Telugu Global
Telangana

ఆడలేక మద్దెల ఓడు.. కేసీఆర్ పై వైసీపీ అక్కసు

ఒకవేళ అమ్మడం ఖాయమైతే దాన్ని తెలంగాణ ప్రభుత్వం తరపున కొనుగోలు చేసి కార్మికులకు అండగా నిలవాలనేది కేసీఆర్ ఆలోచన. ఈ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్న వేళ.. ఇలా కేసీఆర్ పై అక్కసు వెళ్లగక్కుతున్నారు వైసీపీ నేతలు.

ఆడలేక మద్దెల ఓడు.. కేసీఆర్ పై వైసీపీ అక్కసు
X

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గేలా లేదు. బిడ్డింగ్ కోసం కూడా కేంద్రం ముందుకెళ్తున్న దశలో తెలంగాణ తరపున బిడ్డింగ్ లో పాల్గొనాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో ఏపీలోని అధికార వైసీపీ స్పందన మాత్రం విచిత్రంగా ఉంది. పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి కోడిగుడ్డు కథ చెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న కేసీఆర్, బిడ్ కోసం ఎలా దరఖాస్తు చేస్తారని ప్రశ్నించారు. అంటే స్టీల్ ప్లాంట్ అమ్మేయాలనేదే వారి ఉద్దేశమా అని లాజిక్ తీశారు మంత్రి గుడివాడ.

విశాఖ స్టీల్ ప్లాంట్‌ ను ప్రైవేటీకరించొద్దు అనేదే వైసీపీ స్టాండ్‌ అని స్పష్టం చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. తమ స్టాండ్ అదే అయినప్పుడు తాము దాన్ని ఎలా కొంటామని ప్రశ్నించారు. బీఆర్ఎస్‌ వాళ్లు కొనాలనుకుంటే దానిపై తమ స్పందన అడగడం సరికాదన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించటానికి వీలు లేదని తెలంగాణ సీఎం కేసీఆర్‌ చెప్పినప్పుడు.. మళ్లీ వాళ్లే కొనడానికి బిడ్ లో పాల్గొనడం దేనికన్నారు. అంటే స్టీల్‌ ప్లాంట్‌ అమ్మేయాలనేదే వారి ఉద్దేశమా? అని ప్రశ్నించారు. బిడ్ గురించి తెలంగాణ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన తాము వినలేదని చెప్పుకొచ్చారు ఏపీ మంత్రి.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఏపీ ప్రభుత్వం ఆపలేదని తేలిపోయింది. ఎన్ని తీర్మానాలు చేసినా వాటిని కేంద్రం బుట్టదాఖలు చేసింది. ప్రతిపక్షాలు కూడా లేఖాస్త్రాలు సంధించడం, వినతిపత్రాలు ఇవ్వడం వరకు ఓకే. కనీసం ఆందోళనల్లో పాల్గొనే దమ్ము, ధైర్యం కూడా ఏపీలోని అధికార ప్రతిపక్షాలకు లేదు. ఇప్పుడు పక్కనే ఉన్న మరో తెలుగు రాష్ట్రం బిడ్ కు సిద్ధమైంది అని తెలిసి సంతోషించాల్సింది పోయి విమర్శలు చేయడం ఇక్కడ కొసమెరుపు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దు అనేది బీఆర్ఎస్ నిర్ణయం. ఒకవేళ అమ్మడం ఖాయమైతే దాన్ని తెలంగాణ ప్రభుత్వం తరపున కొనుగోలు చేసి కార్మికులకు అండగా నిలవాలనేది కేసీఆర్ ఆలోచన. ఈ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్న వేళ.. ఇలా కేసీఆర్ పై అక్కసు వెళ్లగక్కుతున్నారు వైసీపీ నేతలు.

First Published:  10 April 2023 4:32 PM IST
Next Story