Telugu Global
Telangana

చరిత్రలో కలిసిపోయినట్లేనా?

ఎందుకంటే ఈ ఎన్నికలయ్యాక షర్మిల పార్టీని ఎవరు పట్టించుకోరు. మళ్ళీ వచ్చే ఎన్నికలకు అంటే మరో ఐదేళ్ళ వరకు పార్టీని నడిపేంత ఓపిక షర్మిలకు లేదని అర్థ‌మైపోతోంది.

చరిత్రలో కలిసిపోయినట్లేనా?
X

తెలంగాణ రాజకీయాల్లో వైఎస్సార్టీపీ చరిత్రలో కలిసిపోయినట్లేనా? తాజాగా పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రకటన చూసిన తర్వాత అందరికీ అర్ధమైందిదే. పార్టీ పెట్టిన దగ్గర నుండి జరిగిన ఒక్క ఉపఎన్నికలో కూడా పోటీ చేయలేదు. జనరల్ ఎలక్షన్లోనే డైరెక్టుగా పోటీ చేస్తామని చెబుతు వచ్చారు. తీరా సాధారణ ఎన్నికలు వచ్చేసరికి పోటీ నుండి తప్పుకుంటున్నట్లు స్వయంగా ఆమే ప్రకటించారు. దీంతోనే వైఎస్సార్టీపీ చరిత్రలో కలిసిపోయినట్లే అని అర్థ‌మవుతోంది. షర్మిల ఆవేశం, అపరవపక్వతే పార్టీని పురిట్లోనే తొక్కేసినట్లు అర్థ‌మవుతోంది.

తనను తాను చాలా ఎక్కువగా ఊహించుకోవటమే ఈ పరిస్ధితికి కారణం. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పేరు పార్టీలో ఉంటే చాలు నేతలంతా వచ్చి తన పార్టీలో చేరేస్తారు, ఎన్నికల్లో గెలిచిపోయి ముఖ్యమంత్రి అయిపోవచ్చని చాలానే ఊహించుకున్నట్లున్నారు. అయితే పార్టీ పెట్టి రెండేళ్ళయినా జనాలు గుర్తించలేదు. పాదయాత్రతో హడావుడి చేసినా పెద్దగా మైలేజీ రాలేదు. ఉనికి కోసమే కేసీఆర్‌ను టార్గెట్ చేసినా ఉపయోగంలేకపోయింది.

దాంతో కాంగ్రెస్‌తో పొత్తని, తర్వాత విలీనమని ఏవేవో మాట్లాడారు. ఏం చేసినా పెద్ద ఉపయోగం కనబడలేదు. అందుకనే రాబోయే ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లోను పార్టీ పోటీ చేస్తుందన్నారు. తనతో పాటు తల్లి విజయమ్మ, భర్త అనిల్ కూడా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. త‌రువాత‌ కొద్దిరోజులకే అసలు పోటీ నుండే తప్పుకుంటున్నట్లు చెప్పారు. మొదటి నుండి వైఎస్సార్టీపీ పోటీపైన, పాలేరులో షర్మిల పోటీ చేయటంపై అనుమానాలు ఉన్నాయి. అనుమానాలకు తగ్గట్లే షర్మిల పోటీ నుండి విరమించుకుంటున్నట్లు ప్రకటించేశారు.

షర్మిల ప్రకటనతో తొందరలోనే పార్టీ కనుమరుగైపోవటం ఖాయమనే అనిపిస్తోంది. ఎందుకంటే ఈ ఎన్నికలయ్యాక షర్మిల పార్టీని ఎవరు పట్టించుకోరు. మళ్ళీ వచ్చే ఎన్నికలకు అంటే మరో ఐదేళ్ళ వరకు పార్టీని నడిపేంత ఓపిక షర్మిలకు లేదని అర్థ‌మైపోతోంది. ఇప్పుడు పోటీ నుండి తప్పుకున్న షర్మిల కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిందే అంటున్నారు. కేసీఆర్‌ వ్యతిరేక ఓట్లు చీలకూడదనే తమ పార్టీ పోటీలో నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తన పార్టీ తనిష్టం. తనిష్టం వచ్చిన ప్రకటన తాను చేసుకోవచ్చు. మరి జనాలు ఎలా స్పందిస్తారన్నది ఇక్కడ చాలా కీలకం. చూద్దాం ఏం జరుగుతుందో.


First Published:  4 Nov 2023 11:14 AM IST
Next Story