కాంగ్రెస్ తో షర్మిల.. వైసీపీ రియాక్షన్ ఏంటంటే..?
వైసీపీ కూడా ఈ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. నేరుగా షర్మిలను టార్గెట్ చేయలేరు, అలాగని కాంగ్రెస్ తో ఆమె స్నేహాన్ని వైసీపీ నేతలు సమర్థించలేరు.
అన్న జగన్ ను జైలులో పెట్టించిన కాంగ్రెస్ పార్టీతో చెల్లెలు షర్మిల ఎలా పొత్తు పెట్టుకుంటుంది, ఆ పార్టీకి మద్దతుగా ఎలా పనిచేస్తుంది..? అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు వినపడుతున్నాయి. వైసీపీ కూడా ఈ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. నేరుగా షర్మిలను టార్గెట్ చేయలేరు, అలాగని కాంగ్రెస్ తో ఆమె స్నేహాన్ని వైసీపీ నేతలు సమర్థించలేరు. ఈ క్రమంలో మధ్యే మార్గంగా షర్మిల పార్టీ, ఆమె నిర్ణయాలు, ఆమె ఇష్టం అంటూ తేల్చేశారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల మద్దతివ్వడం ఆమె పార్టీపరంగా తీసుకున్న నిర్ణయం కావొచ్చని అన్నారు సజ్జల. పక్క రాష్ట్ర విషయాల గురించి సీఎం జగన్ పెద్దగా పట్టించుకోరని చెప్పారు. వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ అధినాయకత్వం ఇబ్బంది పెట్టిందన్న విషయం అందరికీ తెలుసని గుర్తు చేశారు. సోనియా దగ్గరికి వెళ్లినప్పుడు వైఎస్ జగన్ తో పాటు షర్మిల కూడా ఉన్నారని చెప్పారు.
వాస్తవానికి తెలంగాణ రాజకీయాలకు వైసీపీ చాన్నాళ్లుగా దూరంగా ఉంది. పూర్తిగా ఏపీకే పరిమితమైంది. అయితే సమయానుకూలంగా అక్కడి వ్యవహారాలపై నేతలు మాత్రం స్పందిస్తున్నారు. ఏపీ అభివృద్ధి, ఏపీ ఇబ్బందులపై తెలంగాణ నేతలు స్పందిస్తే వెంటనే వాటికి కౌంటర్లిస్తుంటారు. ప్రస్తుత ఎన్నికల వ్యవహారాలపై కూడా వైసీపీ ఎలాంటి కామెంట్లు చేయలేదు. తెలంగాణలో ఉన్న వైసీపీ మద్దతుదారులు, జగన్ అభిమానులు ఏ పార్టీకి ఓటు వేయాలనే విషయంపై ఎక్కడా బహిరంగ ప్రకటన చేయలేదు. అయితే టీడీపీ పోటీనుంచి విరమించుకున్న క్రమంలో.. ఆ పార్టీ కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తోందంటూ వైసీపీ అనుకూల మీడియా ఓ రేంజ్ లో సెటైర్లు పేల్చింది. అదే సపోర్ట్ షర్మిల మొదలు పెడితే మాత్రం అది ఆమె పార్టీపరంగా తీసుకున్న విధాన నిర్ణయం కావొచ్చని తేల్చేస్తున్నారు నేతలు.