భూమి అంచుకు తీసుకెళ్లే రోడ్డు ఇది!
Last Road on Earth | రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఉన్నట్టుండి రోడ్ ఎండ్ అయిపోతే ఎలా అనిపిస్తుంది? చాలా భయమేస్తుంది కదూ! మామూలు రోడ్డుకే అలా అనిపిస్తే మరి ప్రపంచమే ఎండ్ అయ్యే రోడ్డు ఒకటుంది.
రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఉన్నట్టుండి రోడ్ ఎండ్ అయిపోతే ఎలా అనిపిస్తుంది? చాలా భయమేస్తుంది కదూ! మామూలు రోడ్డుకే అలా అనిపిస్తే మరి ప్రపంచమే ఎండ్ అయ్యే రోడ్డు ఒకటుంది. ఆ రోడ్డు మీద వెళ్తే ఎలా అనిపిస్తుందో ఇప్పుడు చూద్దాం..
ఉత్తర నార్వేలో ఉన్న ఓ రోడ్డు ప్రపంచంలోనే అత్యంత అందమైన, అద్బుతమైన రోడ్డు. ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నంత సేపు భూమి చివరకి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. ఉత్తర ధృవానికి దగ్గర్లో ఉండే ఈ రోడ్డుకి చేరుకుంటే ప్రపంచయాత్ర ముగిసినట్లే.. అదే ‘ఇ–-69’ హైవే. ప్రపంచానికి డెడ్ఎండ్ చెప్పే రహదారి ఇది. ప్రపంచంలోని మారుమూల ప్రాంతాన్ని మిగతా ప్రపంచంతో కలిపే జాతీయ రహదారే ‘ఇ–-69’ రోడ్డు. ఈ రోడ్డు నార్త్‌పోల్‌కి దగ్గరగా అంటే.. ఉత్తరం వైపు ప్రపంచం ఎండ్ అయ్యే పాయింట్ వరకూ వెళ్తుంది. భూమిపై అంత చివర వరకూ వెళ్లే హైవే ఇది ఒక్కటే.
వందేళ్లు కష్టపడి..
మంచుతో గడ్డకట్టిన ఈ ప్రాంతంలో ఓ హైవే నిర్మించాలని 1909లో అనుకున్నారు. కానీ, పోల్స్ దగ్గర రోడ్డు వేయడం అంటే అంత ఈజీ కాదు. 1909 లో రోడ్డు మొదలుపెడితే పూర్తవ్వడానికి 1999 వరకూ పట్టింది. అందుకే ఈ రోడ్డుని ‘ఇంజనీరింగ్ వండర్’ అంటుంటారు. ఇది నార్వేలోని ఓల్డర్‌ఫ్యోర్డ్‌ను, నార్డ్‌కాప్ ప్రాంతంతో కలుపుతుంది. శతాబ్దాలుగా మానవ ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా వేరుగా ఉన్న ఎన్నో ప్రాంతాలను ఇది యూరప్‌తో కలుపుతుంది.
అద్భుతాలెన్నో..
ఈ హైవేపై ప్రయాణిస్తే.. ప్రకృతికి ఉన్న రకరకాల రూపాలను చూడొచ్చు. దారి పొడవునా కనిపించే మంచు కొండలు తనలోకి తీసుకోడానికి ముందుకు వస్తున్నట్టు అనిపిస్తాయి. రోడ్డు వెంబడి ఎన్నో లోయలు, ఎత్తైన గుట్టలు కనిపిస్తాయి. ‘ఇ–69’ హైవేలో కొన్ని ప్రాంతాల్లో ఒంటరిగా కారు నడపడం నిషిద్ధం. గుంపుగా ఉన్నప్పుడు మాత్రమే అక్కడి నుంచి వెళ్లడానికి అనుమతి ఉంటుంది. వందల కిలోమీటర్ల పాటు సముద్ర తీరంపైనే ఈ రహదారిపై వెళ్తుంటే పక్కనే ఉన్న చిన్న చిన్న గ్రామాలు సముద్రంలో కలిసిపోతాయేమో అనే అనుభూతి కలుగుతుంది.
