మీరు వెళ్లినా.. మాకు జగన్ ఉన్నారు.. ఆయనతో వెళ్తాం..
వైఎస్ కుమార్తె పొరపాటు చేసినా.. తమకు వైఎస్ కుమారుడు ఉన్నాడని ఇకపై ఆయనతో ఉంటామని కొండా రాఘవరెడ్డి వ్యాఖ్యానించారు
సోనియా గాంధీతో వైఎస్ షర్మిల భేటీకి నిరసనగా కొండా రాఘవరెడ్డి వైఎస్ఆర్‌టీపీ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామా అంశంపై షర్మిల మాత్రం కాస్త గట్టిగానే స్పందించారు. తొలి నుంచి తనతో ఉన్న రాఘవరెడ్డి రాజీనామాను ఆమె తేలిగ్గా కొట్టిపారేశారు. అసలు కొండా రాఘవరెడ్డి ఎప్పుడో పార్టీ పెట్టిన కొత్తలో కొద్దిరోజులు పనిచేశారే గానీ.. ఆ తర్వాత ఆయన ఎప్పుడూ పార్టీ కోసం పనిచేయలేదని షర్మిల వ్యాఖ్యానించారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు కొత్తగా రాజీనామా చేయడం ఏమిటని ఎద్దేవా చేశారు.
షర్మిల తీరును ఆమె పార్టీకి చెందిన సోమన్న కూడా తప్పుపట్టారు. తమను అమాయకులను చేసి ఆడించారని వాపోయారు. ''నేను నిలబడుతా.. మిమ్మల్ని నిలబెడుతా'' అంటూ షర్మిల నమ్మించారని.. తనను తుంగతుర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండేళ్ల క్రితమే ప్రకటించారన్నారు. ఇంతకాలం తాను కష్టపడి పనిచేసుకుంటే తీరా ఇప్పుడు మాత్రం ఇలా చేశారని విమర్శించారు. మూడు నెలలుగా పార్టీ ఆఫీసులు కూడా పనిచేయడం లేదన్నారు. విలీనం, పొత్తు అంశాలపై కనీసం పార్టీలోని ముఖ్య నాయకులతో కూడా ఆమె చర్చించలేదన్నారు. తనను ఇది వరకే ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన షర్మిల.. చిత్తశుద్ది ఉంటే పార్టీని విలీనం చేసినా, పొత్తు పెట్టుకున్నా సరే తనకు టికెట్ ఇప్పించాలని సోమన్న డిమాండ్ చేశారు.
మాకు జగన్ ఉన్నారు- రాఘవరెడ్డి
వైఎస్ కుమార్తె పొరపాటు చేసినా.. తమకు వైఎస్ కుమారుడు ఉన్నాడని ఇకపై ఆయనతో ఉంటామని కొండా రాఘవరెడ్డి వ్యాఖ్యానించారు. షర్మిల.. వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని తెలిసినా, కొన్ని ఛానళ్లకు వెళ్లి జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడినా, సీబీఐ పిలవకున్నా ఢిల్లీ వెళ్లి రాజకీయ కుట్రలో భాగంగానే వివేకానందరెడ్డిని చంపేశారని చెప్పినా, తెలంగాణ పోలీసులపై చేయి చేసుకున్నా.. తమ నాయకుడు వైఎస్‌ఆర్ కుమార్తె అని భరిస్తూ వచ్చామని.. సోనియా ఇంటి గడపను షర్మిల తొక్కడాన్ని మాత్రం తట్టుకోలేకపోతున్నామని కొండా రాఘవరెడ్డి విమర్శించారు. సోనియా గాంధీతో షర్మిల భేటీ అవడంతో తాము షాక్ అయ్యామని మరో నేత గట్టు రామచంద్రారావు వ్యాఖ్యానించారు.