Telugu Global
Travel

ఐఆర్‌‌సీటీసీ గుజరాత్ టూర్.. ప్యాకేజీ వివరాలివే..

IRCTC Gujarat Tour | గుజరాత్‌లోని పర్యాటక ప్రదేశాలను సందర్శించడం కోసం ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ ‘సుందర్‌ సౌరాష్ట్ర’ పేరుతో ఓ టూర్ ప్యాకేజీని రెడీ చేసింది. ఈ టూర్‌‌లో పోరుబందర్, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, రాజ్ కోట్, ద్వారక వంటి పలు ప్రదేశాలను కవర్ చేయొచ్చు.

ఐఆర్‌‌సీటీసీ గుజరాత్ టూర్.. ప్యాకేజీ వివరాలివే..
X

ఐఆర్‌‌సీటీసీ గుజరాత్ టూర్.. ప్యాకేజీ వివరాలివే..

గుజరాత్‌లోని పర్యాటక ప్రదేశాలను సందర్శించడం కోసం ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ ‘సుందర్‌ సౌరాష్ట్ర’ పేరుతో ఓ టూర్ ప్యాకేజీని రెడీ చేసింది. ఈ టూర్‌‌లో పోరుబందర్, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, రాజ్ కోట్, ద్వారక వంటి పలు ప్రదేశాలను కవర్ చేయొచ్చు. టూర్ వివరాల్లోకి వెళ్తే..

ఐఆర్‌‌సీటీసీ ‘సుందర్‌ సౌరాష్ట్ర’ టూర్.. హైదరాబాద్‌ నుంచి మొదలవుతుంది. ఏడు రాత్రులు, ఎనిమిది పగళ్ల పాటు సాగే ఈ టూర్‌ సికింద్రాబాద్‌తో పాటు గుల్బర్గా, కళ్యాణ్‌, పుణె, సోలాపుర్‌ స్టేషన్ల మీదుగా వెళ్తోంది. ప్రయాణీకులు ఆయా రైల్వే స్టేషన్లలో కూడా రైలు ఎక్కొచ్చు. ఈ టూర్ సర్వీసు ప్రతి బుధవారం అందుబాటులో ఉంటుంది. అక్టోబరు 18 తర్వాతి తేదీల కోసం ఇప్పటినుంచే టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు.

ప్రయాణం ఇలా...

మొదటిరోజు సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 3 గంటలకు -పోర్‌బందర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎక్కడంతో సుందర్ సౌరాష్ట్ర టూర్ మొదలవుతుంది. రెండో రోజు ఉదయం 11 గంటలకు రైలు వడోదరా రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. సాయత్రం వరకూ హోటల్‌లో బస చేసి సాయంత్రం స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ చూసుకుని తిరిగి వడోదరా చేరుకుంటారు. ఆ రోజు రాత్రి హోటల్‌లో స్టే చేసి మూడో రోజు ఉదయాన్నే లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌ని చూసుకుని అహ్మదాబాద్ బయల్దేరతారు. అక్కడ అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించిన తర్వాత రాత్రికి అహ్మదాబాద్‌లో స్టే చేస్తారు. నాలుగో రోజు సబర్మతీ ఆశ్రమాన్ని చూసుకుని రాజ్‌కోట్‌కి బయల్దేరతారు. రాజ్‌కోట్‌లో వాట్సన్ మ్యూజియం, గాంధీ మ్యూజియం, స్వామి నారాయణ్ ఆలయం వంటివి చూసుకుని రాత్రికి రాజ్‌కోట్‌లో స్టే చేస్తారు. ఇక ఐదోరోజు ద్వారకకు వెళ్తారు. ఆ రోజు బెట్‌ ద్వారకను సందర్శించి రాత్రికి ద్వారకలో హోటల్ స్టే చేస్తారు. ఆరో రోజు ద్వారకాదీశ్‌ ఆలయం, సోమనాథ్‌ జ్యోతిర్లింగాన్ని దర్శించుకొని తిరిగి పోర్‌బందర్‌ ట్రైన్ ఎక్కుతారు. పోరుబందర్ నుంచి సికింద్రాబాద్ ట్రైన్ ఎక్కడంతో టూర్ ముగుస్తుంది.

ప్యాకేజీ ధరలు

టూర్ ప్యాకేజీలో భాగంగా ట్రైన్ టికెట్లు, హోటల్ స్టే, ఉదయం టిఫిన్‌, రాత్రి భోజనం, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటివి కవర్ అవుతాయి. పర్యాటక ప్రదేశాల్లో ప్రవేశ రుసుములు వంటివి యాత్రికులే చెల్లించాలి. ట్రైన్ బెర్త్, రూమ్ షేరింగ్‌ను బట్టి రూ.13,810 నుంచి రూ.50,200 వరకూ రకరకాల ప్యాకేజీ ధరలు అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం ఐఆర్‌‌సీటీసీ వెబ్‌సైట్ (www.irctctourism.com) ను సందర్శించొచ్చు.

First Published:  1 Sept 2023 5:00 PM IST
Next Story