ఎటూ తేల్చుకోలేక పోతున్న వైఎస్ షర్మిల.. కాంగ్రెస్‌లో చేరాలా? పాదయాత్ర చేయాలా?
తెలంగాణ కాంగ్రెస్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సన్నిహితులుగా పేరున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి లీడర్లు వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయం చేయడానికి పెద్దగా అభ్యంతరం చెప్పడం లేదు.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకురాలు వైఎస్ షర్మిల రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. తెలంగాణనే తన రాజకీయ అడ్డాగా మార్చకొని.. కొత్త పార్టీతో ప్రజల ముందుకు వెళ్లారు. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరాలని పలు వైపుల నుంచి ఒత్తిడి రావడంతో.. తన రాజకీయ భవిష్యత్ బాగుంటుందని అంచనా వేసి.. ఓకే చెప్పారు. కాగా, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, అతడి వర్గం వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆమెను ఆంధ్రాకు పరిమితం చేయాలని ఏకంగా ఏఐసీసీకి లేఖ రాశారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సన్నిహితులుగా పేరున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి లీడర్లు వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయం చేయడానికి పెద్దగా అభ్యంతరం చెప్పడం లేదు. అయితే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ మాత్రం షర్మిల ఇక్కడి నుంచి అసెంబ్లీకి పోటీ చేయడానికి ససేమిరా ఒప్పుకోవడం లేదు. అందుకు గల కారణాలను కూడా వివరిస్తూ ఏఐసీసీకి లేఖ రాశారు. వైఎస్ఆర్ ఒకప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని.. ఇప్పుడు షర్మిలను కాంగ్రెస్‌లో చేర్చుకొని అసెంబ్లీ టికెట్ ఇస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని చెబుతున్నారు.
గత కొంత కాలంగా షర్మిల వ్యవహారం ఏఐసీసీ, టీపీసీసీ మధ్య పెండింగ్‌లో ఉండిపోయింది. అసలు ఎటూ తేల్చకుండా పక్కన పెట్టడంతో షర్మిల కూడా అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది. వాస్తవానికి ఈ నెల 3వ తేదీ నుంచే షర్మిల పాదయాత్ర మొదలు పెట్టాల్సి ఉన్నది. కాంగ్రెస్‌తో కుదరదని భావించి.. తన పార్టీ తరపునే ఎన్నికల్లో బరిలో దిగాలని నిర్ణయించుకున్నారు. అయితే, కొంత మంది కాంగ్రెస్ పెద్దలు ఆమె ముందు పాత ప్రతిపాదననే మరోసారి పెట్టినట్లు తెలుస్తున్నది.
వైఎస్ షర్మిల తనకు పాలేరు అసెంబ్లీ టికెట్ కేటాయించాలని పట్టుబడుతున్నారు. అయితే, తెలంగాణలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఆ ప్రతిపాదనను పక్కన పెట్టాలని కాంగ్రెస్ పెద్దలు చెప్పినట్లు తెలుస్తున్నది. సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలనుకుంటే తప్పకుండా ఆ టికెట్ కేటాయిస్తామని మరోసారి ప్రతిపాదించారు. సార్వత్రిక ఎన్నికలు కూడా వచ్చే ఏడాది ఏప్రిల్-మేలో ఉంటాయి. కాబట్టి అప్పటిలోగా సికింద్రాబాద్‌పై పూర్తి ఫోకస్ చేస్తే తప్పకుండా గెలుస్తారని బుజ్జగించినట్లు సమాచారం. ఒక వేళ ఈ ప్రతిపాదనకు ఓకే చెబితే.. వెంటనే ఢిల్లీకి తీసుకెళ్లి రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో జాయిన్ చేసుకుంటామని చెప్పినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి.
కాగా, తెలంగాణలో సుదీర్ఘంగా పాదయాత్ర చేసి, పాలేరుపై పూర్తిగా ఫోకస్ పెట్టిన తర్వాత కాంగ్రెస్ నుంచి ఇలాంటి ఆఫర్ రావడంపై అసంతృప్తిగా ఉన్నారు. గతంలోనే సికింద్రాబాద్ ప్రతిపాదనను తాను తిరస్కరించినా.. తిరిగి అదే ఫార్ములాను తన ముందు పెట్టడంతో షర్మిల తిరిగి ఆలోచనలో పడినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో తెలంగాణలో ఒంటరిగా పోటీ చేసి గెలిచే అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీలో చేరినా అసెంబ్లీ టికెట్ మాత్రం ఇవ్వరు. దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో షర్మిల ఉన్నట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్ ప్రతిపాదనపై త్వరలోనే ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.