Telugu Global
Travel

ఐఆర్‌‌సీటీసీ ‘టెంపుల్ టూర్ ఆఫ్ సౌత్ ఇండియా’.. ప్యాకేజీ వివరాలివే..

కేరళ, తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను ఒకేసారి దర్శించుకునేందుకు వీలుగా ఐఆర్‌‌సీటీసీ.. ‘టెంపుల్ టూర్ ఆఫ్ సౌత్ ఇండియా’ పేరుతో ఓ టూర్‌‌ను ఆపరేట్ చేస్తోంది.

ఐఆర్‌‌సీటీసీ ‘టెంపుల్ టూర్ ఆఫ్ సౌత్ ఇండియా’.. ప్యాకేజీ వివరాలివే..
X

కేరళ, తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను ఒకేసారి దర్శించుకునేందుకు వీలుగా ఐఆర్‌‌సీటీసీ.. ‘టెంపుల్ టూర్ ఆఫ్ సౌత్ ఇండియా’ పేరుతో ఓ టూర్‌‌ను ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ ప్యాకేజీ ఎలా ఉంటుందంటే.

తమిళనాడులోని రామేశ్వరం, మధుర మీనాక్షి ఆలయంతో పాటు కేరళలోని పద్మనాభస్వామి ఆలయాన్ని కవర్ చేస్తూ ఐఆర్‌‌సీటీసీ.. టెంపుల్ టూర్ ఆఫ్ సౌత్ ఇండియా ప్యాకేజీని అందుబాటులో ఉంచింది. నవంబర్ 3న మొదలయ్యే ఈ టూర్ తొమ్మిది రాత్రులు, పది పగళ్ల పాటు సాగుతుంది. ఈ ట్రైన్ భుబనేశ్వర్ నుంచి మొదలవుతుంది. విజయనగరం, విశాఖపట్నం స్టేషన్లలో కూడా బోర్డింగ్‌కు అవకాశం ఉంది.

ప్రయాణం ఇలా...

మొదటిరోజు భుబనేశ్వర్ రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 12.10 గంటలకు బయలుదేరే ‘భుబనేశ్వర్– రామేశ్వరం సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌’ రైలు.. సాయంత్రానికి వైజాగ్ చేరుకుంటుంది. ఓవర్ నైట్ జర్నీ చేసిన తర్వాత రెండో రోజు రాత్రికి రామనాథపురం చేరుకుంటారు. అక్కడ్నుంచి రోడ్డు మార్గం ద్వారా రామేశ్వరం తీసుకెళ్తారు. రాత్రికి హోటల్లో స్టే ఉంటుంది.

మూడో రోజు ఉదయాన్నే రామనాథస్వామి ఆలయం, రామర్‌పాదం ఆలయం, పంచముఖ ఆంజనేయ ఆలయాల సందర్శన ఉంటుంది. ఆ తర్వాత హోటల్‌లో రెస్ట్ తీసుకుని మధ్యాహ్నం ధనుష్కోడికి వెళ్తారు. సాయంత్రం అక్కడ షాపింగ్‌ చేసుకోవచ్చు. ఇక నాలుగో రోజు పొద్దున్నే కలాం మ్యూజియం చూసి, కన్యాకుమారికి బయల్దేరతారు. సాయంత్రానికి కన్యాకుమారి చేరుకుని అక్కడ సన్ సెట్ పాయింట్ చూసుకుని షాపింగ్ వంటివి చేస్తారు. ఐదో రోజు తెల్లవారుజామున కన్యాకుమారిలో సన్ రైజ్ చూసుకుని కుమారి అమ్మన్ ఆలయానికి వెళ్తారు. అక్కడ మూడు సముద్రాలు కలిసే చోటు, వివేకానంద రాక్ మెమోరియల్, తిరువల్లువర్ విగ్రహం, మహాత్మా గాంధీ మెమోరియల్, వ్యాక్స్ మ్యూజియం వంటివి చూసుకుని సన్ సెట్ అయిన తర్వాత తిరిగి హోటల్‌కు చేరుకుంటారు.

ఆరో రోజు ఉదయాన్నే తిరుచందూర్ ఆలయాన్ని దర్శించుకొని తర్వాత పద్మనాభపురం ప్యాలెస్ మీదుగా తిరువనంతపురం వెళ్తారు. మధ్యాహ్నానికి తిరువనంతపురం చేరుకుని రెస్ట్ తీసుకున్న తర్వాత సాయంత్రం కోవలం బీచ్‌కు వెళ్తారు. ఇక ఏడో రోజు ఉదయాన్నే అనంత పద్మనాభస్వామి ఆలయ దర్శనం ఉంటుంది. ఆ తర్వాత చిత్ర ఆర్ట్ గ్యాలరీ, నేపియర్ మ్యూజియం, నేచురల్ హిస్టరీ మ్యూజియం, అట్టుకల్ భగవతి ఆలయం, సైన్స్ అండ్‌ టెక్నాలజీ మ్యూజియం, ప్లానిటోరియం వంటివి విజిట్ చేసి రాత్రికి హోటల్‌లో స్టే చేస్తారు.

ఎనిమిదో రోజు ఉదయాన్నే బయల్దేరి మధ్యాహ్నానికి మధురై చేరుకుంటారు. అక్కడ తిరుమలై నాయకర్‌ మహల్‌, మీనాక్షి అమ్మవారి ఆలయం దర్శించుకుని రాత్రికి హోటల్‌లో స్టే చేస్తారు. తొమ్మిదో రోజు ఉదయం 11 గంటలకు మధురైలో ట్రైన్ ఎక్కడంతో టూర్ ముగుస్తుంది.

ప్యాకేజీలో భాగంగా బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ట్రైన్ టికెట్లు, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటివి కవర్ అవుతాయి. ట్రైన్ జర్నీలో ఫుడ్, పర్యాటక ప్రదేశాల్లో ఎంట్రీ ఫీజుల వంటివి ప్రయాణికులే చూసుకోవాలి. ప్యాకేజీ ధరలు ట్రైన్ క్లాస్, షేరింగ్‌ను బట్టి రూ. 28,220 నుంచి రూ. 72,380 వరకూ అందుబాటులో ఉన్నాయి.

First Published:  26 Oct 2023 4:43 PM IST
Next Story