Telugu Global
Telangana

నేను, నా భర్త, మా అమ్మ.. అందరం పోటీ చేస్తాం

కాంగ్రెస్ తో చర్చలు జరిపి 4 నెలలు ఎదురు చూశామని, అయినా ఫలితం లేదన్నారు. తెలంగాణలో మళ్లీ వైఎస్సార్ సంక్షేమ పాలన తెస్తామన్నారు షర్మిల. 119 నియోజక వర్గాల్లో గట్టి పోటీ ఇస్తామని చెప్పారు.

నేను, నా భర్త, మా అమ్మ.. అందరం పోటీ చేస్తాం
X

అంతా అనుకున్నట్టే అయింది. కాంగ్రెస్, వైఎస్సార్టీపీ దోస్తీ కట్ అయింది. విలీనం కూడా లేదని తేలిపోయింది. మొత్తం 119 స్థానాల్లో అభ్యర్థులను నిలబెడుతున్నట్టుగా ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. ఆశావహులు టికెట్ల కోసం దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారామె. అంతే కాదు ఈ ఎన్నికల్లో తాను రెండు చోట్ల నుంచి పోటీ చేస్తానని, భర్త అనిల్, తల్లి విజయమ్మ కూడా అసెంబ్లీ బరిలో ఉంటారని స్పష్టం చేశారు.

కార్యవర్గ సమావేశం..

ఆ మధ్య షర్మిల వెళ్లి సోనియా గాంధీని కలసి వచ్చిన తర్వాత కాంగ్రెస్ లో వైఎస్సార్టీపీ విలీనం జరగడం ఖాయం అనుకున్నారంతా. కానీ ఎందుకో ఆ ప్రక్రియ ఆగిపోయింది. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ జోక్యం చేసుకున్నా కూడా ఫలితం లేదు. దీంతో షర్మిల కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పారు. సొంతగా పోటీ చేస్తామని తేల్చి చెప్పారు. ఈ రోజు వైఎస్సార్టీపీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది.

కాంగ్రెస్ తో కలిసి వెళ్తే ప్రజా వ్యతిరేక ఓటు చీలదు అనుకున్నామని, ఒంటరిగా పోటీ చేస్తే ప్రజా వ్యతిరేక ఓటు చీల్చిన అపఖ్యాతి వస్తుంది అనుకున్నామని.. కానీ కాంగ్రెస్ తో కలవడం సాధ్యం కాలేదన్నారు. కాంగ్రెస్ తో చర్చలు జరిపి 4 నెలలు ఎదురు చూశామని, అయినా ఫలితం లేదన్నారు. తెలంగాణలో మళ్లీ వైఎస్సార్ సంక్షేమ పాలన తెస్తామన్నారు షర్మిల. 119 నియోజక వర్గాల్లో గట్టి పోటీ ఇస్తామని చెప్పారు. తాను పాలేరు నుంచి పోటీ చేస్తానని, రెండోచోట కూడా పోటీ చేయాలనే డిమాండ్ ఉందన్నారు. బ్రదర్ అనిల్, విజయమ్మని కూడా పోటీ పెట్టాలనే డిమాండ్ ఉందని, అవసరమైతే వారు కూడా పోటీ చేస్తారన్నారు షర్మిల.

First Published:  12 Oct 2023 4:15 PM IST
Next Story