అవినాష్ బెయిల్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా..
ముందస్తు బెయిల్ పిటిషన్ పై త్వరగా విచారణ చేపట్టాలని అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదులు ఈరోజు ఉదయం హైకోర్టు ధర్మాసనాన్ని కోరారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల కాపీని ఈరోజు తెలంగాణ హైకోర్టుకి సమర్పించలేకపోవడంతో కేసు విచారణ రేపటికి వాయిదా పడింది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ తనను అరెస్ట్ చేయకుండా నిలువరించాలంటూ ముందస్తు బెయిల్ కోసం అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో వేసిన పిటిషన్ విచారణ రేపటికి వాయిదా పడింది. ఈ పిటిషన్ పై ఇప్పటికే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులివ్వగా వాటిని సుప్రీంకోర్టు నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు తుది తీర్పు ఈరోజు ఇవ్వాల్సి ఉన్నా.. సుప్రీంకోర్టు ఉత్తర్వుల కాపీ అందకపోవడంతో విచారణ రేపటికి వాయిదా పడింది.
బెయిలా..? జెయిలా..?
అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ వ్యవహారం తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్ట్ మధ్య ఉత్కంఠగా మారింది. ఈనెల 25వరకు అరెస్ట్ వద్దంటూ గతంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులివ్వగా వివేకా కుమార్తె సునీత ఆ ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆమెకు అనుకూలంగా సుప్రీం ఉత్తర్వులిచ్చింది. అసలిలాంటి కేసుల్లో అరెస్ట్ నిలువరించేలా సీబీఐని ఆదేశించడం సరికాదని చెప్పింది సుప్రీం. దీంతో అవినాష్ రెడ్డి అరెస్ట్ ఖాయమనే వార్తలొచ్చాయి. అయితే హైకోర్టు తుది తీర్పు ఇవ్వాల్సి ఉండగా.. ఈరోజు వాదనలు జరిగాయి.
ముందస్తు బెయిల్ పిటిషన్ పై త్వరగా విచారణ చేపట్టాలని అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదులు ఈరోజు ఉదయం హైకోర్టు ధర్మాసనాన్ని కోరారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఒకవేళ సీబీఐ అరెస్టుకి సిద్ధపడితే... అవినాష్ పిటిషన్ పై విచారణ జరిపినప్పటికీ ప్రయోజనం ఉండదని వారు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సుప్రీంకోర్టు ఉత్తర్వుల కాపీ కావాలని న్యాయమూర్తి అడిగారు. ఆ కాపీ ఇంకా అందలేదని చెప్పడంతో మధ్యాహ్నం రెండున్నరకు కేసు వాయిదా పడింది. మధ్యాహ్నం కూడా ఉత్తర్వుల కాపీని అవినాష్ తరపు న్యాయవాదులు తెలంగాణ హైకోర్టుకి సమర్పించలేకపోవడంతో కేసు విచారణ రేపటికి వాయిదా పడింది.
మరోవైపు అవినాష్ రెడ్డి హైదరాబాద్ నుంచి పులివెందుల వెళ్లారు. ప్రతి సోమవారం ఆయన పులివెందులలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. ఈసారి ఒకరోజు ఆలస్యంగా ప్రజా దర్బార్ నిర్వహిస్తారని, అవినాష్ రెడ్డి ఆ కార్యక్రమానికి హాజరవుతారని కార్యకర్తలకు సమాచారం అందింది.