Telugu Global
Telangana

షర్మిల మోసం చేసింది.. పార్టీ ఆఫీస్ ముందు రచ్చ

పార్టీ పోటీలో ఉందని, 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని చెప్పి అప్లికేషన్లు కూడా తీసుకున్నారు. తీరా నామినేషన్లు మొదలయ్యే రోజు కూడా చడీ చప్పుడు లేకుండా ఉన్నారు. దీంతో వైఎస్సార్టీపీ నేతలు ఆందోళనకు దిగారు.

షర్మిల మోసం చేసింది.. పార్టీ ఆఫీస్ ముందు రచ్చ
X

తెలంగాణ ఎన్నికల వేళ వైఎస్ షర్మిల తీవ్ర గందరగోళంలో ఉండిపోయారు. సొంతగా పోటీ చేయలేరు, అలాగని కాంగ్రెస్ లోకి వెళ్దామంటే ఎవరో ఒకరు అడ్డుపడుతున్నారు. ఈ దశలో ఏం చేయాలో తేల్చుకోలేక డైలమాలో ఉండిపోయారు షర్మిల. ఆమె పరిస్థితి అయోమయంగా ఉంటే, పోటీపై ఆసక్తితో ఉన్న నేతలు, క్యాడర్ కూడా ఇబ్బంది పడుతున్నారు. అసెంబ్లీ అభ్యర్థి అనిపించుకోడానికి చాలామంది ఉత్సాహవంతులు వైఎస్సార్టీపీ తరపున పోటీ చేసేందుకు రెడీగా ఉన్నారు. వారంతా ఇప్పటికే షర్మిల పాదయాత్రల్లో జన సమీకరణ కోసం డబ్బు ఖర్చు పెట్టారు. మీటింగ్ లు, పార్టీ ఆఫీస్ లు అంటూ హడావిడి చేశారు. చివరకు షర్మిల వ్యవహారం తేలకపోవడంతో వారంతా ఈరోజు పార్టీ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు.


షర్మిల డౌన్ డౌన్..

లోటస్ పాండ్ లోని వైఎస్సార్టీపీ కార్యాలయంలో కార్యకర్తలు, నేతలు షర్మిలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వుయ్ వాంట్ జస్టిస్, షర్మిలక్క డౌన్ డౌన్ అంటూ నిరసనకు దిగారు. నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ పోటీలో ఉందని, 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని చెప్పి అప్లికేషన్లు కూడా తీసుకున్నారు. తీరా నామినేషన్లు మొదలయ్యే రోజు కూడా చడీ చప్పుడు లేకుండా ఉన్నారు. దీంతో వైఎస్సార్టీపీ నేతలు ఆందోళనకు దిగారు.

మళ్లీ కాంగ్రెస్ తో మంతనాలు..

తెలంగాణలో ఒంటరిగా పోటీ చేయాలనే ఉద్దేశంతోటే వైఎస్సార్టీపీ అనే పార్టీ పెట్టారు షర్మిల. ఎన్నికలకు టైమ్ దగ్గరపడిన సమయంలో కాంగ్రెస్ లో తన పార్టీ విలీనం కోసం ప్రయత్నించారు. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆధ్వర్యంలో రాయబారాలు నడిచాయి. షర్మిల ఢిల్లీ వెళ్లి సోనియా, రాహుల్ ని కలసి వచ్చారు. కానీ ఎక్కడో వ్యవహారం తేడా వచ్చింది. దీంతో షర్మిల ఒంటరి పోరుకి సిద్ధమయ్యారు. ఆశావహులు దరఖాస్తులు చేసుకోండి, అన్నిచోట్లా పోటీకి దిగుతామన్నారు. ఇప్పుడు కూడా మళ్లీ ఎక్కడో తేడాకొట్టింది. షర్మిల ఒంటరిపోరుకి వెనక్కి తగ్గారు. మళ్లీ కాంగ్రెస్ తో మంతనాలు జరుపుతున్నారని తెలుస్తోంది. దీంతో కార్యకర్తలు, నేతలు ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పార్టీ ఆఫీస్ లో వైఎస్ఆర్ విగ్రహం ముందు ధర్నాకు దిగారు.

First Published:  3 Nov 2023 10:24 AM IST
Next Story