Telugu Global
Travel

అరబిక్‌ కడలి... సొగసు చూడతరమా!

పోర్‌బందర్‌ నుంచి మాధవ్‌పూర్‌ మీదుగా సోమనాథ్‌కు ప్రయాణం. ఈ మధ్యలో వెలావర్‌ కూడా. అంతకంటే ముందు అంబానీ ఊరు చోర్వాడా.

అరబిక్‌ కడలి... సొగసు చూడతరమా!
X

పోర్‌బందర్‌ నుంచి మాధవ్‌పూర్‌ మీదుగా సోమనాథ్‌కు ప్రయాణం. ఈ మధ్యలో వెలావర్‌ కూడా. అంతకంటే ముందు అంబానీ ఊరు చోర్వాడా. ఈ జర్నీలో చమత్కారం ఏమిటంటే... గాంధీ పుట్టిన ఊరి నుంచి బయలుదేరుతాం. మధ్యలో ధీరూబాయ్‌ అంబానీ ఊరిని, వాళ్ల ఇంటినీ చూస్తాం.


అక్కడి నుంచి శ్రీకృష్ణుడు ప్రాణత్యాగం చేశాడని చెప్పే వెరావల్‌ను చూస్తాం. అక్కడి నుంచి మహమ్మద్‌ గజనీ దాడులు చేసి చేసీ కొల్లగొట్టిన సోమనాథ్‌ చేరుకుంటాం. ఇక మాధవ్‌పూర్‌ ప్రత్యేకత ఏమిటంటే... ఇంత ప్రయాణంలో మరెక్కడా కొబ్బరి బోండాలు దొరకవు. సముద్ర తీరాన కొబ్బరి బోండాం తాగే సరదా తీరేది ఈ గ్రామంలో మాత్రమే.

గాలి మరల తీరం

అరేబియా కడలి తీరం ఆహ్లాదంగా ఉంటుంది. బంగాళాఖాతంలాగ పెద్ద అలలుండవు, అలలు చేసే హోరు ఉండదు. మనసులో అలజడి లేని ప్రశాంతవదనంలాగ ఉంటుంది. రోడ్డు సముద్ర తీరాన సాగిపోవడం కలిసొచ్చే విషయం. చిరు అలలను చూస్తూ, కారు అద్దాలు దించేసి చల్లటి గాలిని ఆస్వాదిస్తూ, ఆల్టర్నేటివ్‌ పవర్‌ జనరేషన్‌ కోసం పెట్టిన విండ్‌మిల్స్‌ను చూస్తూ సాగిపోవడం మంచి జాయ్‌ఫుల్‌ ట్రిప్‌ అనడంలో ఏ మాత్రం సందేహం ఉండదు. ఈ ప్రయాణంలో గొప్ప సౌకర్యం ఏమిటంటే గ్రామాల రోడ్లు కూడా చాలా బాగుండడం. ఆశ్చర్యం కలిగించే విషయమూ ఉంది. అది గ్రామాలకు రవాణా సౌకర్యాలు పెద్దగా లేకపోవడం. రాజ్‌దూత్‌ మోటర్‌బైక్‌కి క్యారియర్‌ అటాచ్‌ చేస్తారు. అందులో కూర్చుని ప్రయాణిస్తుంటారు. గ్రామాలకు– సమీప పట్టణానికి మధ్య రవాణా సాధనాలవి.



దొంగల ఊరు

అంబానీ ఊరు మీదుగా సాగే ప్రయాణంలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ ఊరికి ఆ పేరు సముద్రదొంగల కారణంగా వచ్చింది. తీరానికి వచ్చే నౌకలలోని సరుకును అపహరించే దొంగలు అక్కడ నివాసం ఏర్పరుచుకోవడం, సరుకును అక్కడే దాచి ఉంచడంతో ఆ ప్రదేశానికి చోర్‌వాడా అనే పేరు వచ్చిందట. ఇది ఇప్పుడు పట్టణం.

వెరావల్‌ ఓడరేవు పట్టణం. ఒకప్పుడు మక్కాకు షిప్‌లు ఇక్కడి నుంచి మాత్రమే వెళ్లేవి. మహాభారతం ప్రకారం శ్రీకృష్ణుడు మరణించిందింది ఇక్కడి బల్క తీర్థంలోనేనని చెబుతారు. ఆ ప్రదేశంలో ఒక ఆలయం కూడా ఉంది. రాజీవ్‌గాంధీ హత్య జరిగిన శ్రీపెరుంబుదూరులో స్మారకం ఉన్నట్లే ఇది కూడా. వేటగాడు జింక కోసం వదిలిన బాణం శ్రీకృష్ణుడికి తగిలి, కృష్ణుడు దేహత్యాగం చేసిన ప్రదేశంగా పర్యాటక ప్రాధాన్యం సంతరించుకుంది. వెరావల్‌ నుంచి సోమనాథ్‌ ఐదారు కిమీలకు మించదు.



First Published:  1 Jan 2023 9:28 PM IST
Next Story