Telugu Global
Telangana

షర్మిలకు సీఎం అయ్యే ఛాన్స్.. ఇక్కడ కాదు అక్కడ

తల్లికి, చెల్లికి జగన్ రాజకీయంగా అన్యాయం చేశారని, ఈ విషయాన్ని షర్మిల ఆంధ్రాకు వెళ్లి అక్కడి ప్రజానీకానికి మొర పెట్టుకోవాలన్నారు.

షర్మిలకు సీఎం అయ్యే ఛాన్స్.. ఇక్కడ కాదు అక్కడ
X

వైఎస్ షర్మిల కచ్చితంగా సీఎం అవుతారని జోస్యం చెప్పారు బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. అయితే ఆమె తెలంగాణకు సీఎం కావాలని కలలు కంటున్నారని, ఆ కలలు నెర వేరవని, అన్నీ కుదిరితే ఆమె ఏపీకి సీఎం అయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. అంతే కాదు, ఆమె ఏపీకి ఎలా సీఎం అవుతారనే విషయంపై కూడా వివరణ ఇచ్చారు. దీంతో ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి.

రేపో మాపో ఏపీ సీఎం వైఎస్ జగన్ జైలుకెళ్తారని, ఆయన స్థానంలో ఆయన సోదరి వైఎస్ షర్మిల ఏపీ ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు కడియం శ్రీహరి. ప్రస్తుతం షర్మిల పాదయాత్ర వరంగల్ జిల్లాలో కొనసాగుతోంది. తెలంగాణ బడ్జెట్ పై కూడా ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దీంతో అదే జిల్లానుంచి బీఆర్ఎస్ నేతలు షర్మిలకు కౌంటర్ ఇస్తున్నారు. కడియం శ్రీహరి ఇచ్చిన కౌంటర్ తో కాస్త కలకలం రేగింది.

బడ్జెట్‌పై షర్మిల చేసిన కామెంట్స్ బాధాకరమన్న కడియం, వైఎస్ కుటుంబం మొదట్నుంచీ తెలంగాణకు వ్యతిరేకంగానే ఉందన్నారు. సమైక్యాంధ్రే వారి నినాదం అని ఊరూరా తిరిగిన వ్యక్తి షర్మిల అని గుర్తు చేశారు. పార్లమెంటులో జగన్ ప్లకార్డు పట్టుకుని తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన విషయాలను కూడా ప్రస్తావించారాయన. షర్మిలకు నిజంగానే అన్యాయం జరిగిందని, జగన్ సీబీఐ కేసులో జైలులో ఉన్నప్పుడు.. షర్మిల, విజయమ్మలు పాదయాత్ర చేసి పార్టీని బలోపేతం చేశారని చెప్పారు. తల్లికి, చెల్లికి జగన్ రాజకీయంగా అన్యాయం చేశారని, ఈ విషయాన్ని షర్మిల ఆంధ్రాకు వెళ్లి అక్కడి ప్రజానీకానికి మొర పెట్టుకోవాలన్నారు.

సీబీఐ కేసులోనో, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులోనో జగన్ జైలుకి వెళ్లే అవకాశముందని, ఆయన జైలుకి వెళ్తే కచ్చితంగా షర్మిల సీఎం అవుతారని జోస్యం చెప్పారు కడియం శ్రీహరి. అనవసరంగా ఆమె తెలంగాణలో తిరిగి సమయాన్ని వృథా చేసుకుంటున్నారని, అసలామెకు తెలంగాణలో తిరిగే నైతికతే లేదన్నారు. జగన్ జైలుకి ఎప్పుడు వెళ్తారా అని ఎదురు చూసి ఏపీ సీఎం సీటు పట్టేయడం మేలు అంటూ ఆమెకు సలహా ఇచ్చారు.

First Published:  8 Feb 2023 4:08 AM GMT
Next Story