Telugu Global
Travel

బౌద్ధ సిరి లంక

శ్రీలంక... రామాయణ ఇతిహాస కాలం నుంచి భారతదేశంతో అనుసంధానమై ఉన్న నేల. ఆ తర్వాత రెండు దేశాల మధ్య ఆత్మీయ బంధం బౌద్ధంతో అల్లుకుంది.

బౌద్ధ సిరి లంక
X

శ్రీలంక... రామాయణ ఇతిహాస కాలం నుంచి భారతదేశంతో అనుసంధానమై ఉన్న నేల. ఆ తర్వాత రెండు దేశాల మధ్య ఆత్మీయ బంధం బౌద్ధంతో అల్లుకుంది. క్రీ.పూ మూడవ శతాబ్దంలో అల్లుకున్న బౌద్ధ బంధం నేటికీ సజీవంగా ఉంది. స్నేహపూర్వక వాతావరణంలో కొనసాగుతోంది. భారతదేశంలో పుట్టిన బౌద్ధం శ్రీలంక కు చేరడానికి నాడు అశోక చక్రవర్తి పూనుకున్నాడు. నేడు భారత్‌ శ్రీలంక మధ్య బౌద్ధ స్నేహాన్ని పునరుద్ధరించింది తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ, బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో బౌద్ధ నిపుణులు, పాత్రికేయుల బృందం ఈ ఏడాది (2023) సెప్టెంబర్‌లో శ్రీలంకలో పర్యటించింది. తెలంగాణలోని బౌద్ధ పరిరక్షకులు... శ్రీలంకలోని బౌద్ధావలంబకులు, మంత్రులు, ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశమై, గడచిన 1700 ఏళ్లుగా ఇరు దేశాల మధ్య పరస్పరం బౌద్ధం ఆధారంగా కొనసాగిన మైత్రిబంధాన్ని గుర్తు చేసుకున్నారు.



బౌద్ధ చిత్రం

సెప్టెంబర్‌ 21వ తేదీన కొలంబోలోని లైట్‌ ఆఫ్‌ ఏసియా సెంటర్‌లో ‘ఎన్‌లైటెన్‌డ్‌ వన్‌ ద బుద్ధ’ సినిమా నిర్మాణానికి ఒప్పంద సంతకాలు జరిగాయి. భారతీయ నటుడు గగన్‌ మాలిక్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను హాలీవుడ్‌కు చెందిన నిర్మాణ సంస్థ చేపట్టింది. చిత్రం చిత్రీకరణను ఆసియా ఖండంలోనే అత్యంత పెద్దదైన బౌద్ధ ఆధ్యాత్మిక కేంద్రం ‘బుద్ధవనం’లో చేపట్టనున్నట్లు ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాసగౌడ్‌ తెలియచేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులను బుద్ధవనం ప్రాజెక్టు స్పెషల్‌ ఆఫీసర్‌ మల్లేపల్లి లక్ష్మయ్య తెలంగాణ చేనేత ఇకత్‌ శాలువాలతో సత్కరించారు. లైట్‌ ఆఫ్‌ ఏసియా ఫౌండేషన్‌ అండ్‌ రేడియెన్స్‌ ఫిల్స్‌ ్మ ఇంటర్నేషనల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ నవీన్‌ గుణరత్న, బుద్ధిస్ట్‌ ఎక్స్‌పర్ట్‌ కన్సల్టెంట్‌ మరియు ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో ఈమని శివనాగిరెడ్డి, చిత్ర కథానాయకుడు గగన్‌మాలిక్, ఇండియన్‌ హై కమిషన్‌ ప్రతినిధి అనురాగ్‌ దత్తా, శ్రీలంక టూరిజం బోర్డ్‌ చైర్మన్‌ చాలక గజబాహుతోపాటు శ్రీలంకలోని ప్రముఖ బౌద్ధ భిక్షువులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ బృందంలోని సభ్యులు ఈ కార్యక్రమం తర్వాత శ్రీలంక ప్రధానమంత్రి ‘దినేశ్‌ గుణవర్థేన’ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు క్రీ.పూ ఐదవ శతాబ్దంలో తెలంగాణలో వేళ్లూనుకున్న బౌద్ధం గురించి ప్రధానమంత్రికి వివరించారు. బౌద్ధ పరిరక్షణ, పునరుద్ధణ కోసం తెలంగాణ రాష్ట్రం చేపడుతున్న కార్యక్రమాలు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ చూపిస్తున్న చొరవను శ్రీలంక ప్రధానమంత్రికి వివరించారు.


