Telugu Global
Telangana

హైదరాబాద్‌ జూలో విషాదం.. సంరక్షకుడిని తొక్కి చంపిన ఏనుగు

షాబాజ్‌ను చూడగానే ఏనుగు పెద్దగా అరుస్తూ అతనిపై దాడి చేసిందని అని జూపార్కు డైరెక్టర్‌ ప్రసాద్, క్యూరేటర్‌ సునీల్, డిప్యూటీ డైరెక్టర్‌ నాగమణి తెలిపారు.

హైదరాబాద్‌ జూలో విషాదం.. సంరక్షకుడిని తొక్కి చంపిన ఏనుగు
X

హైదరాబాద్‌ జూ పార్కులో తన సంరక్షకుడిని ఏనుగు తొక్కి చంపిన విషాద ఘటన శనివారం జరిగింది. ఇక్కడి ఏనుగుల శాలలో సంరక్షకుడిగా పనిచేస్తున్న షాబాజ్‌(22) ఈ ఘటనలో మృతిచెందాడు. దీంతో జూపార్కు ఏర్పాటై 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం నిర్వహించిన ఉత్సవాలు విషాదాంతమయ్యాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొన్న షాబాజ్‌ ఆ తర్వాత ఇంటికి వెళ్లేముందు ఏనుగుల గదిలో ఉంచిన తన దుస్తుల కోసం వెళ్లాడు. ఆ సమయంలో విజయ్‌ అనే ఏనుగు అతన్ని తొండంతో లాక్కొని విసిరి కొట్టింది. మృతదేహాన్ని చూస్తే కాళ్లతో తొక్కినట్టుగా అనిపిస్తోందని జూ అధికారులు తెలిపారు.

షాబాజ్‌ను చూడగానే ఏనుగు పెద్దగా అరుస్తూ అతనిపై దాడి చేసిందని అని జూపార్కు డైరెక్టర్‌ ప్రసాద్, క్యూరేటర్‌ సునీల్, డిప్యూటీ డైరెక్టర్‌ నాగమణి తెలిపారు. సమీపంలోని జంతు సంరక్షకులు అప్రమత్తమై అక్కడికి చేరుకునేసరికే షాబాజ్‌ అచేతన స్థితిలో కనిపించాడని వివరించారు. అతన్ని వెంటనే బ్యాటరీ వాహనంలో ఏనుగు ఆవాసం నుంచి బయటికి తీసుకొచ్చి అంబులెన్సులో డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. చికిత్స పొందుతూ సాయంత్రం 4 గంటలకు మృతిచెందాడని వివరించారు. షాబాజ్‌ తండ్రి కూడా జూలోనే పనిచేసేవారని జూ అధికారులు తెలిపారు. ఆయన మూడేళ్ల క్రితం చనిపోవడంతో.. కారుణ్య నియామకం కింద షాబాజ్‌ ఈ ఉద్యోగంలో చేరాడని చెప్పారు. ఇక్కడి జూ పార్కులో జంతువు దాడిలో సంరక్షకుడు మరణించడం ఇదే తొలిసారని వారు వెల్లడించారు.

First Published:  8 Oct 2023 8:23 AM IST
Next Story