సిమ్లా – కల్కా విండో టూర్
ఇది రైలుబండి పర్యటన. మనం చూడాలనుకున్న ప్రదేశానికి రైలెక్కి వెళ్లడం కాదు. రైలులో కూర్చుని కిటికీలో నుంచి చూడడమే ఈ టూర్. రైల్లో ప్రయాణించడమే ఈ పర్యటన.
ఇది రైలుబండి పర్యటన. మనం చూడాలనుకున్న ప్రదేశానికి రైలెక్కి వెళ్లడం కాదు. రైలులో కూర్చుని కిటికీలో నుంచి చూడడమే ఈ టూర్. రైల్లో ప్రయాణించడమే ఈ పర్యటన. విండో టూర్‌లో ఏమేమి చూడవచ్చు?
రైలెక్కి కొండల మధ్య విహరించవచ్చు. మౌనంగా నేలకు దూకే జలపాతాలను చూడవచ్చు. అలాగే కొండల మధ్య టన్నెళ్లలో దూరి దోబూచులాడాలి. వంతెనల మీద వయ్యారాలు పోతూ ఒక కొండ మీద నుంచి మరో కొండ మీదకు చేరాలి. నీటి ప్రవాహాన్ని పోలిన మలుపుల్లో ప్రయాణాన్ని ఆస్వాదించాలి. ఓ వంద కిలోమీటర్లు ప్రయాణిస్తే ఇవన్నీ మన కళ్ల ముందుంటాయి. ఈ రైలు గమ్యాన్ని చేరడానికి పరుగులు తీయదు. ప్రశాంతంగా ప్రకృతిని ఆస్వాదించమని మెల్లగా గంటకు పాతిక కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఇంతకీ ఇది ఏ రైలు?
ఇది సిమ్లా– కల్కా రైలు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం, సిమ్లా బాగా తెలిసిన ప్రదేశమే. అయితే సమ్మర్ వెకేషన్‌లో సిమ్లాకు వెళ్లి వెనక్కి వచ్చేవాళ్లే ఎక్కువ. ఈ సీజన్‌లో సిమ్లా టూర్ ప్లాన్ చేసుకుని సిమ్లా – కల్కా రైలు ప్రయాణం కోసం ఒక రోజును కేటాయించుకోవాలి. కనువిందు చేసే హిమాలయాల సౌందర్యాన్ని కంటినిండుగా ఆస్వాదించాలి.
సిమ్లా నుంచి కల్కాకు మధ్య దూరం వందకిలోమీటర్లకు మించదు. ఈ మధ్యలోనే ఉంది వైవిధ్యం అంతా. నూట మూడు టన్నెళ్లుంటాయి. అయితే ఇప్పుడు 46వ నంబరు టన్నెల్ కనిపించడం లేదు. నూటరెండు టన్నెల్స్ కనిపిస్తున్నాయి. కొండ కడుపును చీల్చుకుని అమాంతం దూరిపోవడం ఎవరినైనా బాల్యంలోకి తీసుకెళ్లి తీరుతుంది. వీటన్నింటిలో 33వ నంబర్ టన్నెల్ పొడవు 3,752 అడుగులు. దీని పేరు బారోగ్ టన్నెల్. ఈ టన్నెల్ నుంచి రైలు వెళ్లేటప్పుడు దాదాపుగా రెండున్నర నిమిషాల పాటు టన్నెల్‌లో ఉంటాం.
ఇక వంతెనలు, మలుపుల లెక్క సరిగ్గా తేలదు. వందలాది వంతెనల మీదుగా ప్రయాణిస్తాం. కొండను చుడుతూ మలుపులు కూడా అంతే. ఒక కొండ వాలులో ప్రయాణిస్తూ మరో కొండ నుంచి జాలువారుతున్న జలపాతాన్ని చూడవచ్చు. ఆస్వాదించడానికే ఈ ప్రయాణం, పరుగులు తీస్తూ గమ్యాన్ని చేరడానికి కాదని గుర్తుంచుకుని టూర్ మొదలు పెడితే ఆల్ హ్యాపీస్. రైలు ఆగిన కల్కా స్టేషన్‌లో దిగిన తరవాత మనం రాష్ట్రం మారామని సెల్‌ఫోన్ సిగ్నల్స్ గుర్తు చేస్తాయి. అవును, హర్యానాలో ఉంటాం.