ససాన్ గిర్ టూర్ - సింహం ఇంటికి వెళ్లి వద్దాం!
అది డెబ్బై సెకన్ల వీడియో... ససాన్ గిర్ అడవులను కళ్లకు కడుతుంది
అది డెబ్బై సెకన్ల వీడియో... ససాన్ గిర్ అడవులను కళ్లకు కడుతుంది. మనతోపాటు సూర్యుడు కూడా గిర్ ఫారెస్ట్‌లో విహారానికి వచ్చాడా అన్నట్లు మొదలవుతుంది వీడియో. అమితాబ్ బచన్ ఈ వీడియోలో కౌబాయ్ హ్యాట్, సన్ గాగుల్స్‌తో, నీలం రంగు షర్టు, హ్యాండ్ కఫ్స్ రెండు మడతలు మడిచి కొంచెం రొమాంటిక్‌గా కనిపిస్తాడు. జీప్‌లో కొంతదూరం ప్రయాణించి హిరానీ నది తీరాన జీపు ఆపి ప్రేక్షకులతో మాట్లాడతాడు. ఆ గొంతు విని నదిలో సేద దీరుతున్న తెల్లటి కొంగలు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగుతున్న అందమైన దృశ్యం కనువిందు చేస్తుంది. అమితాబ్ తిరిగి జీప్ ఎక్కి అడవిలోకి ప్రయాణిస్తాడు. పరుగులు తీస్తున్న జింకలు మనల్ని చూసి ఆశ్చర్యంగా ఆగిపోతాయి. ఆ తర్వాత అమితాబ్ వేలితో చూపించిన దిక్కులో ఓ సింహం మనవైపే నడుస్తూ కనిపిస్తుంది. అలాగే ప్రేమగా నుదురు తాకించుకుంటూ ముద్దు చేసుకుంటున్న బుల్లిసింహాలు కూడా. ఇది గుజరాత్ పర్యాటక సౌందర్యం అని ముగిసే ఈ వీడియో ససాన్ గిర్ టూరిజమ్ ప్రమోషన్ కోసం చిత్రీకరించిన వీడియో. 'ససాన్‌గిర్‌ని చూసొద్దాం సింహాల జూలుతో ఆడుకుందాం' అన్నంతగా ప్రభావితం చేసే యాడ్ అది. ఇక గిర్ ఫారెస్ట్ వివరాల్లోకి వెళితే...
పక్షులూ ఉంటాయి!
గుజరాత్ రాష్ట్రంలో వెరావల్‌కు జునాఘడ్‌కు మధ్యలో ఉంది ససాన్ గిర్ ఫారెస్ట్. వెరావల్ ప్రస్తావన ఎందుకంటే ఈ ప్రదేశానికి పౌరాణిక ప్రాశస్త్యం ఉంది. శ్రీకృష్ణుడు ప్రాణాలు వదిలింది ఇక్కడేనని చెబుతారు. అలాగే జునాఘడ్‌కు చారిత్రక ప్రాముఖ్యత ఉంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్లెబిసైట్ నిర్వహించి భారతదేశంలో కలిపిన ఒక రాజాస్థానం అది. ఈ రెండింటి మధ్యన ఉన్న అడవి ససాన్‌గిర్. సింహాల నెలవు. ప్రయాణసౌకర్యం దృష్ట్యా చెప్పాలంటే ససాన్ గిర్ సోమనాథ్ నుంచి 74 కి.మీల దూరాన ఉంది. సోమనాథ్ నుంచి గంటన్నర ప్రయాణంలో చేరుకోవచ్చు. కానీ సోమనాథ్ దాటి అటవీ ప్రదేశంలో అడుగుపెట్టినప్పటి నుంచి మెల్లగా ప్రయాణిస్తూ గ్రీనరీని ఎంజాయ్ చేస్తూ వెళ్లాలంటే కనీసం రెండు గంటలు పడుతుంది. ఈ అడవిలో దాదాపుగా మూడు వందల రకాల పక్షులుంటాయి. ఆర్నిథాలజిస్టులు నచ్చే ప్రదేశం. వంద రకాల చిన్న పెద్ద జంతువులుంటాయి. ఓ యాభై – అరవై రకాల చెట్లుంటాయి. ప్రయాణం చిన్న తుప్పల నుంచి దట్టమైన అటవీప్రదేశంలోకి వెళ్తే కొద్దీ మన కళ్లు చెట్లను, పక్షులను పట్టించుకోవడం మానేస్తాయి. సింహం కోసం వెతుకులాటలో పడిపోతాయి.
