డైనోసార్ల ఊరు గురించి తెలుసా!
గుజరాత్‌లోని బాలాసినోర్‌కు దగ్గర్లో ఉన్న రాయియోలి అనే ప్లేస్‌లో ఒకప్పుడు డైనోసార్లు తిరిగినట్టు ఆధారాలు దొరికాయి.
మనదేశంలో డైనోసార్ల ఊరు ఒకటుందని మీకు తెలుసా? డైనోసార్లంటే పార్క్‌లో నిర్మించే బొమ్మలు కాదు. నిజమైన డైనోసార్లు తిరిగిన ప్లేస్ అది. అందుకే దాన్ని డైనోసార్ల ఊరు అంటుంటారు. మరి ఆ ప్లేస్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందామా!
గుజరాత్‌లోని బాలాసినోర్‌కు దగ్గర్లో ఉన్న రాయియోలి అనే ప్లేస్‌లో ఒకప్పుడు డైనోసార్లు తిరిగినట్టు ఆధారాలు దొరికాయి. డైనోసార్లు తిరిగిన నేల అని చెప్పడానికి సాక్ష్యంగా వాటి అవశేషాలు, గుడ్ల వంటివి ఎన్నో ఇక్కడి నేలలో బయటపడ్డాయి. దాంతో అక్కడే పెద్ద మ్యూజియం కట్టి ఆ అవశేషాలకు జాగ్రత్తగా భద్రపరిచారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డైనోసార్ అవశేషాల కేంద్రం.
బాలాసినోర్ ప్రాంతంలో లక్షల సంవత్సరాల కిందట డైనోసార్లు నివసించాయని పరిశోధనల్లో తేలింది. ప్రపంచంలో డైనోసార్లు సంచరించిన ప్రధాన ప్రాంతాల్లో బాలాసినోర్ ప్రాంతం మూడోదట. బాలాసినోర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో నేల డైనోసార్ గుడ్లు పొదగటానికి అనువుగా ఉండేదట. అందుకే ఎక్కడెక్కడి నుంచో డైనోసార్లు ఇక్కడికి వచ్చి గుడ్లు పెట్టేవని పరిశోధకులు చెప్తున్నారు.
డైనోసార్ మ్యూజియం
ఇక్కడ ఉండే ‘డైనోసార్ ఫాజిల్ పార్క్ అండ్ మ్యూజియం’లో వందల సంఖ్యలో డైనోసార్ల గుడ్లు, వాటి ఎముకలు, వెన్నుపూస, తల, ఇతర భాగాలను చూడొచ్చు. ఈ మ్యూజియంకు వెళ్తే.. డైనోసార్ల గురించిన ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు.
డైనోసార్ల నమూనాల నుంచి వాటి చరిత్ర, అంతరించిన విధానం.. వరకూ అన్ని విషయాలు ఈ మ్యూజియం ద్వారా తెలుసుకోవచ్చు. అంతేకాదు ఈ మ్యూజియంలో డైనోసార్లకు సంబంధించిన త్రీడీ ప్రొజెక్షన్, వర్చువల్ రియాలిటీ షోలు కూడా ప్రదర్శిస్తారు. అహ్మదాబాద్ నుంచి 83 కిలో మీటర్ల దూరంలో బాలాసినోర్ ఉంటుంది. అక్కడికి 15 కిలో మీటర్ల దూరంలో రాయియోలి గ్రామం ఉంది.