కార్తీకమాసంలో శైవక్షేత్రాలకు టీఎస్ ఆర్టీసీ స్పెషల్ బస్సులు
అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటలలోని పంచారామ క్షేత్రాలకు బస్సులు ఏర్పాటు చేశామని టీఎస్ ఆర్టీసీ ప్రకటించింది.
కార్తీక మాసమంటే శైవక్షేత్రాలకు సందర్శనకు జనం పోటెత్తుతారు. వీధిలో శివాలయం నుంచి ప్రముఖ శైవక్షేత్రాల వరకు జనం బారులు తీరతారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాలకు వెళ్లాలనుకునే భక్తుల సౌలభ్యం కోసం ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు టీఎస్ఆర్టీసీ రంగారెడ్డి రీజినల్ మేనేజర్ శ్రీధర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రముఖ శైవక్షేత్రాలకు హైదరాబాద్, రంగారెడ్డిల నుంచి ప్రత్యేక బస్సులు నడుస్తాయన్నారు.
ఏపీలో ఎక్కడెక్కడికి..?
ఆంధ్రప్రదేశ్‌లోని పంచారామ క్షేత్రాలకు విశేష ప్రాశస్త్యం ఉంది. ఒకరోజులో ఈ 5 క్షేత్రాలను సందర్శించుకుంటే పుణ్యమని జనం నమ్మి వెళ్తుంటారు. అందుకే అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటలలోని పంచారామ క్షేత్రాలకు బస్సులు ఏర్పాటు చేశామని టీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. కార్తీక మాసంలోని ప్రతి ఆదివారం, పౌర్ణమి ముందు రోజు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ నుంచి బస్సులు బయలుదేరి ఈ క్షేత్రాలన్నీ సందర్శించి మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి నగరానికి చేరుకుంటాయని తెలిపింది. టిక్కెట్ ఛార్జీలు రాజధాని బస్సు అయితే రూ.4 వేలు, సూపర్ లగ్జరీ రూ.3,200. దర్శనం, వసతి కోసం రూ.550 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
తెలంగాణలో ఎక్కడెక్కడికి..?
తెలంగాణలోనూ వేములవాడ, కాళేశ్వరం, రామప్పగుడి, వెయ్యి స్తంభాల గుడి, పాలకుర్తి తదితర దక్కన్ పంచశైవ క్షేత్రాలకు బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ తెలిపింది. వీటికి కూడా ప్రతి ఆదివారం, కార్తీక పౌర్ణమి ముందురోజు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ నుంచి బస్సులు బయలుదేరి దర్శనం అనంతరం సోమవారం రాత్రికి నగరానికి చేరుకుంటాయి. టిక్కెట్ ఛార్జీలు రాజధాని రూ.2,400, సూపర్ లగ్జరీ రూ.1,900, ఎక్స్‌ప్రెస్ రూ.1,500గా నిర్ణయించారు.