ఏపీలో దారుణం... పోలీసుల చిత్రహింసలతో యువకుడి ఆత్మహత్య
కృష్ణా జిల్లా కంకిపాడు పోలీసు స్టేషన్ లో అరవింద్ అనే యువకుడిని పోలీసులు చిత్రహింసలు పెట్టడంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో కంకిపాడులో ఉద్రిక్తపరిస్థితి నెలకొంది.
ఏపీలోని కృష్ణా జిల్లా కంకిపాడు పోలీసు స్టేషన్ లో ఓ యువకుడిపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతో ఆ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
కంకిపాడులో రాజులపాటి అరవింద్ అనే యువకుడు తన పిన్ని వరస అయ్యే మహిళ ప్రైవేటు కాల్ రికార్డులను వాట్సప్ గ్రూపుల్లో పెట్టాడని ఆ మహిళ పోలీసులకు పిర్యాదు చేయడంతో పోలీసులు అరవింద్ ను స్టేషన్ కు పిలిపించారు. ఆ మహిళ ముందే అరవింద్ బట్టలు విప్పించి దారుణంగా కొట్టారని అరవింద్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
పిర్యాదు చేసిన మహిళతో సన్నిహిత సంబంధం గల ఇద్దరు కానిస్టేబుళ్ళు అరవింద్ ను బూతులు తిడుతూ దారుణంగా హింసించారని, అతనికి ఎక్కడా ఉద్యోగం రాకుండా కేసులు బనాయిస్తామని బెదిరించారని అరవింద్ తల్లి ఆరోపించింది. ఆ అవమానం భరించలేని అరవింద్ ఇంటికొచ్చి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు తన ఆత్మహత్యకు పోలీసులే కారణమంటూ లేఖ రాశాడని కుటుంబ సభ్యులు చెప్తున్నారు.
అరవింద్ ఆత్మహత్యతో కంకిపాడులో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అరవింద్ మృతదేహంతో బంధువులు పోలీసు స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. అతనిని హింసలకు గురి చేసి అవమానించిన కానిస్టేబుళ్ళపై వెంటనే చర్యలు తీసుకోవాలని, వారిపై కేసు నమోదు చేయాలని అరవింద్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.