Telugu Global
Travel

ఒక్కసారైనా చేయాల్సిన ట్రైన్ జర్నీలివి!

దూర ప్రయాణాలు చేయడానికి రైలు ప్రయాణాన్ని మించిన ఆప్షన్ లేదు. ట్రైన్ జర్నీ కంఫర్టబుల్‌గా ఉండడమేకాకుండా ఆహ్లాదకరమైన అనుభూతినిస్తుంది. మనదేశంలో ఎన్నో ప్రదేశాలను, మారుమూల ప్రాంతాలను కలుపుతూ రకరకాల రైలు మార్గాలున్నాయి.

ఒక్కసారైనా చేయాల్సిన ట్రైన్ జర్నీలివి!
X

దూర ప్రయాణాలు చేయడానికి రైలు ప్రయాణాన్ని మించిన ఆప్షన్ లేదు. ట్రైన్ జర్నీ కంఫర్టబుల్‌గా ఉండడమేకాకుండా ఆహ్లాదకరమైన అనుభూతినిస్తుంది. మనదేశంలో ఎన్నో ప్రదేశాలను, మారుమూల ప్రాంతాలను కలుపుతూ రకరకాల రైలు మార్గాలున్నాయి. వాటిల్లో అద్భుతమైన అనుభూతిని మిగిల్చే కొన్ని ప్రత్యేకమైన ట్రైన్స్ రూట్స్ ఇవి.

అసోం రైల్వే

ప్రకృతి అందాలకు ఈశాన్య రాష్ట్రాలు చాలా ఫేమస్. అక్కడి కొండలు, లోయల్లో దాగి ఉన్న అందాలను ఆస్వాదించాలంటే అసోంలోని సిల్చార్‌ నుంచి లామ్‌డింగ్‌ వరకు రైల్లో ప్రయాణించాల్సిందే. రెండొందల కిలోమీటర్లు ఉండే ఈ రైల్వేలైన్‌లో జలపాతాలు, సెలయేళ్లు, మధ్యమధ్యలో సొరంగాలు, భారీ వంతెనలు ఇలా అడుగడుగునా విశేషాలే. 21 టన్నెళ్లు, 79 భారీ వంతనెలు దాటుకుంటూ రైలు వెళ్తుంది. ఒకచోట మూడు కిలోమీటర్ల పొడవైన సొరంగం ఉంటుంది. ఈ ప్రయాణంలో అసోంలోని గ్రామాలు, అక్కడి జనాలు, వెదురుతో కట్టుకున్న ఇళ్లు కనిపిస్తాయి. అలాగే కాంచెన్‌గంగ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కితే అస్సాంలోని ఎమరాల్డ్‌ కొండలు చూడొచ్చు. లోయలు, తేయాకు తోటలు, మలుపులతో ఆ ప్రయాణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.

కొల్లాం– టెంకాశి రైల్వేలైన్

కేరళ, తమిళనాడులో ఉండే పశ్చిమ కనుమల అందాలు చూడాలంటే.. కొల్లాం, టెంకాశి పట్టణాల మధ్య వెళ్లే రైలుమార్గంలో ప్రయాణించాలి. ఈ రెండు స్టేషన్ల మధ్య పశ్చిమ కనుమల గుండా సాగే 50 కిలోమీటర్ల ప్రయాణంలో దారిపొడవునా పచ్చని కొండలు అలరిస్తాయి. పెద్దపెద్ద చెట్లు, చల్లని గాలి, నదులు, పిల్లకాల్వలు దారిపొడవునా సందడి చేస్తాయి. వందకు పైగా బ్రిడ్జిలు, నాలుగైదు సొరంగాలు దాటుకుంటూ రైలు ముందుకెళ్తుంది. ఈ దారిలో తెన్మల అనే ఊరి దగ్గర వచ్చే భారీ బ్రిడ్జి ఈ జర్నీలో స్పెషల్ అట్రాక్షన్. నెలవంక ఆకారంలో ఉండే ఈ బ్రిడ్జ్‌కు ఓవైపు కొండలు, మరోవైపు పంటపొలాలు దర్శనమిస్తాయి.

