Telugu Global
Travel

క్రూజ్ ట్రావెల్ చేస్తారా?

రోడ్డు, రైలు, విమాన ప్రయాణాలు చేసి బోర్ కొట్టిందా? అయితే నీటిపై చేసే క్రూజ్ ట్రావెల్‌ను ట్రై చేయాల్సిందే. క్రూజింగ్ అంటే షిప్‌ల్లో సముద్రాలపై చేసే ప్రయాణం.

క్రూజ్ ట్రావెల్ చేస్తారా?
X

రోడ్డు, రైలు, విమాన ప్రయాణాలు చేసి బోర్ కొట్టిందా? అయితే నీటిపై చేసే క్రూజ్ ట్రావెల్‌ను ట్రై చేయాల్సిందే. క్రూజింగ్ అంటే షిప్‌ల్లో సముద్రాలపై చేసే ప్రయాణం. ఇది ఒక అరుదైన ట్రావెల్ ఎక్స్‌పీరియన్స్. క్రూజింగ్ టూర్స్ ఎలా ఉంటాయంటే..



పెద్ద పెద్ద షిప్‌ల్లో సముద్రంపై నెలల పాటు ట్రావెల్ చేసే క్రూజింగ్ ట్రిప్స్‌కు ఎప్పటి నుంచో క్రేజ్ ఉంది. ఏటా చాలామంది క్రూజింగ్ ద్వారా రకరకాల ప్రాంతాలకు ట్రావెల్ చేస్తుంటారు. మనదేశంలో ముంబై నుంచి మాల్దీవ్స్, బ్యాంకాక్.. కొచ్చిన్ నుంచి లక్షద్వీప్.. ఇలా కొన్ని క్రూజింగ్ ట్రిప్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ తరహా ట్రావెలింగ్‌లో డెస్టినేషన్ కంటే ప్రయాణాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తారు. వారాలు, నెలలు, సంవత్సరాలు తరబడి కూడా ఈ క్రూజింగ్‌లు సాగుతాయి. పైగా ఈ క్రూజ్‌లన్నీ బాగా దూరంగా ఉండే రిమోట్ దేశాలకు, ఐల్యాండ్స్‌కు చేరవేస్తాయి.

లగ్జరీ ట్రిప్

క్రూజింగ్ అనేది ప్రపంచంలోనే లగ్జరీ ట్రావెల్ కేటగిరీ. అంటార్కిటికా, హవాయి ఐల్యాండ్స్.. ఇలా ప్రపంచంలోని మారుమూల ప్రాంతాలకు ట్రావెల్ చేయాలనుకునేవాళ్లు క్రూజ్ ట్రిప్స్‌ను ఎంచుకుంటుంటారు. పైగా ఇందులో ఉండే వసతులు అన్నీఇన్నీ కావు. ఒక్కమాటలో చెప్పాలంటే క్రూజ్ షిప్ అంటే కదిలే భవనం లాంటిది.


ఇలాంటి క్రూజింగ్ షిప్‌ల్లో లిమిటెడ్ పర్సన్స్‌కే అనుమతి ఉంటుంది. ఎక్కువరోజుల పాటు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కాబట్టి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. షిప్ రకాన్ని బట్టి లగ్జరీ రూమ్స్, స్విమ్మింగ్ పూల్స్, రెస్టారెంట్స్, గేమ్స్, ఆడిటోరియం, జిమ్.. ఇలా పెద్ద సెటప్ ఉంటుంది. అలాకాకుండా కొన్ని మామూలు షిప్స్ కూడా ఉంటాయి. వీటిలో ఇండివిడ్యువల్ క్యాబిన్స్, కామన్ రెస్టారెంట్ వంటివి ఉంటాయి.


మనదేశంలో ఇలా

క్రూజింగ్ ట్రిప్స్ చేయాలనుకునేవాళ్లకు మనదేశంలో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ముఖ్యంగా అండమాన్, లక్షద్వీప్ క్రూజ్ ట్రిప్స్ చాలా పాపులర్. అండమాన్ క్రూజ్ ట్రిప్ బంగాళాఖాతం మీదుగా వారం రోజులపాటు సాగుతుంది. చెన్నై, కోల్‌కతా, విశాఖపట్నం నుంచి షిప్‌లు అందుబాటులో ఉంటాయి. టికెట్ ధరలు క్యాబిన్ రకాన్ని బట్టి రూ.6,000 నుంచి మొదలవుతాయి.

ఇక లక్షద్వీప్ క్రూజ్ విషయానికొస్తే ఇది కాస్త లగ్జరీ ట్రిప్‌గా చెప్పుకోవచ్చు. ప్రభుత్వ షిప్‌లతో పాటు ప్రైవేట్ క్రూజింగ్ షిప్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. లక్షద్వీప్‌కు వెళ్లే షిప్‌లు కొచ్చిన్ నుంచి మొదలవుతాయి. ఈ ట్రిప్ కూడా వారం రోజుల పాటు సాగుతుంది. వీటితో పాటు ముంబై నుంచి గోవాకు, ముంబై నుంచి సింగపూర్, మాల్దీవ్స్, బ్యాంకాక్‌కు వరల్డ్ క్లాస్ క్రూజింగ్ షిప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాస్త ఖర్చుతో కూడుకున్న ఆప్షన్లు.

First Published:  20 Nov 2023 4:30 PM IST
Next Story