పండ్లు పిల్లలందరివీ!

శ్రీలంక సెంట్రల్‌ కల్చరల్‌ ఫండ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆచార్య గామిని రణసింఘె పర్యవేక్షణలో సాగిన శ్రీలంక బౌద్ధ క్షేత్రాల పర్యటన కార్యక్రమంలో బౌద్ధ భిక్షువులు, గృహస్థ జీవనంలో బౌద్ధాన్ని సమ్మిళితం చేసుకున్న కుటుంబాలతో ఆత్మీయ సమావేశాలు జరిగాయి. శ్రీలంకలోని సింహళుల్లో ఎక్కువ శాతం బౌద్ధాన్ని అనుసరిస్తున్నారు. అనూరాధపురలోని అనేక బౌద్ధ క్షేత్రాలు, బౌద్ధులు నివసించే గ్రామాలను సందర్శించడం జరిగింది. బౌద్ధం సూచించిన గ్రామ నిర్మాణంలో మొదటగా చెరువు, ఆ తర్వాత పంట పొలాలు, నివాసగృహాలు, చివరగా స్శశానం. ఇదీ గ్రామ ముఖచిత్రం. గ్రామస్థులు తాము పండించిన పంటను మూడవ వంతులు చేసి ఒక భాగాన్ని ఆ గ్రామ బౌద్ధ చైత్యానికి , ఒక భాగాన్ని గ్రామ పెద్దకు సమర్పిస్తారు. ఒక భాగం తమ కుటుంబం కోసం దాచుకుంటారు. గ్రామంలో పండ్ల చెట్లకు కాసిన కాయల మీద ఆ ఊరిలోని పిల్లలందరికీ హక్కు ఉంటుంది. ఆ ఇంటి వాళ్ల అనుమతితో పని లేదు. పిల్లలు ఎవరైనా సరే తమకు నచ్చిన పండును కోసుకుని తినవచ్చు. పెద్ద వాళ్లు మరొకరి వస్తువుల కోసం ఆశపడరు, పరుల పండ్లను తాకను కూడా తాకరు. ఆ ఊరి బౌద్ధ చైత్యంలోని భిక్షువు ఆ గ్రామంలోని వారికి వైద్యుడు కూడా. సమీపంలోని అడవుల నుంచి ఔషధ మొక్కలను సేకరించి మందులు తయారు చేస్తారు భిక్షువులు.