రక్షిత వాహనాల్లో వెళ్లాలి!
దట్టమైన అడవి లోపలికి మన వాహనాలను అనుమతించరు. విండోకి ఇనుప మెష్ ఉన్న వన్యప్రాణి విభాగం వాహనాల్లోనే వెళ్లాలి. సింహం వాహనం మీద దూకినా, లోపల ఉన్న వాళ్లకు ప్రమాదం జరగనంత పటిష్టంగా ఉంటుంది మెష్. ఈ వాహనాలకు విడిగా టికెట్ తీసుకోవాలి. ఆ వాహనం సింహాలు, ఇతర జంతువులు సంచరించే ప్రదేశాల్లో తిప్పుతుంది. నీటి మడుగులో ఈదుతున్న జంతువులు, చెట్టు కింద నిద్రపోతున్న సింహాలు, అప్పుడే నిద్రలేచి... 'ఇది మాకు అలవాటే' అన్నట్లు పర్యాటకులను నిరాసక్తంగా చూస్తున్న సింహాలు, గదుల్లో తిరుగుతున్న సింహం పిల్లలు కనిపిస్తాయి. సింహం పిల్లలను పెద్ద జంతువులు చంపి తినకుండా ఉండడానికి వాటిని గదుల్లో ఉంచుతారు. గదులకు చుట్టూ ఫెన్సింగ్ నుంచి మనం వాటిని, అవి మనల్ని చూసుకోవవచ్చు. పర్యాటకులు వాహనం దిగరాదు, ఇనుప మెష్ లోపలి నుంచే చూడాలి.
రైట్ టైమ్ ఇదే!
గిర్ అడవుల్లోకి ఎప్పుడైనా వెళ్లవచ్చు. కానీ డెన్స్ జోన్‌కి వెళ్లడానికి జూన్ 16 నుంచి అక్టోబర్ 15 వరకు నిషేధం. అది సింహాల మేటింగ్ టైమ్. ఆ సమయంలో డెన్స్ ఫారెస్ట్‌లోకి అనుమతించరు. ఒక్కో ఏడాది వర్షాలు ఆలస్యమై సీజన్ ఆలస్యంగా వస్తే అక్టోబర్ నెలాఖరు వరకు కూడా నిషేధం ఉంటుంది. కాబట్టి గిర్ ఫారెస్ట్‌కి వెళ్లాలంటే నవంబర్ నుంచి మార్చి వరకు మంచి టైమ్. జీప్ సఫారీలో దట్టమైన జోన్‌కు తీసుకెళ్లేది కూడా ఈ సమయంలోనే.
ఆదివారం వెళ్లండి!
మన సింహాల నిలయం గిర్ అడవులు. సింహాలను సంరక్షించుకోవడానికి 1965లో గిర్ నేషనల్ పార్కు ఏర్పాటు చేశారు. గిర్ సాంక్చురీ హెడ్‌క్వార్టర్ ససాన్ జోన్. ఇక్కడ ఆదివారం లయన్ షో ఉంటుంది. అడవిలో అమర్చిన కెమెరాల్లో క్యాప్చర్ అయిన సీన్లను ఈ షోలో ప్రదర్శిస్తారు. సింహాలు వేటాడ్డం నుంచి అనేక దృశ్యాలను చూడవచ్చు. గిర్ సాంక్చురీ, నేషనల్ పార్క్ జోన్‌లను కలుపుకుంటే మొత్తం ఫారెస్ట్‌లో సుమారుగా మూడు వందల సింహాలుంటాయి. ఈ అడవులు 2,560 చ.కి.మీటర్ల నుంచి కుంచించుకుపోతూ 1,452 చ.కి.మీలకు చేరాయి. కానీ సింహాలు పర్యాటకుల మీద దాడి చేసినటువంటి సంఘటన ఒక్కటీ లేదు. అయితే గత ఏడాది ఓ సారి సింహం రోడ్డు మీదకు వచ్చి కొంత సేపు సంచరించి పెట్రోల్ బంకులోకి వచ్చి తిరిగి అడవిలోకి వెళ్లిన సంఘటన సీసీ కెమెరాలో రికార్డయింది.