Telugu Global
Travel

బియాండ్‌ ద తాజ్‌ ఇది ఆగ్రా పర్యటన!

Beyond Taj Mahal: మీరు ఆగ్రా చూడాలనుకుంటున్నారా? ‘తాజ్‌మహల్‌ని చూడాలంటే ఆగ్రాకే కదా వెళ్లాలి?’ అని ప్రశ్నకు సమాధానంగా మళ్లీ ప్రశ్ననే సంధిస్తున్నారా! ఆగ్రా టూర్‌ అని చెప్పుకున్నా తాజ్‌మహల్‌ టూర్‌ అని చెప్పుకున్నా పెద్ద తేడా ఏమీ ఉండదు.

Beyond the Taj Mahal
X

బియాండ్‌ ద తాజ్‌ ఇది ఆగ్రా పర్యటన!

మీరు ఆగ్రా చూడాలనుకుంటున్నారా? 'తాజ్‌మహల్‌ని చూడాలంటే ఆగ్రాకే కదా వెళ్లాలి?' అని ప్రశ్నకు సమాధానంగా మళ్లీ ప్రశ్ననే సంధిస్తున్నారా! ఆగ్రా టూర్‌ అని చెప్పుకున్నా తాజ్‌మహల్‌ టూర్‌ అని చెప్పుకున్నా పెద్ద తేడా ఏమీ ఉండదు. ఎందుకంటే ఆగ్రాకి వెళ్లేది తాజ్‌మహల్‌ని చూడడానికే కాబట్టి. 'తాజ్‌మహల్‌ని మాత్రమే' చూడడానికి కాబట్టి. అయితే ఇక నుంచి ఆగ్రా పర్యటనకు కొత్త భాష్యం చెప్పుకోండి.

ఆగ్రా టూర్‌ అంటే ఢిల్లీలో బస చేసి ఒక రోజు ఆగ్రా, మధుర టూర్‌ వేసుకుని రాత్రికి ఢిల్లీ చేరడం కాదు. ఆగ్రాలోనే బస చేసి ఆగ్రా పట్టణాన్ని పూర్తిగా ఆస్వాదించడం, ఆగ్రా భోజనాన్ని రుచి చూడడం, స్థానికులతో కలిసి గల్లీల్లో తిరగడం, ఆగ్రా మట్టిపొరల్లో దాగిన నిజాలను చదవడం.

'బియాండ్‌ తాజ్‌'... తాజ్‌మహల్‌ ఆవరణ కాంపౌండ్‌ వాల్‌కు బయట సాగుతుంది ఈ నడక. ఇక... 'వాక్‌ ఇన్‌ ద పాస్ట్‌' అంటే ఆగ్రా పట్టణ పురాతన కాలం వీథుల్లో విహారం. ఇందులో జమా మసీద్, కినారీ బజార్, మాంకామేశ్వర్‌ టెంపుల్, సుగంధ ద్రవ్యాల మార్కెట్‌ 'రావత్‌ పారా', ఆగా ఖాన్‌ కీ హవేలీ, దర్జా ఆఫ్‌ అహ్మద్‌ భుకారీ, మెహతాబ్‌ భాగ్‌ వంటివన్నీ కవర్‌ అవుతాయి. 'గార్డెన్‌ వాక్‌'... ఆగ్రా పట్టణంలోని గార్డెన్‌లను చుడుతూ సాగే నడక. బ్రిటిష్‌ ప్రభావానికి ముందు – ఆ తర్వాత వచ్చిన మార్పులకు ఆనవాళ్లు కనిపిస్తాయి. దసరా ఘాట్‌ నుంచి తాజ్‌ మహల్‌ చాలా అందంగా కనిపిస్తుంది.

'ఇతిమాద్‌ ఉద్‌ దౌలా' సమాధిని తప్పకుండా చూడాలి. దీనిని బేబీ తాజ్‌ అని డ్రాఫ్ట్‌ ఆఫ్‌ తాజ్‌ అని చెబుతారు. నూర్‌జహాన్‌ తన తండ్రికి కట్టించింది. ఆగ్రాలో మనసును బరువు చేసే నిర్మాణం ఒకటుంది. అది ఆగ్రా కోటను రక్షించే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన జాన్‌ హెస్సింగ్స్‌ అనే బ్రిటిష్‌ అధికారి కోసం ఆయన భార్య ఏన్‌ హెస్సింగ్స్‌ కట్టించిన కేథలిక్‌ సమాధి.

పున్నమి వెన్నెల్లో మినీ తాజ్‌

పర్యాటకులను ఆగ్రా పట్టణ వీథుల్లో తిప్పి చూపించే 'ట్రోకల్స్‌' వంటి ట్రావెల్‌ ఏజెన్సీలు కూడా ఉన్నాయి. ట్రావెల్‌ విత్‌ లోకల్స్‌ అని అర్థం. స్థానికులు పర్యాటకులను ఆగ్రా అంతా తిప్పి చూపించడంతోపాటు స్థానిక రుచులు భేడాయ్‌ కచోరీ, జిలేబి, రకరకాల చాట్‌లను కూడా పరిచయం చేస్తారు. స్థానిక హస్తకళాకారులు తయారు చేసే కళాకృతులు దొరికే బజార్‌ కూడా చూడవచ్చు. ఏదైనా కొనాలంటే యూపీ హ్యాండీ క్రాఫ్ట్స్‌ ఎంపోరియమ్‌లో కొనడమే మంచిది. మనం ఎంపిక చేసుకున్న హ్యాండీక్రాఫ్ట్‌కు సగం ధర చెల్లించి, అడుగున సంతకం చేసి, మన అడ్రస్‌ ఇచ్చి వస్తే... ఆర్టికల్‌ మన ఇంటికి వస్తుంది. డెలివరీ తీసుకునేటపుడు మిగిలిన సగం చెల్లించాలి. చివరగా మరో విషయం... ఈ ఎంపోరియమ్‌లో ఓ మినీ తాజ్‌ను చూడవచ్చు. దానిని అచ్చు తాజ్‌ మహల్‌లాగానే మలిచారు. పున్నమి వెలుగుల్లో తాజ్‌మహల్, ఉషోదయపు వెలుతురులో తాజ్‌మహల్, సూర్యాస్తమయాన తాజ్‌మహల్‌ ఎలా ఉంటుందో రంగురంగుల లైట్స్‌తో ప్రదర్శిస్తారు. ఇప్పుడు సాయంత్రం ఆరు గంటల తర్వాత తాజ్‌మహల్‌లోకి టూరిస్ట్‌లను అనుమతించరు, కాబట్టి ఈ మినీ తాజ్‌ను లైట్లలో చూసి అనుభూతి చెందవచ్చు.

First Published:  7 Dec 2022 9:26 AM GMT
Next Story