బీఆర్ఎస్ మేనిఫెస్టో.. వైసీపీ సంబరాలు
కేసీఆర్ పొగడ్తలు ఎలా ఉన్నా.. ఆయన కొత్త హామీ వైసీపీపై ఒత్తిడి పెంచుతోంది. సామాజిక పెన్షన్ ను రూ.5వేలు చేస్తామని మేనిఫెస్టో హామీ ఇచ్చారు కేసీఆర్. అంటే.. ఏపీలో కూడా ఆ పెన్షన్ పెంచాల్సిన పరిస్థితి.
బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేస్తే, ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకోవడం కామన్, కానీ ఇక్కడ వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా సంబరపడిపోతున్నారు. ఎందుకంటే అనుకోకుండా సీఎం కేసీఆర్ మేనిఫెస్టో విడుదల సమయంలో ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని మెచ్చుకున్నారు. ఏపీలో సామాజిక పెన్షన్ ల పెంపు కార్యక్రమం బ్రహ్మాండంగా అమలవుతోందన్నారు. తెలంగాణలో కూడా అలాగే పెన్షన్ల పెంపు కొనసాగుతుందని హామీ ఇచ్చారు.
పెన్షన్లపై కేసీఆర్ హామీ ఏంటి..?
ప్రస్తుతం తెలంగాణలో ఇస్తున్న సామాజిక పెన్షన్లను బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత 3వేల రూపాయలకు పెంచుతారు. ఆ తర్వాత దాన్ని ఏడాదికి 500 రూపాయల చొప్పున పెంచుకుంటూ పోతారు. అంటే ప్రభుత్వం టర్మ్ పూర్తయ్యేనాటికి పెన్షన్ రూ.5వేలు అవుతుంది. ఇలా చేస్తే ప్రభుత్వంపై ఒకేసారి భారం పెరగదు. ప్రతి ఏటా ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది కాబట్టి పెన్షన్ ని కూడా అడగకుండానే పెంచినట్టవుతుంది. అని స్పష్టం చేశారు కేసీఆర్. ఈ క్రమంలోనే ఆయన ఏపీలో అమలవుతున్న పెన్షన్ల పెంపుదలను ఉదహరించారు. ఏపీలో ఈ పెంపు అద్భుతంగా అమలవుతోందన్నారు. ఈ మాటల్ని వైసీపీ మీడియా హైలైట్ చేస్తూ వార్తలిస్తోంది.
పెంచడం, పెంచుకుంటూ పోవడం..
2018 ఎన్నికల సమయంలో పెన్షన్ ను 3వేల రూపాయలకు పెంచుతామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు జగన్. అధికారంలోకి వచ్చాక, పెంచడం అంటే పెంచుకుంటూ పోవడం అని కొత్త అర్థం చెప్పారు. ఒకేసారి పెన్షన్ ని పెంచబోనని, విడతలవారీగా పెంచుతానని అన్నారు. అప్పట్లో ఆయన వివరణతో చాలామంది నొచ్చుకున్నారు. ఒకేసారి పెన్షన్ పెరుగుతుందని ఆశపడ్డాం కానీ, విడతలవారీగా పెంచుతామంటూ మోసం చేశారనే విమర్శలు కూడా వినిపించాయి. కానీ సీఎం జగన్ చెప్పినట్టుగానే ఏడాదికి 250 రూపాయలు పెంచుకుంటూ వచ్చారు. 2024 జనవరి నుంచి పెన్షన్ రూ.3వేలు అవుతుంది. దీంతో ప్రజలెవరూ ఇప్పుడు అసంతృప్తితో లేరు. జగన్ మాటిచ్చినట్టుగానే పెన్షన్ పెంచారని సంబరపడిపోతున్నారు. ఈ గందరగోళమేదీ లేకుండా తెలంగాణలో ఏడాదికి 500 రూపాయల చొప్పున పెన్షన్ పెంచుతామంటూ క్లారిటీగా ముందే చెప్పేశారు సీఎం కేసీఆర్.
వైసీపీపై ఒత్తిడి..
కేసీఆర్ పొగడ్తలు ఎలా ఉన్నా.. ఆయన కొత్త హామీ వైసీపీపై ఒత్తిడి పెంచుతోంది. సామాజిక పెన్షన్ ను రూ.5వేలు చేస్తామని మేనిఫెస్టో హామీ ఇచ్చారు కేసీఆర్. అంటే.. ఏపీలో కూడా ఆ పెన్షన్ పెంచాల్సిన పరిస్థితి. 2024 వైసీపీ మేనిఫెస్టోలో కచ్చితంగా ఈ హామీ ఉండాల్సిందే. పొరుగు రాష్ట్రంలో పెంచారు కాబట్టి, ఇక్కడ కూడా పెంచాల్సిందేనంటూ ప్రజలనుంచి డిమాండ్ వచ్చే అవకాశముంది. అంటే ఒకరకంగా ఏపీ సీఎం జగన్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ ఒత్తిడి పెంచినట్టే లెక్క.