Telugu Global
Travel

రైలు బడి

ఇది జపాన్‌ రచయిత టెట్సుకో కురొయనాగి రాసిన పుస్తకం కాదు. నలభై ఐదేళ్ల కిందట మనదేశ రాజధానిలో స్థాపించిన రైలు మ్యూజియం.

Rail Museum in Delhi
X

రైలు బడి

ఇది జపాన్‌ రచయిత టెట్సుకో కురొయనాగి రాసిన పుస్తకం కాదు. నలభై ఐదేళ్ల కిందట మనదేశ రాజధానిలో స్థాపించిన రైలు మ్యూజియం. ఈ మ్యూజియాన్ని వీక్షించడం ఒక ఎడ్యుకేషన్‌. ఓ వారం పాటు ఢిల్లీలో ఉంటే తప్ప ఈ ప్రదేశాన్ని టూర్‌ ఇటెనరీలో ఎవరూ చేర్చుకోరు. ఈసారి ఢిల్లీ టూర్‌ వెళ్లినప్పుడు తప్పకుండా చూడండి. టీన్స్‌లో ఉన్న పిల్లలు తప్పకుండా చూడాల్సిన మ్యూజియం ఇది.



రైలు మ్యూజియం... మనదేశంలో తొలి రైలుబండి నుంచి ముఖ్యమైన ఇంజనీరింగ్‌ ఎవల్యూషన్‌కు అద్దం పడుతుంది. ఢిల్లీ నడిబొడ్డున చాణక్యపురిలో ఉంది. పది ఎకరాల విస్తీర్ణంలో కొంత భాగం ఇండోర్‌ మ్యూజియం, కొంత అవుట్‌ డోర్‌ మ్యూజియం.



లోకోమోటివ్‌ ఇంజన్‌లు, క్యారియర్‌లు ఉంటాయని చెబితే పెద్దగా ఆసక్తి కలగదు. కానీ బ్రిటిష్‌ యువరాణి ప్రయాణించిన రైలు, మైసూర్‌ మహారాజా ఉపయోగించిన రైలు, మహాత్మాగాంధీ హత్యానంతరం ఆయన చితాభస్మాన్ని తీసుకెళ్లిన రైలును చూడగలం దాదాపుగా నూట నలభై ఏళ్ల యాంత్రిక విప్లవానికి దర్పణం ఈ మ్యూజియం.


ఇక్కడ 1885లో తొలి రైలు నుంచి ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిని చూడవచ్చు. యంత్రం పని చేసే తీరును, అభివృద్ధి చెందిన తీరును కంప్యూటర్‌ స్క్రీన్‌ మీద చూడవచ్చు. స్టీమ్‌ ఇంజన్‌ నుంచి కరెంట్‌ ఇంజన్‌ వరకు మెకానిజాన్ని అర్థం చేసుకోవచ్చు. అందుకే దీనిని రైలు బడి అనవచ్చు.



మినీ రైలు

మ్యూజియం ఆవరణ అంతా తిప్పి చూపించే మినీ రైలు కూడా ఉంది. ఉదయం పదింటికి మ్యూజియంలోకి పర్యాటకులను అనుమతిస్తారు. కానీ మినీ రైలు నడిపే లోకో పైలట్‌ మాత్రం పదకొండు వరకు వస్తూనే ఉంటాడు. స్వీపర్‌లు డ్యూటీ మొదలుపెట్టేది కూడా పది గంటలకు పర్యాటకుల రాక మొదలైన తర్వాత మాత్రమే. ప్రభుత్వ నిర్వహణ, ప్రభుత్వ ఉద్యోగుల పనితీరుకు దర్పణంగా కూడా ఉంటుందీ మ్యూజియం.


ఇండోర్‌ మ్యూజియంలో పదింటికి అన్నీ ఆన్‌ చేసి ఉంచుతారు. అక్కడ డిస్‌ప్లే అవుతున్న యాంత్రికత గురించి సందేహాలు నివృత్తి చేసుకోవడానికి గైడ్‌లు ఎవరూ అందుబాటులో ఉండరు. ఉన్న ఉద్యోగులు ఫోన్‌లో మునిగిపోయి ఉంటారు, ఏ సందేహానికీ బదులివ్వరు. అయినప్పటికీ మనకు మనంగా తెలుసుకోగలిగిన అనేక విషయాల సుమహారం ఇది. చూసి తీరాల్సిన మ్యూజియమే.

First Published:  29 Dec 2022 5:22 PM IST
Next Story