శాంతికాముకత తెచ్చిన ప్రసన్నత

బౌద్ధం చెప్పిన త్రిపీటకాల సారాన్ని జీవితానికి అన్వయించుకుని శాంతియుత జీవనాన్ని గడుపుతున్నా శ్రీలంక సింహళులు. మహాయాన బౌద్ధానికి చెందిన ఉపశాఖ తెరవాద బౌద్ధం అక్కడ ఆచరణలో ఉంది. శాంతియుత జీవనాన్ని అనుసరిస్తుండడంతో వారి ముఖంలో ప్రసన్నత చూడడానికి ఆహ్లాదంగా ఉంటుంది. ధార్మిక జీవనాన్ని కూడా అంతే స్వచ్ఛంగా గడుపుతారు. బౌద్ధక్షేత్రాలకు ధవళవస్త్రాలతో వస్తారు. అనూరాధపుర బౌద్ధక్షేత్రాల నిలయం. అభయగిరి కాంప్లెక్స్‌ స్థూపాలతోపాటు ఇక్కడ ఉన్న శ్రీమహాబోధి వృక్షం ప్రధాన ఆకర్షణ. ఇది మనదేశం నుంచి వెళ్లిన మొలక. అశోకుడి కుమార్తె సంఘమిత్ర బౌద్ధ ప్రచారానికి శ్రీలంకకు వెళ్లేటప్పుడు మనదేశంలోని బో«ద్‌గయ నుంచి బోధి మొక్కను తీసుకువెళ్లింది. ఆ మొక్కను అప్పటి అనూరాధపుర రాజ్యాన్ని పాలిస్తున్న రాజు దేవానాం పియ తిస్స ఆ మొక్కను అత్యంత గౌరవంతో స్వీకరించి నాటాడు. అప్పటి వరకు మనదేశంలో ఒకరి నుంచి మరొకరికి మౌఖికంగా ప్రసారమవుతూ వచ్చిన బౌద్ధ ప్రవచనాలు, త్రిపీటకాలకు గ్రంథరూపమిచ్చింది కూడా అతడే. బుద్ధ వచనాలను బ్రాహ్మీ లిపిలో తాళపత్రాల మీద రాయించాడు. మరో సంగతి ఏమిటంటే... మనదేశంలో బౌద్ధాన్ని రూపుమాపే కుట్రలో భాగంగా బోధగయలోని (బుద్ధుడు జ్ఞానోదయం పొందిన వృక్షం) బోధివృక్షాన్ని వేర్లతో సహా నిర్మూలించడం జరిగింది. అప్పుడు బౌద్ధ పరిరక్షణ కోసం అనూరాధపురలోని మహాబోధి వృక్షం నుంచి ఒక మొక్కను తీసుకువచ్చి బోధగయలో నాటారు. మౌద్ధం ఈ రెండుదేశాల మధ్య అంతటి పటిష్టమైన బంధాలను పాదుకొల్పిందన్నమాట. ఇక్కడ ఉన్న మహావిహార యునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ సంపద. క్రీ.పూ ఒకటవ శతాబ్దంలో నిర్మించిన ఈ స్థూపం పునరుద్ధరణ పనులు సెంట్రల్‌ కల్చరల్‌ ఫండ్‌ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఇక్కడి మహాభిక్షువు జ్ఞాన తిలక థెరొ తెలంగాణ బౌద్ధ పరిరక్షణ బృందాన్ని సాదరంగా విహారానికి ఆహ్వానించి బౌద్ధ స్థూప జ్ఞాపికలను పంచారు.

శ్రీలంకలో మరో హెరిటేజ్‌ సైట్‌ కాండీ నగరం. ఇక్కడ బుద్ధుడి దంత ధాతువుని ప్రతిక్షేపించిన నిర్మించిన ఆలయం ఉంది. టూత్‌ రిలిక్‌ టెంపుల్‌తోపాటు ఇక్కడ ఉన్న నేషనల్‌ మ్యూజియం ఒక అధ్యయన గ్రంథం. ప్రపంచదేశాల్లోని బౌద్ధం అంతటినీ ఒక చోట రాశిపోసినట్లు ఉంటుంది. మన తెలుగు రాష్ట్రం అమరావతి బౌద్ధ స్థూపం నమూనాల నుంచి చైనాలోని లాఫింగ్‌ బుద్ధ ప్రతిమలతోపాటు భవిష్యత్తులో పుట్టబోయే బుద్ధుడి ఊహాశిల్పం కూడా ఉంది. మొత్తంగా శ్రీలంక దీవి వైవిధ్యతలకు ప్రతిరూపం అనే చెప్పాలి. భౌగోళికంగానే కాదు జీవనసారాన్ని గ్రహించిన మనుషులతో నిండిన దేశం. బాధ్యతగా జీవించే పౌరులున్న దేశం. హారన్‌ వినిపించని ప్రయాణాలు, చెత్త కనిపించని రోడ్లతో క్రమశిక్షణకు ప్రతిరూపం శ్రీలంక. దేశంలో బౌద్ధం, హిందు, క్రిస్టియన్, ఇస్లామ్‌ మతాలు ఆచరణలో ఉన్నప్పటికీ సింహభాగం బౌద్ధమే కావడంతో దేశంలో శాంతిసామరస్యాలు వెల్లివిరుస్తున్నాయి. అందుకే శ్రీలంక... బౌద్ధ సిరితో పరిఢవిల్లుతున్న లంక.

First Published:  4 Oct 2023 12:15 PM IST
Next Story