Telugu Global
Telangana

నిధులివ్వని ప్రభుత్వం.. ఆర్టీసీ కొంప ముంచిన జీరో టికెట్

మూడు నెలలు కాలం గడిపిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడైనా ఆర్టీసీపై కనికరం చూపుతుందో లేదో తేలాల్సి ఉంది. లేకపోతే మహాలక్ష్మి పథకం ఆర్టీసీకి మరో గుదిబండగా మారడం ఖాయం.

నిధులివ్వని ప్రభుత్వం.. ఆర్టీసీ కొంప ముంచిన జీరో టికెట్
X

మహిళలకు ఉచిత ప్రయాణం పథకం ద్వారా ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో పెరిగి లాభాలు వస్తాయని ఊహించారంతా. నిజంగానే ఆక్యుపెన్సీ పెరిగింది, దానికి తగ్గ లాభాలు జీరో టికెట్ల రూపంలో పేపర్ పై కనపడుతున్నాయి. కానీ ఆర్టీసీకి మాత్రం ఆర్థిక లబ్ధి చేకూరలేదు. దీనికి కారణం ప్రభుత్వమే. జీరో టికెట్ల సొమ్ము ఎప్పటికప్పుడు ఆర్టీసీకి జమచేయాల్సి ఉన్నా.. మీనమేషాలు లెక్కిస్తుండటంతో వ్యవహారం తేడా కొట్టింది.

జీరో టికెట్ల రూపంలో సగటున ప్రతి నెలా ఆర్టీసీకి రూ.350కోట్లు ఖర్చవుతున్నాయి. గతంలో మహిళల రవాణా చార్జీలు టికెట్ల రూపంలో నేరుగా ఆర్టీసీకే వచ్చేవి. ఇప్పుడు ఆక్యుపెన్సీ పెరిగినా కూడా మహిళల టికెట్లన్నీ జీరో కావడంతో ప్రభుత్వం నిధులు విడుదల చేస్తేనే సంస్థకు లాభం. కానీ ఆర్టీసీకి ప్రతినెలా జీరో టికెట్ల మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేయటం లేదు. ఆ రూపంలో నిధులు ఇవ్వటం లేదు. మార్చి నాటికి ప్రభుత్వం జీరో టికెట్లకు సంబంధించి రూ.1400 కోట్లు విడుదల చేయాలని ఇటీవల ఆర్టీసీ తెలిపింది.

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తన చివరి బడ్జెట్‌లో ఆర్టీసీకి రూ.1500 కోట్లు కేటాయిస్తూ ప్రతిపాదించింది. కానీ అప్పుడు కేవలం రూ.500 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. గత డిసెంబరు నుంచి కొత్త ప్రభుత్వం రూ.1,000 కోట్లు విడతల వారీగా విడుదల చేసింది. ఆ నిధులు ఇచ్చింది కానీ, జీరో టికెట్ల సొమ్ముని మాత్రం బకాయిగా పెట్టింది. ప్రస్తుత ఆర్టీసీ పరిస్థితి చూస్తే.. లాభాలు కేవలం కాగితాలకే పరిమితమైనట్టు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి డబ్బులు రాకపోవటంతో, ఆ ప్రతిఫలం ఎక్కడా కనపడటం లేదు. పీఎఫ్‌ బకాయిలు, కరువు భత్యం బకాయిలు పేరుకు పోయి అలాగే ఉన్నాయి.

బకాయిలు పేరుకుపోతే కష్టం..

ఆర్టీసీ నష్టాలనుంచి బయటపడాలంటే ప్రభుత్వం సకాలంలో బకాయిలు చెల్లించాలి. అదే జరగకపోతే ఆర్టీసీపై వడ్డీల భారం పెరిగిపోతుంది. జీరో టికెట్ల సొమ్ము కూడా ఇలాగే ఆర్టీసీకి భారంగా మారే అవకాశముంది. మూడు నెలలు కాలం గడిపిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడైనా ఆర్టీసీపై కనికరం చూపుతుందో లేదో తేలాల్సి ఉంది. లేకపోతే మహాలక్ష్మి పథకం ఆర్టీసీకి మరో గుదిబండగా మారడం ఖాయం.

First Published:  5 April 2024 3:01 AM GMT
Next Story