ఐఆర్‌సీటీసీ లేహ్ టూర్.. ప్యాకేజీ వివరాలివే..
టూర్ ప్యాకేజీలో భాగంగా హైదరాబాద్ - లేహ్, లేహ్- హైదరాబాద్ ఫ్లైట్ టికెట్లు, లేహ్, నూబ్రా, పాంగాంగ్‌లో వసతి సౌకర్యం, మూడు పూటలా ఆహారం, ట్రావెల్ ఇన్సురెన్స్ వంటివి కవర్ అవుతాయి.
హిమాలయాల మధ్యన ఉన్న అందమైన పర్వత ఎడారి ప్రాంతం లేహ్. ఇది చాలామందికి డ్రీమ్ డెస్టినేషన్. ముఖ్యంగా యూత్ చాలామంది ఒక్కసారైనా లేహ్ వెళ్లాలని కోరుకుంటారు. అలాంటి వాళ్ల కోసం ఐఆర్‌సీటీసీ ‘లేహ్ విత్ టుర్టుక్’ పేరుతో ఒక టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది.
చుట్టూ ఎత్తైన హిమాలయ పర్వతాలు.. మధ్యలో అందమైన సరస్సులు, అక్కడక్కడా చిన్నచిన్న గ్రామాలు.. ఇలా లద్దాఖ్‌లో చూడాల్సిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. వీటన్నింటినీ కవర్ చేస్తూ ఐఆర్‌సీటీసీ ఒక టూర్ రెడీ చేసింది. ఆరు రాత్రులు, ఏడు పగళ్లు ఉండే ఈ టూర్‌లో లేహ్ ప్యాలెస్, మ్యాగ్నెటిక్ హిల్స్, నుబ్రా వ్యాలీ, పాంగాంగ్ సరస్సు, టుర్టుక్ విలేజ్‌ను ఈ టూర్‌లో భాగంగా సందర్శించే అవకాశం ఉంటుంది. ఆగస్టు 18, 28, సెప్టెంబర్ 7, 22 తేదీల్లో ప్రయాణం ఉంటుంది. టికెట్లు ఇప్పట్నుంచే బుక్ చేసుకోవచ్చు.
టూర్ మొదటిరోజు ఫ్లైట్ ద్వారా లేహ్ చేరుకుంటారు. మొదటిరోజు లేహ్‌లోనే హోటల్ స్టే ఉంటుంది. రెండోరోజు ‘హాల్ ఆఫ్ ఫేమ్’ మ్యూజియం విజిట్, జోరావర్ ఫోర్ట్, గురుద్వారా పత్తర్ సాహెబ్, శాంతి స్థూపం, లేహ్ ప్యాలెస్ విజిట్ ఉంటుంది. అదే రోజు సాయంత్రం లేహ్ నుంచి శ్రీనగర్ హైవేలో ఉన్న మ్యాగ్నెటిక్ హిల్ , సింధు మైదానం వంటివి చూడొచ్చు. ఇక మూడో రోజు ఖర్దుంగ్లా పాస్ మీదుగా నూబ్రా వ్యాలీ చేరుకుంటారు. అక్కడ డిస్కిట్, హండర్ వంటి అందమైన గ్రామాలను వీక్షిస్తారు. నూబ్రా వ్యాలీలో ఒంటె సఫారీ లాంటివి కూడా చేయొచ్చు. ఆరోజు రాత్రి బస నూబ్రాలోనే ఉంటుంది.
నాలుగో రోజు సియాచిన్ వార్ మెమోరియల్, థాంగ్ జీరో పాయింట్ మీదుగా టుర్టుక్ గ్రామానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రాత్రికి నూబ్రా చేరుకుంటారు. ఐదో రోజు పాంగాంగ్ లేక్‌కు చేరుకుని అక్కడే బస చేస్తారు. ఆరో రోజు పాంగాంగ్ నుంచి థిక్సే మొనాస్ట్రీ, షే ప్యాలెస్, రాంచో స్కూల్‌లను సందర్శించి తిరిగి లేహ్ చేరుకుంటారు. ఏడో రోజు ఉదయం లేహ్ ఎయిర్‌పోర్ట్ చేరుకొని రిటర్న్ ఫ్లైట్ ఎక్కడంతో టూర్ ముగుస్తుంది.
ప్యాకేజీ వివరాలివే..
టూర్ ప్యాకేజీలో భాగంగా హైదరాబాద్ - లేహ్, లేహ్- హైదరాబాద్ ఫ్లైట్ టికెట్లు, లేహ్, నూబ్రా, పాంగాంగ్‌లో వసతి సౌకర్యం, మూడు పూటలా ఆహారం, ట్రావెల్ ఇన్సురెన్స్ వంటివి కవర్ అవుతాయి.
జాగ్రత్తలు మస్ట్..
లేహ్ ఎత్తైన ప్రదేశం అవ్వడం వల్ల అక్కడ ఆక్సిజన్ లెవల్స్ తక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రయాణానికి ముందు డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. అలాగే ప్రయాణానికి ముందు మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది.
ప్యాకేజ్ ఛార్జీలు సింగిల్ షేరింగ్ ఒక్కొక్కరికీ రూ.46,110, ట్విన్ షేరింగ్ అయితే రూ.41,835, ట్రిపుల్ షేరింగ్ అయితే రూ.41,355.