Telugu Global
Travel

అర్ధగిరి వీరాంజనేయ స్వామి ఆలయ చరిత్ర

కాణిపాకం నుంచి కేవలం పదికిలోమీటర్ల దూరంలోగల అరగొండ గ్రామంలో శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి క్షేత్రం ఉంది.

అర్ధగిరి వీరాంజనేయ స్వామి ఆలయ చరిత్ర
X

చిత్తూరుజిల్లాలో పవిత్రమైన తిరుపతి పుణ్య క్షేత్రానికి 75 కిలోమీటర్ల దూరంలో గల సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం |

కాణిపాకం నుంచి కేవలం పదికిలోమీటర్ల దూరంలోగల అరగొండ గ్రామంలో శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి క్షేత్రం ఉంది. ఇటీవల బాగా ప్రసిద్ధి చెందింది.

ఈ క్షేత్రంలోని సంజీవరాయ పుష్కరిణి, మరింతగా ప్రసిద్ధి చెందింది.



ఈ క్షేత్రం పుష్కరిణి త్రేతాయుగం నాటిదైతే, ఆలయం మాత్రం చోళరాజులు నిర్మించారని చరిత్ర ఆధారాలు తెల్పుతున్నాయి.

ఈ పుష్కరిణిలో నీరు సేవిస్తే, ఆ నీటిలో వనమూలికల ప్రభావంతో వ్యాధులు నయం కావడమేగాక మనోవాంఛలు కూడా నెరవేరతాయని భక్తులు విశ్వసిస్తున్నారు.

ఈ అర్ధగిరి క్షేత్రం వెనక రామాయణలో ఒక కథ ఉంది.

త్రేతాయుగంలో రామరావణుల మధ్య యుద్ధం జరిగిన విషయం తెలిసిందే కదా !

రావణుడి కుమారుడైన ఇంద్రజిత్తు.

బాణాలకు లక్ష్మణుడు మూర్చపోయాడు. అప్పుడు లక్ష్మణుడు.మరణించాడని రాముడు చింతాక్రాంతుడౌతాడు.

అప్పుడు సంజీవని మొక్క తెచ్చి లక్ష్మణుడికి వాసన చూపిస్తే స్పృహ వస్తుందని చెబుతారు.

సంజీవనిని తేవడానికి ఆంజనేయస్వామి బయలుదేరతాడు. సంజీవని పర్వతంచేరతాడు. అయితే సంజీవని మొక్క ఎక్కడుందో తెలియక పర్వతాన్నే పెకలించి తీసుకువెళ్తాడు.

అలా ఆంజనేయస్వామి ఆ పర్వతాన్ని తీసుకువెళ్తుండగా అర్థకొండ విరిగి పెళపెళా రాలడంతో నేలమీద పడింది.

ఆ కొండ పడిన ప్రాంతంలోనే అర్ధగిరి అనే గ్రామం వెలసింది. ఆ గ్రామమే అరకొండగా,అరగొండగా మారిందని చరిత్ర చెబుతోంది.

అలా ఆంజనేయస్వామి వారి చేతినుండి జారిపడ్డ అరగొండలో వన మూలికలతో నిండిన సంజీవరాయ పుష్కరిణి సహజసిద్ధంగా. ఏర్పడింది.

మండలం రోజులు స్వామిని పూజించి, సంజీవరాయ పుష్కరిణి తీర్థం సేవిస్తే సోరియాసిస్, ఆస్త్మా, పక్షవాతం, కీళ్లనొప్పులు, చర్మవ్యాధులు, మొండివ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులు నయమౌతాయని భక్తుల అనుభవాలు చెబుతున్నాయి.

మహిమ కలిగిన కొండమీద వనమూలికలతో సహసిద్ధంగా ఏర్పడ్డ సంజీవరాయ పుష్కరిణిలో త్రేతా యుగంలో దేవతలు స్నానం ఆచరించేవారని, వారిని వారు వచ్చి వెళ్ళినప్పుడు ఆహ్లాదకరమైన ప్రణవ నాదం వినిపించేదనీ అంటారు.

త్రేతాయుగంలో సంజీవని సోకగానే తొమ్మిది నిమిషాల వ్యవధిలో లక్ష్మణుడు మేల్కొన్నాడు. త్రేతా యుగములో తొమ్మిది నిమిషాల కాలం కలియుగంలో తొమ్మిది నెలల కాలానికి సమానం .అంటే సంజీవరాయ పుష్కరిణిలోతీర్థాన్ని వరుసగా తొమ్మిది పౌర్ణమి రోజులు సేవిస్తే సకల శుభాలు కలుగుతాయని తెలుస్తోంది.

పులులు తమ వేటను ( వేటాడి తెచ్చుకున్నవాటిని )తినే గుండు ఇక్కడ ఉన్నది దానికి పులిగుండు అని పేరు పులిగుండు నుంచి శ్రమపడి లోపలకు వెళ్ళగలిగితే పులి హోరు అనే కోనేరు వస్తుంది .ఈ తీర్థం స్త్రీల వ్యాధుల్ని నయం చేస్తుందని ఈ ప్రాంత గిరిజనుల విశ్వాసం.

ఇక్కడి తీర్ధమే గాక ఈ క్షేత్రంలో వీచే గాలి కూడా ఔషధీయుక్తమైనదని, అర్ధగిరి క్షేత్ర సందర్శనం పూర్వజన్మ సుకృతం అనీ ,1000జన్మల పుణ్యఫలం అంటున్నారు ఈ క్షేత్రాన్ని దర్శించినభక్తజనులు.




త్రేతా యుగములో శ్రీ సీతారాముల పాదపద్మాల వద్ద జన్మపావనం చేసుకున్న అంజనీపుత్రుడు చిరంజీవి అయిన శ్రీ ఆంజనేయ స్వామి అర్ధగిరిపై వెలిశాడు.

ఇక్కడ గుడిలో తొలి సూర్యకిరణం వీరాంజనేయ స్వామి పాదాలపై పడి కొద్దిసేపటికి నడుము పై భాగాన్ని తర్వాత శిరస్సును తాకి అంతరార్థమైపోతుంది. ఉదయం 7 గంటలలోపు ఇలా జరుగుతుంది అప్పటి వాస్తు నిపుణులయిన శిల్పుల ప్రతిభకు ఇది నిదర్శనం.

సందర్శనీయ క్షేత్రం అర్ధగిరి వీరాంజనేయస్వామి ఆలయ క్షేత్రం.


- కావ్యసుధ

First Published:  13 May 2023 6:04 PM IST
Next Story