది
X

రేవతి కామత్‌

‘అరవై సంవత్సరాలు నిండాయి, ఇంకా చేయడానికి ఏముంటుంది?’ అనుకునే వాళ్లు మహిళలు ఒకప్పుడు. చేయడానికి ఏముంటుంది అనుకోవడం వరకు ఫర్వాలేదు, కానీ అలాగని ఏమీ చేయకుండా ఉండనూలేరు. ఇంట్లో అన్ని విషయాల్లోనూ జోక్యం చేసుకుంటారు, జోక్యం చేసుకోకుండా ఉండలేకపోతారు కూడా. తనకు తానుగా పరిధి విధించుకోవడానికి ఇష్టపడని మనసుతో నిత్యం తప్పని ఘర్షణ.


మనిషిని వార్ధక్యం తాలూకు ఆందోళనలోకి నెట్టేసే కారకాలివన్నీ. వీటన్నింటినీ పక్కకు తోసేసి జీవితాన్ని నిత్యనూతనంగా ఉంచుకుంటున్న పరిణిత మహిళలు కూడా కనిపిస్తున్నారు. పిల్లలు జీవితంలో సెటిలైన తర్వాత ఏర్పడే ఖాళీతో వచ్చే మానసిక సమస్య ఎంప్టీనెస్ట్‌ సిండ్రోమ్‌. ఆ ఎంప్టీనెస్ట్‌ సిండ్రోమ్‌ బారిన పడకుండా జీవితాన్ని డిజైన్‌ చేసుకోగలిగిన లైఫ్‌ ఆర్కిటెక్ట్‌ రేవతి కామత్‌. బెంగళూరుకు చెందిన రేవతి అక్కడి ఓ చెరువును బతికించింది. నిజమే... ఆమె ఓ డెడ్‌ లేక్‌ను నీటితో నింపింది. ‘ఇప్పటి వరకు నా కుటుంబం కోసం పని చేశాను. ఇప్పుడు సమాజం కోసం, పర్యావరణం కోసం పని చేస్తున్నాను’ అంటోందామె.



‘‘నేను బోటనీలో గ్రాడ్యుయేషన్‌ చేశాను. నా సంతోషం నేల, నీరు, మొక్కలతో ముడివడి ఉంది. పిల్లల పెంపకంలో భాగంగా నా జీవితంలో ఎక్కువ కాలం గృహిణిగానే గడిచిపోయింది. ఓ ఇరవై ఏళ్ల కిందట ‘కాలిక్స్‌ ల్యాండ్‌స్కేపింగ్‌ అండ్‌ ఆర్గానిక్‌ ఫార్మింగ్‌’తో ల్యాండ్‌స్కేపింగ్‌ వర్క్, ఫ్లవర్‌ బొకేల షాప్‌ పెట్టాను. హాబీగా మొదలుపెట్టిన వ్యాపకం లాభదాయకంగానే సాగింది. ల్యాండ్‌స్కేపింగ్‌ కోసం మొక్కలు నాటడానికి, లాన్‌ పెంచడానికి భూమి అవసరమైంది. అలా సోమనహల్లి గ్రామంతో పరిచయం ఏర్పడింది.


మాకు అవసరమైన మొక్కలు పెంచడం మొదలైంది. ఈ క్రమంలో నాకు ఆ ఊరి చెరువు పూర్తిగా పూడుకుపోయిందని తెలిసింది. చెరువుకు నీరు రావాల్సిన కాలువ పొలాల్లో కలిసిపోయింది. చెరువు కబ్జాలతో చిన్నదయిపోయినట్లు చెప్పాడు గ్రామ సర్పంచ్‌. చెరువు బాగుపడితే ఊరిలో నీటి సమస్య ఉండదని, చెరువు పనులు చేయడానికి గ్రామానికి వచ్చే నిధులు సరిపోవని, ప్రత్యేక నిధుల కోసం ప్రభుత్వానికి ఎన్ని వినతులు ఇచ్చినా పని జరగలేదని చెప్పాడు.

వర్షపు నీరు సముద్రం పాలు కాకుండా భూమి మీద నిల్వ ఉంటే ఒనగూరే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఇక ఈ బాధ్యత చేపట్టాను. ఎన్విరాన్‌మెంటల్‌ యాక్టివిస్ట్‌ కావాలనే ఉద్దేశంతో పని మొదలు పెట్టలేదు. నా దృష్టికి వచ్చిన సమస్యను పరిష్కరించే క్రమంలో అంత పెద్ద బాధ్యత చేపట్టాను. రాజా కెనాల్‌ను తిరిగి తవ్వించాను, పాతిక ఎకరాల చెరువులో పిచ్చిచెట్లు, పూడిక తొలగించి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచగలిగాను. నలభై ఐదు లక్షల ఖర్చయింది. నా కొడుకులిద్దరూ సహకరించారు.


నా వయసు 63. ఇంకా పని చేయాలా అంటే... ఇరవై నుంచి అరవై వరకు నా కుటుంబం కోసం పని చేశాను. ఇప్పుడు సమాజం కోసం పని చేస్తున్నాను. పర్యావరణ పరిరక్షణ కోసం పని చేస్తున్నాను. పిల్లలకు రెక్కలు వచ్చిన తర్వాత వాళ్లు ఎగిరివెళ్లిపోతారు. తల్లిదండ్రులు తమకు ఇష్టమైన వ్యాపకానికి రెక్కలు తొడగాల్సిన సమయం అది’’ అంటున్నారు రేవతి.

First Published:  22 Jan 2023 12:12 PM GMT
Next Story