వాస్కోడిగామా రైల్ రూట్

దూద్‌సాగర్ జలపాతాల అందాల్ని రైలులో ప్రయాణిస్తూ చూడాలంటే.. వాస్కోడిగామాకు వెళ్లాల్సిందే. గోవాకు దగ్గర్లో ఉండే వాస్కోడిగామాకు .. హైదరాబాద్‌ నుంచి కూడా రైళ్లున్నాయి. ఈ దారిలో ప్రయాణిస్తుంటే.. కొంతసేపటికి అడవి మొదలవుతుంది. ఆ అడవి అందాలను ఆస్వాదిస్తుండగానే.. దూరంగా దూద్‌సాగర్‌ జలపాతం కనిపిస్తుంది. రైలు జలపాతం వైపుగా వెళ్లి, కాసేపటికి ఓ వంతెనపై ఆగుతుంది. అప్పుడు కిటికీలోంచి చూస్తే.. పాలకడలి ఉప్పొంగుతున్నట్టు దూద్‌సాగర్‌ జలపాతాలు లోయలోకి దూకుతూ ఆశ్చర్యం కలిగిస్తాయి. అలా ఆ అందాలు చూస్తుండగానే రైలు మళ్లీ వేగం పుంజుకుని, కొండలు, సొరంగాల్లో దూసుకుపోతుంది.. కాసేపటికి రైలు వేగం తగ్గించుకుని అరేబియా తీరం వెంట మెల్లగా పరుగులు తీస్తుంది. అరేబియా సముద్రం వెంబడే వెళ్లే ఆ ప్రయాణం కిటికీలకు అతుక్కుపోయేలా చేస్తుంది.

మథేరన్‌ రైలు

ఈ అందమైన రైల్వేలైన్ మహారాష్ట్రలో ఉంది. నరేల్ అనే గ్రామం నుంచి మథేరన్ వరకూ ఈ రూట్ ఉంటుంది. ఈ రూట్ అంతా పాములా మెలికలు తిరిగి ఉంటుంది. దట్టమైన అటవీ ప్రాంతాలు మీదుగా ఈ రైలు ప్రయాణిస్తుంది. ఈ రూట్ అంతా ప్రకృతి అందాలు కట్టిపడేస్తాయి. ఈ రూట్‌లో టాయ్‌ట్రైన్స్ కూడా అందుబాటులో ఉంటాయి.

కంగ్రా లోయ రైల్వేలైన్

హిమాలయ పర్వతాల మధ్యలో నుంచి ఈ రైల్వేలైన్ ఉంటుంది. పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ నుంచి హిమాచల్‌ ప్రదేశ్‌లోని జోగిందర్‌ నగర్‌ వరకూ ఈ రూట్ ఉంటుంది. మొత్తం 164 కిలోమీటర్ల పొడవుండే ఈ రైలు మార్గం సముద్రమట్టం నుంచి 4,230 అడుగుల ఎత్తులో ఉంటుంది. జోగిందర్ నగర్ నుంచి కులు మనాలి కేవలం 160 కిలోమీటర్లు. ఎక్కువ సేపు బస్ జర్నీ ఇష్టపడనివారు జోగిందర్ నగర్ వరకు టాయ్ ట్రైన్ లో వెళ్లి.. అక్కడ నుంచి మనాలికి బస్సులు లేదా ట్యాక్సీల్లో చేరుకుంటారు. ఈ రైల్వై లైన్‌కు కూడా యునెస్కో హెరిటేజ్ గుర్తింపు ఉంది.

మహారాజాస్ ఎక్స్‌ప్రెస్

మనదేశంలోనే రిచెస్ట్ ట్రైన్‌గా ‘మహారాజాస్ ఎక్స్‌ప్రెస్’కు పేరుంది.. ఇది ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రైలు ప్రయాణాల్లో ఒకటి. దీనిని ‘లగ్జరీ ట్రైన్ ఆఫ్ ఇండియా’ అని కూడా అంటారు. ఇందులో ఒకరోజు ప్రయాణించడానికి లక్షల్లో ఖర్చుపెట్టాలి. ఈ ట్రైన్‌లో రాయల్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులను కలుసుకోవచ్చు. ఈ రైలును 2010 సంవత్సరంలో ప్రవేశపెడితే.. 2012 నాటికి వరల్డ్ పాపులర్ అయిపోయింది. ఈ మహారాజాస్ ఎక్స్‌ప్రెస్ కేవలం అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు మాత్రమే నడుస్తుంది. రాజస్థాన్ ఎడారి గుండా ప్రయాణిస్తూ రాజస్థాన్, సెంట్రల్ ఇండియాలోని 12 అందమైన ప్రదేశాలకు ఇది తీసుకువెళ్తుంది.

First Published:  20 Oct 2023 11:25 AM GMT
Next Story