బడ్జెట్‌లో ఇలా తిరిగేయొచ్చు!
ఏదైనా టూర్‌కి వెళ్లేముందు దాని కోసం కొంత బడ్జెట్‌ని కేటాయిస్తాం, కానీ ప్రతిసారి అనుకున్న దానికంటే ఎక్కువే ఖర్చు అవుతుంది. ఎంత కంట్రోల్ చేద్దామనుకున్నా ఖర్చు మాత్రం పెరుగుతూనే ఉంటుంది.
ఏదైనా టూర్‌కి వెళ్లేముందు దాని కోసం కొంత బడ్జెట్‌ని కేటాయిస్తాం, కానీ ప్రతిసారి అనుకున్న దానికంటే ఎక్కువే ఖర్చు అవుతుంది. ఎంత కంట్రోల్ చేద్దామనుకున్నా ఖర్చు మాత్రం పెరుగుతూనే ఉంటుంది. అందుకే టూర్ ప్లాన్ చేసుకునే సమయంలోనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆ సమస్య ఉండదు. టూర్‌లో ఖర్చు ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బుకింగ్స్ ముందుగానే..
ఫ్లైట్ టికెట్స్‌ను ఆరు నుంచి ఎనిమిది వారాలు ముందుగా బుక్ చేసుకోండి. అడ్వాన్స్‌గా బుక్ చేసుకోవడం వల్ల తగ్గింపు లభిస్తుంది. ఒకవేళ రౌండ్‌ట్రిప్ బుక్ చేస్తే మరింత తక్కువలో లభిస్తాయి. రౌండ్ ట్రిప్ బుక్ చేసుకున్న వారికి ఎయిర్‌లైన్స్ డిస్కౌంట్స్‌ను కూడా అందిస్తుంటాయి. చెల్లింపులు కూడా ముందే జరిపెయ్యాలి. ముందు బుక్ చేసుకొని తర్వాత చెల్లించవచ్చని భావిస్తూ ఉంటారు కొంతమంది. ఈలోపల ఫారెన్ ఎక్స్‌ఛేంజ్‌లో వచ్చిన తేడా కారణంగా వాటిపై అదనపు మొత్తాలు చెల్లించాల్సి రావచ్చు.
వీకెండ్స్ వద్దు
వీకెండ్స్‌లో ట్రావెల్ ప్లాన్ పెట్టుకోకూడదు. ఎక్కువ మంది వీకెండ్స్‌లోనే టూర్లకు వెళు్తుంటారు. కాబట్టి ఆ సమయంలో విమాన ఛార్జీలు, హోటల్ రూమ్ ఛార్జీలు ఎక్కువగా ఉంటాయి. సోమవారం నుంచి గురువారం మధ్యలో టూర్‌ప్లాన్ చేసుకుంటే మంచిది.
తక్కువలో స్టే
హోటల్స్‌లో స్టే చేస్తే బడ్జెట్ ఎక్కువవుతుందనుకుంటే హాస్టల్స్‌ను ఎంచుకోవచ్చు. స్టూడెంట్స్‌కు మాత్రమే కాకుండా అన్ని వయసుల వారు హాస్టల్స్‌లో ఉండవచ్చు. హాస్టల్స్‌లో ప్రైవేట్ రూమ్స్ వంటివి కూడా అందుబాటులో ఉంటాయి. ఒకవేళ ఎలాంటి డబ్బులు చెల్లించకుండా స్టే చేయాలంటే ‘కోచ్‌సర్ఫింగ్’ను ఎంచుకోవాలి. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రావెలర్స్‌తో కనెక్ట్ కావచ్చు. వారి ఇళ్లలో స్టే చేయవచ్చు. ఈ వెబ్‌సైట్ ట్రావెలర్స్‌కు పూర్తి భద్రతను అందిస్తుంది. రకరకాల స్టేజ్‌ల్లో వెరిఫికేషన్ చేశాకే ట్రావెలర్స్‌తో కనెక్ట్ అయ్యే అవకాశాన్నిస్తుంది. ఒకవేళ మీరు ఆ సిటీలో ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తుందనకుంటే అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకోవడం ఉత్తమం. ఫర్నిష్డ్ అపార్ట్‌మెంట్స్ హోటల్స్ కన్నా తక్కువ ధరలో లభిస్తాయి. కిచెన్, లాండ్రీ, టీవీరూమ్ వంటి సదుపాయాలన్నీ ఉంటాయి. టూర్ ఎన్ని రోజులు అనేదాన్ని బట్టి ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి
స్టార్స్ తగ్గినా ఇబ్బంది లేదు
తప్పనిసరిగా హోటళ్లలో నే ఉండాలి అనుకుంటే , ఫైవ్ స్టార్ హోటళ్ళకు బదులు త్రీ స్టార్ హోటళ్ళలో బస చేయడం ద్వారా డబ్బు కాస్త ఆదా చేయొచ్చు. ముఖ్యంగా యూరప్, ఆస్ట్రేలియా దేశాల్లోని త్రీ స్టార్ హోటళ్ళలో పర్యాటకులకు అద్భుతమైన గదులు, సేవలు, సౌకర్యాలు లభిస్తాయి. కాబట్టి, మీరు డబ్బు ఆదా చేసుకోవాలనుకున్నప్పుడు ఫైవ్ స్టార్ హోటళ్ళను ఎంచుకోకపోవడమే మంచిది.
క్రెడిట్ కార్డ్ రివార్డ్స్
ప్రయాణానికి అయ్యే ఖర్చులను క్రెడిట్ కార్డ్ రివార్డు పాయింట్లతో చెల్లించండి. ఉద్యోగులను, వినియోగదారులను ఆకట్టుకోవడానికి పలు ఉద్యోగ, వాణిజ్య సంస్థలు క్రెడిట్ కార్డ్స్ పాయింట్లు ఇస్తుంటాయి. వీటితో షాపింగ్ లేదా విమాన టిక్కెట్లు కొనుక్కోండి. ఖర్చు కలిసొస్తుంది.
ఆదాయంగా మార్చుకోవచ్చు
మీరు పర్యటించిన ప్రాంత విశిష్టత, ఆకట్టుకునే అంశాల గురించి వ్యాసాలు, కథనాలను బ్లాగ్స్ రూపంలో రాయండి. దాంతో కొంత ఆదాయం పొందొచ్చు. పర్యాటక ప్రాంతాల్లో పాకెట్ మనీ కోసం చిన్న చిన్న పనులు చేయండి. సంపాదనతో పాటు కొత్త అనుభవం మీ సొంతమవుతుంది.
ఈ దేశాలు బెస్ట్
విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నవారు అమెరికా యూరోప్ లాంటి దేశాల కన్నా రూపాయి మారకం రేటు స్థిరంగా ఉన్న దక్షిణాఫ్రికా, టర్కీ, రష్యా, సింగపూర్, మలేసియా, థాయిలాండ్, దుబాయ్, హాంకాంగ్ లాంటి దేశాలను పరిగణనలోకి తీసుకోండి. ఇండోనేసియా, కంబోడియా, వియత్నాం,హంగేరి, శ్రీలంక లాంటి దేశాలు మన రూపాయి కన్నా ఎక్కువ కన్వర్షన్ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి.