పాపి కొండలు టూర్ రెడీ!
నాలుగు నెలల బ్రేక్ తర్వాత పాపి కొండలు టూర్‌కి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
నాలుగు నెలల బ్రేక్ తర్వాత పాపి కొండలు టూర్‌కి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 4వ తేదీ నుంచే పాపి కొండలు టూరింగ్ బోట్స్ విహారానికి బయల్దేరాయి. శీతాకాలంలో పాపికొండల మధ్య విహరిస్తూ గోదావరి అందాలు చూడాలని చాలామంది కోరుకుంటారు. మరి టూర్ ఎలా ప్లాన్ చేయాలో తెలుసుకుందామా..
గోదావరిపై పొగమంచు పేరుకున్న వేళల్లో పాపికొండల మధ్యగా బోట్ మీద చేసే ప్రయాణం నిజంగా మధురానుభూతినిస్తుంది. తూర్పు కనుమల్లోని దట్టమైన అడవుల గుండా ప్రవహించే గోదావరి నది మీదుగా బోటులో వివరిస్తూ పచ్చని ప్రకృతి అందాలు చూడటమనేది మర్చిపోలేని అనుభూతి. తెలుగు రాష్ట్రాల్లో పాపి కొండల టూర్ చాలా ఫేమస్. ఏటా వేల సంఖ్యలో టూరిస్టులు పాపికొండల టూర్ చేస్తుంటారు.
పాపికొండలు టూర్‌ను రాజమహేంద్రవరం లేదా భద్రాచలం నుంచి మొదలుపెట్టొచ్చు. ఒకేరోజులో భద్రాచలం టు పాపికొండలు లేదా రాజమహేంద్రవరం టు పాపికొండల టూర్‌ను ముగించొచ్చు. అలాకాకుండా పాపికొండల్లో నైట్ స్టే చేయాలనుకుంటే రెండు, మూడు, నాలుగు రోజుల టూర్ ప్యాకేజీలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎటు నుంచి మొదలైనా.. టూర్ ఒకేలా ఉంటుంది. దట్టమైన పాపి కొండల మధ్యన సుమారు 40 కిలోమీటర్ల పొడవున గోదావరి మీదుగా బోట్ ప్రయాణం సాగుతుంది. మధ్యలో హట్ స్టే వంటి వసతులుంటాయి. పాపికొండల మధ్యన గోదావరి నది చాలా తక్కువ వెడల్పుతో ప్రవహిస్తుంది. అక్కడి వాతావరణం ఎంతో రమణీయంగా ఉంటుంది.
భద్రాచలానికి 75 కిలో మీటర్ల దూరంలోని పోచవరం బోట్ పాయింట్ నుంచి టూర్ మొదలుపెట్టొచ్చు. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో దేవీపట్నం మండలం పోశమ్మ గండి ఆలయం బోట్ పాయింట్ నుంచి కూడా టూర్ మొదలుపెట్టొచ్చు. పోశమ్మ గండి ఆలయం బోట్ పాయింట్‌కు రాజమహేంద్రవరం నుంచి కూడా చేరుకోవచ్చు.
ఇక టూర్ ప్యాకేజీ వివరాలు గమనిస్తే.. ఒక్కరోజు, మూడు రోజులు, నాలుగు రోజులు.. ఇలా రకరకాల ట్రిప్ ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయి. ఒక్కరోజు ట్రిప్‌లో భద్రాచలం నుంచి వెహికల్ ద్వారా బోట్ స్టార్టింగ్ పాయింట్‌కి వెళ్తారు. బోట్ ఉదయం 10 గంటలకు మొదలయ్యి సాయంత్రం 5 గంటల వరకూ నదిలో విహరిస్తుంది. సాయంత్రానికి బోట్.. స్టార్టింగ్ పాయింట్‌కు చేరుకుంటుంది. ఇందులోనే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం స్నాక్స్ వంటివి అందిస్తారు. పాపికొండలు ఒక్కరోజు ట్రిప్ ధరలు పెద్దవాళ్లకు రూ. 1,250, పిల్లలకు రూ. 1,050గా ఉన్నాయి. తెలంగాణ టూరిజం అందిస్తున్న మూడు రోజుల టూర్ ధర రూ.6,999గా ఉంది.