Telugu Global
Telangana

షర్మిలకు దిక్కు తెలీటంలేదా?

కాంగ్రెస్ పార్టీ తమ కుటుంభాన్ని పెట్టిన ఇబ్బందులను మరచిపోయి తన పార్టీని విలీనం చేయటానికి సిద్ధపడటమే ఆశ్చర్యంగా ఉంది.

షర్మిలకు దిక్కు తెలీటంలేదా?
X

షర్మిలకు దిక్కు తెలీటంలేదా?

ఏదో చేసేద్దామని తెలంగాణాలో రాజకీయ పార్టీ పెట్టిన వైఎస్ షర్మిలకు దిక్కుతోస్తున్నట్లు లేదు. పార్టీ పెట్టి రెండేళ్ళయినా జనాల్లో ఇంకా గుర్తింపురాకపోవటంతో ఏం చేయాలో తెలుస్తున్నట్లు లేదు. అందుకనే గాలివాటులో ప్రయాణం చేస్తున్నారు. కొద్దిరోజులు కాంగ్రెస్‌తో పొత్తన్నారు. తర్వాత లేదు లేదు విలీనమే అన్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఏపీ బాధ్యతలు తీసుకోమంటే తాను తెలంగాణాలోనే ఉంటానని స్పష్టం చేసినట్లు లీకులిచ్చారు. మధ్యలో ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు.

కాంగ్రెస్‌లో విలీనం ఇక లాంఛనమే అన్న సమయంలో పార్టీలో మొదటి నుండి షర్మిలకు మద్దతుగా నిలిచిన‌ కొండా రాఘవరెడ్డి, గట్టు రామచంద్రరావు, ఏపూరి సోమన్న లాంటి వాళ్ళు పార్టీకి రాజీనామాలు చేశారు. తీరా చూస్తే కాంగ్రెస్‌తో పొత్తూలేదు, విలీనమూ లేదని తేలిపోయింది. తర్వాత తనను మిర్యాలగూడలో పోటీ చేయమని ఒత్తిడి వస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడేమో పాలేరులో పోటీకి రెడీ అయ్యారు. ఈ నెల 6వ తేదీన నామినేషన్ వేయబోతున్నారు.

పై ఘటనలన్నీ షర్మిల అపరిపక్వతను స్పష్టం చేస్తున్నాయి. అసలు కాంగ్రెస్‌తో చర్చలు జరపటమే షర్మిల చేసిన తప్పు. తన తండ్రి వైఎస్సార్ చనిపోయిన తర్వాత సోదరుడు జగన్మోహన్ రెడ్డిపై కేసులుపెట్టి 16 మాసాలు కాంగ్రెస్ జైలులో గడిపేలా చేసిన‌ విషయాన్ని మరచిపోయినట్లున్నారు. అలాగే వైఎస్సార్ పైన కూడా కేసులు నమోదు చేసిన విషయాన్ని షర్మిల పట్టించుకోలేదు. పైగా వైఎస్సార్ పై నమోదైన కేసుల విషయంపై సోనియాగాంధీ వివరణను షర్మిల నమ్మటమే విచిత్రంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ తమ కుటుంభాన్ని పెట్టిన ఇబ్బందులను మరచిపోయి తన పార్టీని విలీనం చేయటానికి సిద్ధపడటమే ఆశ్చర్యంగా ఉంది.

అయితే అనేక కారణాల వల్ల చివరకు కాంగ్రెస్‌కు షర్మిల దూరమైపోయారు. ఇప్పుడేమో పాలేరులో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. 119 నియోజకవర్గాలకు వైఎస్సార్టీపీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను దశలవారీగా విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో షర్మిల రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తే విజయమ్మ మాత్రం పాలేరులో ఉండి ప్రచార బాధ్యతలను మోయబోతున్నట్లు సమాచారం. పాలేరులో పోటీ చేయబోతున్న షర్మిల ఫలితం ఎలాగుంటుందో ఏమో.

First Published:  2 Nov 2023 10:37 AM IST
Next Story