కానిస్టేబుల్ కి చెంపదెబ్బ.. షర్మిల అరెస్ట్
కారులో ఎక్కేందుకు ప్రయత్నించగా ఓ మహిళా కానిస్టేబుల్ ఆమెను అడ్డుకున్నారు. ఆమె చెంప ఛెళ్లుమనిపించారు షర్మిల. మరో ఎస్సైపై చేయి చేసుకున్నారు.
మహిళా హక్కులపై ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే వైఎస్ షర్మిల, సాటి మహిళ అని కూడా చూడకుండా ఓ కానిస్టేబుల్ చెంప ఛెళ్లుమనిపించారు. ఆ దెబ్బతో కానిస్టేబుల్ ఒక్కసారిగా చెంప పట్టుకుని విలవిల్లాడింది. విధి నిర్వహణలో భాగంగా షర్మిలను అడ్డుకోవడమే ఆమె చేసిన తప్పు. విధుల్లో ఉన్న పోలీసులపై చేయి చేసుకోకూడదని తెలిసి, అందులోనూ పక్కనే ఉన్నది మహిళా కానిస్టేబుల్ అని తెలిసి కూడా షర్మిల చేసిన పని సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. మహిళా కానిస్టేబుల్ ని గట్టిగా చెంపదెబ్బ కొట్టిన షర్మిలని పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలించారు.
అసలేం జరిగింది..?
ఉదయాన్నే షర్మిల లోటస్ పాండ్ లోని తన ఇంటినుంచి బయటకు వస్తున్నారు. అయితే ఆమెకు ఇంటినుంచి బయటకు వెళ్లేందుకు అనుమతి లేదని, పోలీసులు అడ్డుకున్నారు. ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు, ఇతర పోలీస్ సిబ్బంది షర్మిలను తిరిగి ఇంటిలోకి వెళ్లిపోవాలని సూచించారు. కానీ షర్మిల వెనక్కి తగ్గలేదు. నన్ను హౌస్ అరెస్ట్ చేయడానికి మీరెవరు అంటూ గట్టిగా మాట్లాడారు. వడివడిగా అడుగులు వేసుకుంటూ ముందుకు కదిలారు. కారులో ఎక్కేందుకు ప్రయత్నించగా ఓ మహిళా కానిస్టేబుల్ ఆమెను అడ్డుకున్నారు. ఆమె చెంప ఛెళ్లుమనిపించారు షర్మిల. మరో ఎస్సైపై చేయి చేసుకున్నారు.
మీడియా అటెన్షన్ కోసం షర్మిల ఎక్కడలేని సాహసాలు చేస్తుంటారనే విషయం తెలిసిందే. గతంలో కూడా ఆమె పోలీసులతో ఎప్పుడూ గొడవపడేవారు. ఆదేశాలున్నాయని చెప్పినా పెడచెవిన పెట్టేవారు. అద్దాలు పగిలిన కారులో ప్రయాణించడం, సింపతీకోసం బ్యాండ్ ఎయిడ్ లు అంటించుకుని కూర్చోవడం.. ఇలాంటి విన్యాసాలన్నీ తెలిసినవే. తాజాగా ఆమె మరింత శృతిమించారు. ఎస్సైని తోసివేయడం, మహిళా కానిస్టేబుల్ ని కొట్టడంతో ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. షర్మిలపై తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. మహిళా కానిస్టేబుల్ కి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు. తెలంగాణ పోలీసులు కూడా ఈ చర్యను ఖండించారు.