Telugu Global
Telangana

ఊళ్లో పెళ్లికి కుక్కల హడావిడి.. వైసీపీ ట్వీట్ వైరల్

ఆంధ్రాలో బీజేపీ కావాలి. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే చాలట. ఇదేం బానిస సిద్ధాంతం చంద్రబాబు.. అంటూ ట్వీట్ వేశారు విజయసాయి రెడ్డి.

ఊళ్లో పెళ్లికి కుక్కల హడావిడి.. వైసీపీ ట్వీట్ వైరల్
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. రేవంత్ రెడ్డి ర్యాలీలో, గాంధీ భవన్ ముందు జరిగిన సంబరాల్లో కాంగ్రెస్ పార్టీ జెండాలు రెపరెపలాడాయి. అయితే గియితే ఆ పార్టీకి మద్దతిచ్చిన సీపీఐ జెండాలు, కోదండరాం పార్టీ జెండాలు అక్కడ కనిపిస్తే ఆశ్చర్యంలేదు. దానికి భిన్నంగా టీడీపీ జెండాలు కూడా రేవంత్ రెడ్డి ర్యాలీలో రెపరెపలాడాయి. గాంధీ భవన్ ముందు కూడా పచ్చ జెండాలు ఎగిరాయి. ఈ వ్యవహారంపై వైసీపీ నుంచి ఓ రేంజ్ లో పంచ్ లు పడుతున్నాయి. ఊళ్లో పెళ్లికి కుక్కల హడావిడి అంటూ వైసీపీ నేతలు ట్విట్టర్లో కౌంటర్లిస్తున్నారు.


వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అంబటి రాంబాబు సహా మరికొందరు నేతలు టీడీపీ జెండాల వ్యవహారంపై సెటైర్లు పేల్చారు. అసలు కాంగ్రెస్ విజయాన్ని టీడీపీ సెలబ్రేట్ చేసుకోవడమేంటని ప్రశ్నించారు. "చిత్రం భళారే విచిత్రం.. గాంధీ భవన్ లో తెలుగుదేశం జెండా" అంటూ మంత్రి అంబటి ట్వీట్ వేశారు. "ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడి అంటే ఇదే. తెలంగాణాలో కాంగ్రెస్ గెలిచిందని గాంధీభవన్ ముందు పచ్చ జెండాలతో టీడీపీ ఉబలాటం ప్రదర్శించింది. ఆంధ్రాలో బీజేపీ కావాలి. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే చాలట. ఇదేం బానిస సిద్ధాంతం చంద్రబాబు గారూ!" అంటూ ట్వీట్ వేశారు విజయసాయి రెడ్డి.


వాస్తవానికి కాంగ్రెస్ కి సపోర్ట్ చేయాలని కార్యకర్తలకు కానీ, అభిమానులకు కానీ టీడీపీ అధికారికంగా చెప్పలేదు. చంద్రబాబు, లోకేష్ పేరుతో లేఖలు కూడా బయటకు రాలేదు. కానీ టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరే క్రమంలో ఈ వ్యవహారాన్ని హైలైట్ చేశారు. తెలంగాణలో టీడీపీ పోటీ నుంచి విరమించుకోవడంతో లోపాయికారీ పొత్తు నడిచిందనే ప్రచారం జరిగింది. కొన్నిచోట్ల టీడీపీ నేతలు బీఆర్ఎస్ అభ్యర్థులకే తమ బహిరంగ మద్దతు తెలపడం విశేషం. చివరకు కాంగ్రెస్ విజయం తర్వాత టీడీపీ జెండాలు గాంధీ భవన్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వడమే ఇక్కడ అతి పెద్ద ట్విస్ట్.


First Published:  3 Dec 2023 5:12 PM IST
Next Story