ఈ హైవే ఎండ్ అయ్యే ప్లేస్‌ని ‘నార్డ్‌కాప్’ అంటారు. చలికాలం అయితే ఇక్కడి వాతావరణం చెప్పనవసరంలేదు. నార్త్‌పోల్ అంతా చలితో కప్పుకుపోతుంది. దాంతో ఈ రోడ్డుకూడా దాదాపుగా మంచులో మునిగిపోతుంది. భూమికి పూర్తిగా ఉత్తరంగా ధృవానికి దగ్గరగా వెళ్లడమంటే చంద్రుడికి దగ్గరగా వెళ్తున్నట్టే. ఈ ప్రాంతం ఉత్తర ధృవానికి దగ్గరగా ఉండటం వల్ల ఇక్కడ వేసవికాలంలో సూర్యుడు అస్తమించడు. అలాగే చలికాలంలో అసలు ఉదయించడు. చలికాలం అంతటా చీకటిగానే ఉంటుంది. ఉత్తర ధృవం దగ్గర నివసించే వాళ్లకు ఈ ప్రపంచంతో సంబంధం ఉండదు. వందల ఏళ్ల నుంచి వాళ్లు అలానే జీవిస్తున్నారు. వీళ్లంతా సముద్రంలోని చేపలు, తిమింగలాలు, పీతలు వంటి వాటిని పట్టుకుని బతుకుతుంటారు.
చివరి అంచున..
ఈ రోడ్డు వెంట దట్టమైన దేవదారు చెట్లు, రెయిన్ డీర్లు కనిపిస్తుంటాయి. ఈ రోడ్డు డెడ్‌ఎండ్‌కు వెళ్తే చివరకి సముద్రం కనిపిస్తుంది. ఈ- డెడ్‌ఎండ్ దగ్గర ఓ సొరంగం కూడా ఉంది. దాన్ని సముద్రంలో నిర్మించారు. ఇది మెగెరోయా అనే ఐలాండ్‌ని కలుపుతుంది. ఈ డెడ్‌ఎండ్ దగ్గర భూమిలోపల ఒక చర్చి, మ్యూజియం కూడా ఉన్నాయి. ఒకప్పుడు హైవేపై ఇక్కడికి వచ్చినవారు అక్కడితో తమ ప్రపంచయాత్ర ముగిసిందని భావించేవారు. ‘ఇ–-69’ రహదారి ప్రతి ప్రయాణానికి ఒక అంతం ఉంటుందని చెబుతుంది.
అట్లాంటిక్ ఓషన్ రోడ్డు
ఇలాంటిదే నార్వేలో మరో రోడ్డు ఉంది. అదే ‘అట్లాంటిక్ ఓషన్ రోడ్డు’. ఇది అట్లాంటిక్ మహా సముద్రం మీద కట్టిన బ్రిడ్జి హైవే. నార్వేలో క్రిస్టియన్ సండ్, మోల్డ్ అనే రెండు ప్రాంతాలను కలుపుతుంది. ఇది ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన హైవేల్లో ఒకటి. మామూలుగా వర్షాకాలంలో రోడ్డుపై ఉండే నీటిలోంచి వెళ్లాలంటేనే మనకు ధైర్యం చాలదు. అలాంటిది ఈ రోడ్డుపై 24 గంటలు సముద్రపు అలలు కొన్ని మీటర్ల ఎత్తకు లేచి రోడ్డు మీద పడుతుంటాయి. బ్రిడ్జి ఎంతో ఎత్తులో ఉంటుంది. అయినప్పటికీ అలలు బ్రిడ్జికి ఒకవైపు నుంచి మరో వైపుకు ఎగిసి పడుతుంటాయి.
రకరకాలుగా..
ఈ రోడ్డుని దూరం నుంచి ఒక కోణంలో చూస్తే.. ఫ్లైఓవర్ మొదలు పెట్టి ఆపేసినట్టు కనిపిస్తుంది. ‘పొరపాటున వెళితే కింద నీళ్లలో పడిపోతాం’ అనిపిస్తుంది. ఇంకో కోణంలో చూస్తే సముద్రం మీద పెద్ద పాములా అనిపిస్తుంది. అన్ని వంకరటింకర్ల తో ఉంటుంది ఈ రోడ్డు. అందుకే దీన్ని ‘ద డ్రంకెన్ బ్రిడ్జ్’ అని కూడా పిలుస్తారు. మామూలు టైమ్‌లో కొంచెం పరవాలేదు. కానీ.. వాతావరణం అనుకూలించనప్పుడు మాత్రం ఆ రోడ్డుమీద వెళ్లడమంటే పెద్ద సాహసమే.. పక్కనే అట్లాంటిక్ మహాసముద్రం.. మధ్యలో రోడ్డు.. ఇంకేముంది.. భారీ అలలు, పైగా సముద్రపు అలల వల్ల రోడ్డంతా ఎప్పుడూ తడిసి ఉంటుంది. ప్రపంచంలో ముఖ్యమైన హాలిడే రోడ్ ట్రిప్స్‌లో ఇదొకటి. హాలిడే రోడ్ ట్రిప్ కోసం వేల సంఖ్యలో టూరిస్టులు ఇక్కడికి వస్తుంటారు.