Telugu Global
Travel

తూప్రాన్ పేట బాటసారి బావిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి!

బాటసారుల కోసం కుతుబ్ షాహీల‌ కాలం (క్రీ.శ. 17వ శతాబ్ది)లో తవ్వించారని, అసఫ్‌జాహీల కాలం (19వ శతాబ్దం)లో మరమ్మతులు చేశారని కట్టడ ఆనవాళ్లు సూచిస్తున్నాయని ఆయన అన్నారు.

తూప్రాన్ పేట బాటసారి బావిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి!
X

హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై, యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండలం, తూప్రాన్ పేటలోని దిగుడుబావిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా సీఈవో డా. ఈమని శివనాగిరెడ్డి కోరారు. స్థానికంగా బాలంసాయి బావి అని పిలవబడే ఈ దిగుడు మెట్ల బావిని గోల్కొండ-మచిలీపట్నం రహదారిపై వెళ్లే బాటసారుల కోసం కుతుబ్ షాహీల‌ కాలం (క్రీ.శ. 17వ శతాబ్ది)లో తవ్వించారని, అసఫ్‌జాహీల కాలం (19వ శతాబ్దం)లో మరమ్మతులు చేశారని కట్టడ ఆనవాళ్లు సూచిస్తున్నాయని ఆయన అన్నారు.



జాతీయ రహదారికి 100 అడుగుల దూరంలో, విజయవాడ వైపు వెళ్లేదారికి కుడివైపునున్న ఈ బావి 70 అడుగుల పొడవు, 45 అడుగుల వెడల్పు, 50 అడుగుల లోతుతో తవ్వించి, జాతీయ రహదారి వైపు నుంచి బావి లోపలికి మెట్లు, మిగతా మూడు వైపులా రాతి గోడలు, మెట్లకు ఎదురుగా నీళ్లు తోడుకోవడానికి, వ్యవసాయ అవసరానికి వినియోగించడానికి రాతి మోటను ఏర్పాటు చేశారని శివనాగిరెడ్డి చెప్పారు.

మూడు శతాబ్దాల చరిత్ర గల దిగుడుబావి అలనాటి వాస్తు నైపుణ్యానికి అర్థం పడుతుంద‌న్నారు. తూప్రాన్ పేట బాటసారి బావి చుట్టూ ఫెన్సింగ్, చారిత్రక వివరాలతో బోర్డును ఏర్పాటు చేస్తే జాతీయ రహదారిపై ఒక చక్కటి పర్యాటక కేంద్రంగా రూపొంది హైదరాబాద్ వచ్చి- వెళ్లే యాత్రికులను ఆకర్షిస్తుందని తూప్రాన్ పేట పంచాయతీకి ఆయన విజ్ఞప్తి చేశారు. గ్రామానికి చెందిన చక్రం మల్లేష్ ఈ బావి సమాచారాన్ని అందించారని శివనాగిరెడ్డి తెలిపారు.

First Published:  27 Jun 2024 11:59 AM IST
Next Story